Friday, October 16, 2020

కాలమహిమలో బందీలం! | దాసుని హృదయంలోనే దేవుడు | జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

 కాలమహిమలో బందీలం!

సర్వం కాలికమ్‌' అన్నట్లుగా కాలం జన్మతో మొదలై, జీవిలో భాగమై, మరణంతో ముగుస్తుంది. కాలం బలీయమైన ప్రవాహిని. అడ్డు అన్నది ఎరుగనిది. ఎత్తు పల్లాలు లేనిది. దీనికి ప్రయాణమే తెలుసు. ‘తన-పర’ భేదాలు లేనిది. అన్నిటినీ అనంతమైన ఆత్మతో కట్టి పడేసే పాశువు కాలం. ఆత్మ ఎప్పుడైతే ఒక పదార్థంగా మారుతుందో అప్పుడే కాలం పదార్థ గమనంలో భాగమైపోతుంది. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాలకు అన్నిటికీ దేని కాలం దానికుంటుంది. పుట్టిన ప్రతి ఒక్కటీ మరణించేదే. ఈ జనన మరణాలన్నీ కాలాధీనమే. అందుకే, కాలాధిపతిగా కాలుడిని, అతని ఆయుధంగా పాశువును చూపుతున్నది మన సనాతన శాస్త్రం. సూర్యుని నుంచి విడిపడ్డప్పట్నించే కాలం భూమికి కళ్ళెమైంది. ఒక ఆకృతిని పొందటంతోనే భూమి కాలానికి లోబడిపోయింది. భూ ‘భ్రమణ, పరిభ్రమణాలే’ కాలాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘భ్రమణం’ (తన చుట్టూ తాను తిరగడం) వల్ల దివారాత్రులు, ‘పరిభ్రమణం’ (సూర్యుని చుట్టూ తిరగడం) వల్ల ఋతువులతో సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. తన అక్షం మీద ఇరవై మూడున్నర డిగ్రీల కోణంలో వంగి పరిభ్రమిస్తూండటం వల్లే ఈ భూమిపై జీవం విస్తృతమైంది.


కాలాలు మారుతున్నకొద్దీ ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏర్పడుతాయి. సూర్యుని వేడి సముద్రనీటిని ఆవిరిగా మారుస్తుంది. భూభ్రమణం వల్ల వీచే గాలులు ఆ మేఘాలను భూమిపైకి తరలించి వర్షంగా చిలకరిస్తాయి. ఈ ‘కాలచక్రమే’ భూమిమీద జీవ పుట్టుక, మనుగడలకు కారణమవుతున్నది. సూర్యునిలోని నిప్పు, ఈ నక్షత్రకూటమిలోని భూమి, ధరణిని ఆశ్రయించిన నీరు, ఆవరించిన వాయువు, వీటికి స్థావరమైన ఆకాశం (పంచభూతాలు).. అన్నిటి చక్కని సమన్వయం, సహకారం, సానుకూలతలతో ఏర్పడే అద్భుత సంయోగమే భూమిపై జీవానికి ఒక అలంబన. ఇదంతా సైద్ధాంతికంగా నిజమే అయినా దీనిని మనం ప్రత్యక్షంగా దర్శించలేం. ఈ చర్యలన్నిటికీ కాలమే హేతువు. కాలానికి హేతువు ‘రూపాన్ని పొందడమే’. సర్వాంతర్యామి అయిన ఆత్మయే ఈ రూపానికి హేతువు అవుతున్నది. అంటే, కాలమే ఆత్మ, ఆత్మే కాలం. బ్రహ్మజ్ఞాని శ్రీకృష్ణుడు ‘విభూతియోగం’లో ఇదే చెప్పాడు. ‘నేనే కాలాన్ని. సృష్టిలో మొదలు, మధ్య, తుది నేనే. అన్నిటిలో ఉన్నది నేనే. హరించే మృత్యువును నేనే. కలిగేవారిలో భవిష్యత్తును నేనే. మాసాలు, ఋతువులు అన్నీ నేనే’ అన్నాడు. గీతద్వారా ‘విశ్వానికే పుట్టినిల్లు’ అయిన ఆత్మను ఎలాగైతే అర్థం చేసుకున్నామో అలాగే, ‘ఆత్మ అంతర్లీనంగా ప్రదర్శించే కాలానికి ఈ విశ్వమంతా బందీ అవడాన్ని’ కూడా అవగాహనపరచుకోవాలి. ఆత్మ ఎంత బలీయంగా, సాంద్రతతో విస్తరించిందో కాలమూ అంతే బలీయమైంది.


‘నిత్యం సన్నిహితో మృత్యుః’ అంటున్నది భారతీయ సనాతనం. కాలమే ప్రాణం పోస్తుంది, పోషిస్తుంది, ఆయువు తీస్తుంది. ‘కాలం-ఆత్మ-ఆయువు’ల అద్వైత తత్త సారమే జ్ఞానం. దీనిని పొందిన జ్ఞానికి జన్మ, జీవనం, భౌతికావసరాలపట్ల ఆసక్తి ఎలాగైతే ఉండదో, అలాగే మృత్యువుపట్ల భయం కూడా ఉండదు. భారతావనిలోని ఎందరో ఋషులు దీనిని నిరూపించారు. ఆత్మకున్న ఒక లక్షణమైన కాలం పదార్థంగా పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది కాబట్టి, కాలం పదార్థాన్నే బంధించగలుగుతుంది. కానీ, ఆత్మను కాదు. ఆత్మ అన్నిటికీ అతీతమవడమేకాక నిత్యమై, సత్యమై, సర్వాంతర్యామియై ఒప్పారుతున్నది. ఈ ఆత్మ నిరంతరతలో కాలమొక భాగం మాత్రమే. కాలం తన ధర్మాన్ని వదలక, చరాచర సృష్టి ఏకత్వాన్ని ఇలా నిర్విరామంగా పట్టి ఉంచుతూనే ఉంటుంది. ‘కాలమహిమ’ అంటే ఇదే మరి!.


రావుల నిరంజనాచారి




దాసుని హృదయంలోనే దేవుడు


దాసభక్తి లోకోపకారకమేకాక మోక్షసాధనమనీ ఆంజనేయస్వామి మొదలు ఎందరో రామభక్తులు లోకానికి చాటి చెప్పారు. ‘నాకు దాసమారుతిగా వుండటమే ఎంతో ఇష్ట’మని హనుమంతుడు వెల్లడించాడు. భగవత్సేవ చేసే అవకాశం దొరకకుంటేనే మారుతి బాధపడతాడు. అసాధారణ వినయ విధేయతలతోనే తాను నిరంతరం శ్రీరామునికి సేవ చేశాడు. ‘పరాక్రమానికి మూలం, బుద్ధికి పునాది, వివేచనా శక్తికి బీజాంకురం దాస్యభావమే’ అన్నది ఆయన భక్తితత్త్వం. మంచి నడవడి, జ్ఞానం, పవిత్రత, నిర్భయత్వం వంటి సద్గుణాలు లేకపోతే ‘దాస్యభక్తి’ కుదరదు. ఇవన్నీ కలిగిన ఆంజనేయుడు శ్రీరామునికి ఒక దాసునిలా సేవ చేయటమే తప్ప ప్రతిఫలం కోరలేదు. సూర్యుని వద్ద నవ వ్యాకరణాలు నేర్చినా ఒద్దికగా వుండేవాడు. రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం చేరే వేళ, బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు తొలిసారిగా పరిచయమైన తరుణంలో శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. కారణం, అతని వినయం, పలుకులలో స్పష్టత, మృదుత్వం, నిశ్చలత! ‘పెద్ద పండితుడై ఉంటాడు’ అని రాముడు భావించాడు. 


రామునికేకాదు, సీతమ్మ వారికికూడా అత్యంత ప్రేమపాత్రుడైన దాసానుదాసుడు పవన సుతుడు. పట్టాభిషేకం తర్వాత రాముడు అందరికీ కానుకలు ఇస్తుంటాడు. హనుమంతునికి ఏం ఇవ్వాలని సీతమ్మ ఆలోచిస్తుంది. తన మెడలోని నవరత్నాల హారాన్ని రామునితో మారుతికి ఇప్పిస్తుంది. ఆంజనేయుడు కన్నీరు పెట్టుకొంటాడు. అందులోని ఒక్కొక్క పూసనూ కొరికి పారేస్తుంటాడు. సభికులంతా ఆశ్చర్యంతో అలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తారు. ‘ఈ పూసల్లో నా రాముడు కనిపిస్తాడేమోనని చూస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు. ఆఖరుకు గోర్లతో ఛాతినే నిలువునా చీల్చుకొని తన హృదయంలో సీతారాములు ఉండటాన్ని అందరికీ చూపించి ఆనందిస్తాడు. ‘ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ వాయుపుత్రుడు చెమ్మగిల్లిన కండ్లతో దాసుడై’ ఉంటాడు. ‘ఏ భృత్యుడైతే యజమాని కోసం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, కష్టమైన పనినైనా కూడా ఇష్టంగా చేయగలుగుతాడో అతడే నిజమైన పురుషోత్తముడు, దాసుడు’ అంటున్నది రామాయణం. ‘బుద్ధిమతాం వరిష్టం’ అన్నట్లు మృదుమధుర భాషణతో సీతమ్మ బాధను తొలగించడానికై ఈ మహాబలుడు పడిన తిప్పలు ఇన్నీ అన్నీ కావు. అశోకవనంలో రావణాసురుని వేగులు అనేక రూపాలలో మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. రావణాసురుడు బలగంతో వచ్చి సీతమ్మను బెదిరించి వెళ్ళటమూ చెట్టు పైనుండి ఆంజనేయుడు గమనించాడు. జానకి ఆత్మత్యాగానికి సిద్ధపడుతుంది. ఆమె ఎవ్వరినీ, ఎవ్వరి మాటలను నమ్మే పరిస్థితిలో లేదు. అప్పుడు ఓ మానసిక శాస్త్రవేత్తవలె ఆలోచించి, హనుమ అద్భుతంగా ‘రామనామం’ గానం చేశాడు. అతను సీతమ్మను తన పలుకులతో నమ్మించి, ఊరడించిన తీరు అనూహ్యం. 


రామదూతగా అతను ప్రదర్శించిన ‘కుశాగ్రబుద్ధి’ అనితర సాధ్యం. తన సమయోచిత ప్రజ్ఞకు సరిసమానం ఆయన దాసభక్తి. ‘దాసమారుతి’గా తాను ఎప్పుడూ సీతారాముల పాదాల చెంత వుంటూ వినయ విధేయతలనే ప్రకటించాడు. హనుమంతునిలో ఒక్కోసారి చిన్నపిల్లల చేష్టలే మనకు కనిపిస్తాయి. చూడామణిని తీసుకుని రాముడు ఆప్యాయంగా కౌగిలించుకొని, ‘నీకేం కావాలో కోరుకో’ అన్నాడు హనుమంతుడిని. ‘మీపట్ల అవ్యాజమైన ప్రేమ నాలో తగ్గకుండా చూడు స్వామీ. నాలో అన్యభావానికే చోటు వుండరాదు’ అంటాడు. మోక్షం కావాలనో, ధనం కావాలనో స్వార్థపరమైన కోరికలు హనుమ కోరనే లేదు. ఒకసారి సీతమ్మ తన పాపిటలో సింధూరం దిద్దుకోవటం చూశాడు. ‘ఇదెందుకు పెట్టుకున్నావు తల్లీ’ అని అడిగితే, ‘సింధూరమంటే రామునికి ఎంతో ప్రీతి’ అంటుంది. దాంతో తెల్లవారి తన ఒళ్ళంతా సింధూరం పూసుకుని సభకు వస్తాడు. భక్తి పారవశ్యత అంటే ఇదీ. ‘ఎవరైతే పూర్తి సమర్పిత భావం, శ్రద్ధాసక్తులతో భగవత్‌ ప్రేమతో సేవ చేస్తారో వారే దాసభక్తులని’ నిరూపించాడు మారుతి.


జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

     

జీవన గమ్యాలు ఆశ్రమ ధర్మాలు!

కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా


సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్ష్యతే॥


- యాజ్ఞ వల్క్యుడు


మానవులకు ‘బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యాల’ వంటివే ‘బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసం’ అనే నాలుగు ఆశ్రమ ధర్మాలు. ప్రతి ఒక్కరూ వీటి విలువ తెలుసుకొని మసలుకోగలిగితే జీవన సార్థకత సిద్ధిస్తుంది. ఎవరికైనా బాల్యదశలో ఎలాంటి బరువు బాధ్యతలూ ఉండవు. ‘బ్రహ్మ చర్యాశ్రమం’ ప్రతి ఒక్కరికీ ఒక పరీక్షే. ఈ కాలంలో ‘మనసా వాచా కర్మణా’ ఎప్పుడూ స్త్రీ సంగమ అపేక్షలకు దూరంగా ఉండాలి. ఒక రకంగా ఈ దశ మానవుని భవిష్యత్తుకు బలమైన పునాది వంటిది. బ్రహ్మచారులు గురువుల మన్ననలను పొందేటట్లుగా నడచుకోవాలి. జీవన ప్రణాళికకు అవసరమయ్యే అనుకూలమైన విజ్ఞానాన్ని ఇప్పుడే సముపార్జించుకోవాలి. ఈ జ్ఞానమే బతుక్కు మంచిబాట వేస్తుంది. 


‘గృహస్థాశ్రమం’ జీవితంలో అన్నిటికంటే ప్రధానమైంది. మానవుని ‘భూత భవిష్యత్‌ వర్తమాన’ జీవనానికి ప్రధానమైన వారధిగా ఇదే నిలుస్తుంది. ఈ ఆశ్రమ ధర్మాన్ని నియమబధ్ధంగా పాటించే సజ్జనులు ఇహ-పరలోకాల సుఖాలను కూడా పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘తన సతీమణితో ధర్మబద్ధంగా జీవిస్తూ, కుటుంబ జీవితాన్ని గడిపే గృహస్థునికి తిరుగుండదు. అలాంటివారు ఎప్పటికీ తరిగిపోని ధాన్యసంపదను కలిగివుండే పక్షి, ఎలుకలవలె సుఖజీవనం సాగిస్తారు. వీరికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం సిధ్ధిస్తుంది. కష్టాలు ఎదురైనపుడు రోగగ్రస్థునికి ఔషధం లాగా సమస్యల నుండి గట్టెక్కడానికి ఆ ఇల్లాలు సహకరిస్తుంది (మహాభారతం, అరణ్యపర్వం: 2.74)’. ‘భర్తతో అన్యోన్యంగా కాపురం చేసే స్త్రీకి యజ్ఞదానతపో ఫలాలన్నింటి ఫలితమూ లభిస్తుంది’ అని కూడా ‘మహాభారతం’ (అరణ్యపర్వం: 5.07) నిర్దేశించింది. 



 

ప్రతీ కుటుంబీకుడు తన సంతానాన్నే గాకుండా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనూ తప్పనిసరిగా ఆదరించాలి. విధిగా వారి బాగోగులను చూస్తుండాలని మన సనాతన ధర్మం నిర్దేశించింది. మాతా పితరులకు చేసే సేవవల్ల పిల్లలకు సుఖసంపదలు కలుగుతాయి. కానీ, వారికి కీడు కలిగిస్తే తత్సంబంధ దుఃఖం అనుభవించక తప్పదు (ఆనుశాసనిక పర్వం: 4-279) అని మహాభారతం వెల్లడించింది. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే, ‘ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమోగానీ, తల్లీ తండ్రీ, గురువులపట్ల చేసే పాపాలకు మాత్రం పరిహారం ఉండదు (ఆనుశాసనిక పర్వం: 4-260)’. తమ సంతానంపై ఎనలేని వ్యామోహాన్ని కలిగి ఉండటమనేది తల్లిదండ్రులకు సహజం. ఐనా, వారిని మంచి క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలను పొరపాటునైనా కన్నవాళ్లు పొగడకూడదు. అందరికంటే పెద్దవారికి ‘కార్యజ్ఞాన శూరత్వం’ ఉండాలి. అప్పుడే తోబుట్టువులు, కుటుంబసభ్యులందరూ బాగుపడతారు. ‘తమకు ఆపదలొస్తే అండగా ఉండేవాళ్లే నిజమైన బంధువులు. ఎప్పుడూ కీడు చేస్తూ, తమ వంశానికి హాని చేయాలని చూసేవాళ్లను చుట్టాలుగా భావించరాదు (ఆదిపర్వం: 6-181)’. 


‘వృద్ధాప్యం’ (వానప్రస్థాశ్రమం) ప్రతి ఒక్కరికీ ‘అవసాన దశ’. ప్రాచీన కాలంలో కుటుంబ బాధ్యతలను తీర్చుకున్న పిమ్మట, సంసార బంధాలను వదిలిపెట్టి ‘సన్యాసాశ్రమం’ స్వీకరించి అడవుల్లోకి వెళ్లిపోయేవారు. అక్కడ ఏ పర్ణశాలలోనో నివసిస్తూ, ఇంద్రియ నిగ్రహంతో కాలం గడిపేవారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు కాయగూరలతోనే కడుపు నింపుకొనేవారు. ప్రతి మనిషీ ఈ జీవిత చరమాంకాన్ని దైవచింతనకే అంకితం చేయాలని సనాతన ధర్మం నిర్దేశించింది. ఈ రోజుల్లో అడవులకు వెళ్లకపోయినా, ఇంట్లో ఉంటూ అయినా మిగిలిన సలక్షణాలను విధిగా పాటించాలి. ‘భౌతిక సుఖాలు, కోర్కెలను ఆశించే వ్యాపారాలను వదిలి పెట్టి ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే సన్యాసాశ్రమ ధర్మం’ అని ‘భగవద్గీత’ (18-2) కూడా ఉద్ఘాటించింది. ఈ ఆశ్రమధర్మాలన్నింటినీ బాధ్యతగా నెరవేర్చడమే మనందరి కర్తవ్యం.


డా॥ శాస్ర్తుల రఘుపతి


94937 10552



No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular