SUNDARA MANDARALU FROM 01to248#lyrical #audio_video#yedavalli_sudarshan_reddy

    



SUNDARA MANDARALU PDF BOOK PDF DOWNLOAD LINK: CLICK HERE

183. లేని దానిని వదిలేది ఉండదు. ఉన్నదానిని పొందేది లేదు. లేకనే ఉన్నట్లు గోచరించేది భ్రాంతి. ఉన్నది ఉన్నట్లు తెలియుటే శాంతి. నీవు కానిది, నీకు లేనిది లేదు; లేదు; లేదు. ఇది వినుటయే నీకు చేదు. ఇది నీ స్వరూప లక్షణం కాదు.

184, పూలు వాడిపోతాయి. దారము వాడిపోదు. నామరూపాలన్నీ నశించి పోతాయి. చైతన్యము దారములాగా. స్థిరంగా ఉంటుంది.

185. ధనం అన్నం పెడుతుంది; ఆకలి పుట్టించలేదు. కలిమి కలాన్ని కొని పెట్టగలదు; కవిత్వాన్ని కదిలించలేదు. సంపదలు అవసరాలను తీర్చవచ్చు. ఆవేదనలను తొలగించలేవు. ధనం

దారిద్ర్యాన్ని తొలగించగలదేమో గాని ఐశ్వర్యాన్ని ప్రసాదించలేదు.


186. గాలము జలములో ఉంది. మీనమును ఆహ్వానించలేదు. మీనమే మోహంతో గాలాన్ని సమీపించింది. ఏం పొందిందో తెలియదు ప్రాణాన్ని మాత్రం పోగొట్టుకుంది. జీవన ప్రవాహంలో ఏ వస్తువూ మనల్ని బాధించదు. ఏ వ్యక్తీ మనల్ని బంధించడు. అన్ని స్వయంకృతాలే. చిత్తములు వేసే చిందులే.

187, మార్పులేని బ్రతుకు ఏమిస్తుంది తీర్పు? కూర్పు నేర్చి, ఓర్పుతో  బ్రతికితే అపుడే కనువిప్పు. ఆ తరువాత, నీవే ఒక వేలుపు.

188. శిక్షణకై బాట నెక్కిన నీకు రక్షణ తోడుగా ఉంది. అడుగులు మెల్లగా ముందుకు వేయి. పిడుగులు పడినా, మడుగులు ఎదురైనా వెనుకాడకు.వెను దిప్పకు. వెన్నుని దారిలో మన్ను కూడా వెన్నయే నని మరచిపోకు.

189. ఇదొక గారడీ ప్రపంచము. విషయ సుఖాలనే మతాబులు క్షణిక వెలుగులలో తైతక్కలాడకు. రాలే లోగా వెలిగే దెలాగో ఆలోచించు. కూలేలోగా పరమాత్మ బడిలో వాలే దెలాగో యోచించు.

190. తీపి పదార్థాలు రోగి ప్రాణాలను తోడేస్తుంటే, చేదు మందులు చేయూత నిచ్చి రక్షిస్తున్నాయి. ప్రాణాలు పోస్తున్నాయి. తీపిలో ఎంత చేదు? చేదులో ఎంత తీపి,

191. దేహాలన్నీ ఒకే రకమైన ఆహారాన్ని గ్రహించటం లేదు. దేహాలన్నీ శ్మశానంలో ఒకే రంగు గల బూడిదగ కనిపిస్తున్నాయి. నీవు ఏ మార్గంలో పయనించినా, గమ్యము చేరిననాడు అది అద్వైతమే. అదే విభూతి సుందరుని వైభవం.

192. బ్రతుకు నవ్వులాట కాదు. నవ్వుతూ ఆడే ఆట. బ్రతుకులో నవ్వ లేనివాడు నగుబాట్లకు గురి

అవుతాడు. నవ్వలేని క్షణం మరణం. నవ్వుతూ బ్రతికే క్షణమే జీవనం.

193. బ్రతకడం మనిషికి చేతనయింది. కాని, బ్రతుకంటే ఏమిటోతెలియకుండా పోయింది. బ్రతక

నేర్చిన సమాజంలో మనిషి క్షణక్షణానికి మరణిస్తాడు. బ్రతుకు నేర్పే సమాజంలో మనిషి అమృత స్వరూపు డవుతాడు.

194. ఈ ప్రపంచంలో ఎవరూ ఎవర్నీ మార్చాల్సిన అవసరం లేదు. జ్ఞానంతో, ప్రేమతో జీవించగలిగితే చాలు. కల్పవృక్షము క్రింద ప్రతి సంకల్పం ఫలించినట్లు, ఆశ్రితుల బ్రతుకులు

అమృతమయ మవుతాయి.

195. దోషిని కారాగారంలో బంధిస్తారు. అది అతనికి శిక్ష. అబద్దాలు పలికే వాడికి శిక్ష ఏమిటి? అతని మాటల్ని సమాజంలో ఎవరూ నమ్మరు. అంతకు మించిన శిక్ష మనిషికి ఏముంది?

196. మనకు సంపద ఉండొచ్చు. అది తాత్కాలికంగా కొంతకాలం ఉంటుంది. ఎందుకని? రాక ముందు మన వద్ద లేదు. వచ్చినా ఒకనాడు ఉండబోదు. ఒకవేళ ఉండినా మనం పోవచ్చు. 

“ఇవి నా కున్నాయి. కాని, ఇవి నావి కావు" అనే సత్యం మనస్సులో స్థిరపడిననాడే మనిషికి శాంతి.

197. అందరు అందరి కొరకు ఉన్నారనే సందేశాన్ని అందరు అర్థం చేసుకోవాలి. అప్పుడే బుద్ధులు వికసిస్తాయి. బ్రతుకులు శోభిస్తాయి.

198. జ్ఞానికి జగత్తు లేనిది కాదు. జగత్తుగా లేనిది. ఉన్నట్లు ఉంది. ఉన్నా లేనట్లే ఉంది. రజ్జువులో సర్పంలాగ ఉంది. ఆకాశంలో నీలి వర్ణంలాగ ఉంది. ఛాయలాగ ఉంది. మాయలాగ ఉంది.

199. ఏది మనకున్నా అది మనది కాదని, మన కొరకు ఉన్నదని, అది కూడా ఎప్పుడూ ఉండదని, ఉన్నంత వరకు పరమాత్మ ప్రసాదంగా ఉన్నదని గ్రహించి, ప్రశాంత చిత్తులై జీవించు వివేకవంతులు 

మోక్షార్హులు.

200. జలం ఎరుగదు కులం. గాలి ఎరుగదు గోత్రం. ఏ పెరట్లో విచ్చుకున్నా మల్లెల సువాసన ఒకేలాగ ఉంటుంది. ఎవరి నవ్వు వెనుకైనా ఆహ్లాదమే ఉంటుంది.

201. తెలియక చేతులు కాల్చుకుంటే, తెలిసి చికిత్స చేయించుకుంటున్నాం. తెలియక అజ్ఞాన మార్గంలో పరిభ్రమించి ఉండవచ్చు. తెలిసి జ్ఞానరహదారుల్లో నడవడానికి నడుం బిగించాలి. అప్పుడే ప్రగతి. సద్గతి.

202. సరోవరంలో చేప లున్నట్లు సమాజంలో మహాత్ములు ఉంటారు. చేపల కారణంగా సరోవరం నిర్మలంగా ఉంటుంది. మహాత్ముల కారణంగా మహిలో మహిమ శోభిస్తుంది.

203. అవరోధాలు లేకపోవటం అభివృద్ధి కాదు. అవరోధాల మధ్య అవగాహనతో జీవించటము అభివృద్ధి. అవగాహన కుదిరితే బ్రతుకు కుదుటపడుతుంది. అవగాహనను పెంచుకోవటమే మనం చేయవలసిన కృషి ఆ తరువాత నిలిచేది భగవంతుని కృప.

204. ఆడుకో. కాని, ఓడిపోతే అపజయమని భావించకు. ఓడిపోవటంలో నీవు ఏదీ పోగొట్టుకోలేదు.

ఓటమి ఎందుకు కలిగిందో తెలుసుకున్నావు. ఇక నిన్ను ఎవరు ఓడించగలరు? ఇక, గెలుపు నీదే.

205. పవిత్రమైన జగదాలయంలో మనం పూజారులం. అన్నిటిని సమర్పించేందుకే మనం ఇక్కడ

ఉన్నాం. సమర్పణలో మనకు లభించేది ప్రసాదము. అదే ప్రశాంతత. అదే పవిత్రత.

206. మస్తకాలు సిద్ధపడకపోతే పుస్తకాలు చేసేదంటూ ఏదీ ఉండదు. బుద్ధి శుద్ధి పడకపోతే బోధలు రుచించవు. రుచించినా ఫలితాలను ప్రసాదించవు.

207. మనకు ఏది జరిగితే మనం భరించలేమో దానిని ఇతరులు కూడా భరించలేరేమో! ఇతరులు మనపట్ల ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా మనం ఇతరుల పట్ల ప్రవర్తించాలి. ఇది ధర్మం. జయానికి మూలం. "యతో ధర్మః తతో జయ".

208. ఒకరు మనల్ని బాధించటానికి శత్రుత్వమే ఉండాల్సిన అవసరం లేదు. మురికి గుంటలకి మనకు శత్రుత్వ మేముంది?   దోమలకు మనకు దోస్తి ఏముంది? అలాగని శత్రుత్వం మాత్రం ఏముంది? అదే పనిగా కుడుతున్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అంతే. కొందరిని

మనం అలాగే అర్థం చేసుకోవాలి.

209. తప్పులు చేస్తూ బ్రతుకు పెరగటం తప్పు కాదు. పెరిగే బ్రతుకు తప్పులను సరిదిద్దుకోలేకపోతే

బ్రతుకు బండబారిపోతుంది. భారమైపోతుంది. సుఖమనేది మనిషికి దూరమైపోతుంది.

210. అందరినీ సుఖపెట్టే శక్తి మనకు లేదు. అందుకనే, "సర్వేజనాః సుఖినోభవన్తు" అని అప్రమేయ వరదుడు, అనంతుడు అయిన పరమాత్మను ప్రార్థిస్తున్నాము.

211. గాయం కావడం అసహజం కాదు. గాయాన్ని మాన్పుకొనే ప్రయత్నం చేయకపోవటం 

సహజమైతే మాత్రం పెద్ద ప్రమాదమే.

212. మన బాధలకు ఇతరులు కారణం అని గ్రహించటానికి జ్ఞానం అవసరం లేదు. మన బాధలకు

మనమే కారణం అని గ్రహించటానికి జ్ఞానం కావాలి. ఇది అర్థమైతే మనం బాధపడకుండా జీవించగలం.

213. మనం తిరిగే కాకులం కాము. రాలే ఆకులం కాము. కదలలేని మాకులం కాము. జ్ఞానంతో చరించే మానవులం. దీనుల మనే అధైర్యం వద్దు. దీన బాంధవుడు ఉన్నాడనేదే ముద్దు.

214. నీవు లేనిదే మనస్సు లేదు. మనస్సు లేకపోయినా నీవు ఉంటావు. మనస్సు ఉండొచ్చు. నీవు మనస్సు కాదు. నీవు గాని మనస్సు నిన్నెలా బాధ పెడుతుంది?

215. రాయి కదలదు. నీరు నిలవదు. ఉన్నచోటే ఉంటుంది రాయి. ఊరేగుతూ ఉంటుంది జలం. నీవు ద్రవిస్తేనే ఇతరులను స్పృశిస్తావు. ఇలా జీవించాలి అని తెలిపేందుకే కదిలే నీరు కదలని రాయిని స్పృశించి ముందుకు పోతుంది.

216. రాకుండా ఉండే జ్ఞానమూ లేదు. పోకుండా ఉండే అజ్ఞానమూ లేదు. మన ప్రయత్నమే ప్రధానం. ఆ తరువాతే ఏదైనా. ఇది అర్థమైన వారికే దైవ సహాయం.

217. ఇతరులు నిన్ను గూర్చి చేసే ఆలోచనలు వేరు. ఇతరులు నిన్ను గూర్చి అలా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు అని నీవు ఆలోచించే విధానం వేరు. ఇక్కడే ఆవేదనలు

ఆరంభమవుతాయి. కష్టాలు కదుల్తాయి. కన్నీళ్ళు జారుతాయి. గుండెలు పగులుతాయి.

218. మెదడు దాచుకుంటుంది. మనస్సు సంపాదిస్తుంది. అందిన వాటిని మెదడు ఉంచుకోవచ్చు. లేదా, పారేసుకోవచ్చు, అందని వాటిని పట్టు కోవటం, తెచ్చుకోవటం మెదడుకి చేతకాదు. మనస్సుకే సాధ్యం.

 219. నీవు ఆశించేది అంతం కలిగిన దైతే దానిని పొంది సాధించే దుండదు. ఒకవేళ అది అనంతమే అయితే, అట్టి దానిని అర్థం చేసుకోవాలే గాని, కర్మ ద్వారా పొందాలనుకొంటే మాత్రం

అది కుందేటి కొమ్మే అవుతుంది.

220. ఇతరుల ఆలోచనలతో కలిసి కొంతసేపు ఆలోచించటానికి మించిన సేవ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దీనిని అంగీకరించటానికి అనుభవ మొక్కటే సరిపోదు. సౌజన్యంతో కూడిన జీవితం కావాలి.

221. కళాయి లేని అద్దం కుళాయి లేని టాంకు వంటిది. అద్దానికి వెనుక కళాయి ఉండాలి. టాంకు ముందు కొళాయి ఉండాలి. నీకు మాత్రం, ముందు వెనుక భగంతుడే ఉండాలి. అప్పుడే బ్రతుకుకు సార్థకత ఏర్పడుతుంది.

222. సుఖపడాలని ప్రయత్నించినంత వరకు నీవు సుఖపడలేవు. నీవే సుఖమని నీకు తెలిసినపుడే నీవు సుఖపడతావు.

223. రుచులెన్నున్నా రుచి చూచే నాలుక ఒక్కటే. భక్షింపబడేవి ఎన్నయినా భరించే కుక్షి ఒక్కటే. పదార్థాలెన్నయినా, అవి ప్రసాదించే శక్తి ఒక్కటే. అంకెలెన్నయినా వాటిలో ఉన్న దొక్కటే. అదే అద్వయం. అదే అద్వైతం. అదే అద్వితీయం. అదే అనంతం.

224. సముద్రంలో లవణమున్న మాట నిజమే. కాని, ఆణిముత్యాలు లేవనుకోవటం సత్యం కాదు. పాల సముద్రంలోనే హాలాహలం. పలుకు నేర్చిన సమాజంలోనే కోలాహలం. ఇది అర్థం కాకపోతే అంతా చింతే. అర్థమైతే, బ్రతుకంతా నిశ్చింతే.

225. సమస్యలు కొత్తవి కావచ్చు. పరిష్కారం పాతదే. దారి తప్పటమే సమస్యలకు కారణం. చక్కని రాజమార్గమే ఏకైక పరిష్కారం. ఇదే జ్ఞానమార్గం.

226. పాముల్ని చూచి అందరు పరుగెత్తిపోతారు. కాని, శివుడు వాటినే ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. ప్రపంచం ఎవరినైనా దూరం చేయవచ్చు. పరమాత్మ అందరినీ దగ్గరకు

చేర్చుకుంటాడు.

227. అవసరాలకు మించిన ఆస్తులు ఆంతర్యంలో ఒత్తిళ్ళను పెంచుతాయి. గందరగోళాన్ని సృష్టిస్తాయి. తూర్పులో పడమరను చూపిస్తాయి. ఆశలన్నీ చెడ్డవి కావు. పేరాశ లేవైనా మంచివి

కావు.

228. నంది పశువైనా పశుపతిని ముందుంచుకొనిన భాగ్యానికి పూజ లందుకుంటోంది. సంసారాలు

మోయటం అందరికీ ప్రీతి. శివుణ్ణి మోయటం నందికి ప్రీతి.

229. బాధలకు దూరం కావాలని ఆలోచిస్తాం. వాటిని దగ్గరకు తెచ్చుకున్నది మనమే అనే సత్యాన్ని గ్రహించము. పిలవకుంటే, అవి దూరంగానే ఉంటాయి. బాధలకన్నా వాటిని కొని తెచ్చుకొనే ఆలోచనా విధానమే చాలా భయంకరమైనది. ప్రమాదకరమైనది.

230. ధేనువు క్షీరము నిస్తుంది. తరువు ఫలముల నిస్తుంది. గురువు. జ్ఞానము విస్తాడు. దేవగురుడు బృహస్పతి. గురుదేవు డెప్పుడైనా సరస్వతే.

231. ఎత్తు ఎదిగే వరకు, పొత్తు కుదిరే వరకు “అమ్మా! ఎత్తుకో!” అని మొత్తు కోవడమే బిడ్డ పని. అదే ప్రార్థనల రూపంలో మన ముందున్న పని.

232. కర్కశాలు, కాఠిన్యాలు లేనివి కానవసరం లేదు. అవి మనకు తెలియకపోతే చాలు. తేలికపడి ఉంటాం. హాయిగా తేలిపోతూ ఉంటాం.

233. సేవ చేసేది పరుల కోసం కాదు. మన కోసమే. ఈ సత్యం అర్థం కానంత వరకు సేవకు రూపం రాదు.

234. స్నేహితులు అవసరం లేదు. స్నేహ జీవనం అలవరచుకోవాలి. నది తన నీటిని కొందరికే పంచదు. ఎందరికైనా పంచుతుంది. కొందరికి పంచితే వాళ్ళే మనవాళ్ళు. అందరికీ పంచితే ఎవరూ మనవాళ్ళు కారు. మనం అందరికీ సంబంధించిన వాళ్ళమవుతాం. ఇది ఫలితా లాశించని

మహోత్తమ కార్యం. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞ జీవనం.

235. గాలి వీస్తూ ఉంటుంది. మనకు చాలా హాయిగా ఉంటుంది. గాలి ఒక చోట నిలవదు. వచ్చిపోతూ ఉంటుంది. వచ్చిపోతే సమస్య లేదు. వచ్చి ఉంటేనే ఏదైనా సమస్య (జ్ఞానం తప్ప).

236. లేనివాళ్ళను ఎవ్వరూ పిలవరు. ఉన్నవాళ్ళే అయినా పిలిస్తే గాని రారు. పరమాత్మ ఉన్నవాడే. పిలిస్తే పలుకుతూ వచ్చేవాడే. పిలిచే సంస్కారమే ఇప్పుడు మన బుద్ధికి పట్టాలి. ఇది అభ్యర్థన కాదు. ప్రార్థన.

237. మోసం చేసి ధనార్జన చేయ వచ్చు. ప్రజల దృష్టిని ఆకర్షించే దుస్తుల్లో, భవంతులలో, వాహనాలలో కనిపించవచ్చు. కాని, చూచేవారి కళ్ళకు అవేవీ కనిపించవు. వీటన్నిటిలో మోసగాడు కులుకుతున్నాడు అనే చూస్తారు. ఇంతకు మించి మోసగానికి మరణ మేముంటుంది?

238. తెలిసో, తెలియకో మనం కోరుకున్నవే మన వద్ద ఉన్నాయి. కోరిన వన్నీ మనతో ఉండకపోవచ్చు. కాని, ఉన్నవి మాత్రం మనం కోరుకున్నవే. శ్రమించి ఏరుకున్నవే.

239. ఆవు నుండి పాలే రావాలి. పేడ రాకూడదు అంటే వీలుపడదు. కర్మలు కూడా అలాగే ఉంటాయి. ఏ కర్మ చేసినా, అది పూర్ణంగా అర్థవంతంగా ఉంటుందని చెప్పలేము.

కొంత అభ్యంతరంగా కూడా ఉంటుంది. సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా, ఎవరితోను సంబంధం లేకుండా కాని, జీవించటం సాధ్యపడదు. సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసే ఉంటుంది.

240. తెచ్చుకున్న వాటిని తరిమితే పోవు. పోయే క్షణం వచ్చినపుడు పట్టుకున్నా నిలవవు. ఏడ్చినా వీడని నేస్తాలను నవ్వుతూ భరించటమే సుఖం. అక్కడే మనసుకు శాంతి.

241. తలపై బరువైన మూటల నుంచి నిద్ర పొమ్మంటే ఎవరికి సాధ్యం? మనస్సులో బరువులు నింపుకొని ధ్యానం చేయటం కూడా అంతే. బరువైన ధ్యానం బుద్ధిని తేలికపరచ లేదు. ఖాళీ అయితేనే నిండేది. మనస్సు ఖాళీ అయితేనే ధ్యానం పండేది.

242. ప్రపంచంలో అసంతృప్తి నిచ్చే ఆయాసాలే గాని, సంతృప్తి నిచ్చే పాయసాలు లేవని మనస్సుకు తెలియాలి. ఆశ లుడిగిన మనస్సు, రాగద్వేషాలను రాల్చేసుకున్న మనస్సు సదా ధ్యానంలోనే ఉంటుంది.

243. కట్టెలోని అగ్ని కట్టెనే దహింప చేస్తుంది. ఎవరిలో చెడు ఉన్నా అది ఉన్నవారికే కీడు. అనవసరంగా దానిని గూర్చి చర్చించి, ఆ చెత్తను నెత్తి కెత్తు కొంటే గుండెకు భారమే గాని బుద్ధి

తేలికపడదు.

244. జీవికి జీవన సమరం తప్పదు. నివారించలేము. అవగాహనను చిగురింప చేసుకోవాలి. సమరం బాహ్యంలో సాగుతూనే ఉండాలి. సాధన ఆంతర్యంలో కొన సాగుతూనే ఉండాలి.  

245. ఇచ్చేందుకు ఈ ప్రపంచానికి మనం ఏమి తెచ్చాం? ఇచ్చే చేతుల్ని తప్ప. అవి కూడా పరమాత్మ కృపతోనే చలిస్తున్నాయి. చేతులు పడిపోయిన వారిని చూచినపుడు ఈ సత్యం మనసుకు అర్థమవుతుంది. 

246. ఇవ్వటములో ఇచ్చేవాడు, పుచ్చు కొనేవాడు మాత్రమే ఉంటారు. సమర్పణలో మరొక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడే భగవంతుడు. ఆయన ఇచ్చేవాడిలో కదుల్తూ కర్తృత్వాన్ని లేకుండా

చేస్తాడు. పుచ్చుకొనేవాడిలో మెదుల్తూ కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని లేకుండా చేస్తాడు.

247. మనకు ఆశ ఉంది; శక్తి లేదు. పరమాత్మకు అపార శక్తి ఉంది; ఆశ లేదు. మన ఆశ ఆయన పాదాల నాశ్రయిస్తే ఆయన శక్తి మన బుద్ధి నావరిస్తుంది.

248. వాన కురుస్తున్నా ఇంటిలో ఉన్న నీవు తడవవు. నీలో నీవు నీవుగా ఉంటేనే తృప్తి.



Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free