SANATANA SAMPRADAYA SMARANA SLOKAMULU_ 1 to 10
సనాతన సాంప్రదాయ స్మరణములు
1.శ్లోకం : భక్తి శ్రద్ధా భావనాచ |
పూజాం జీవ ఉచ్యతే ||
తాత్పర్యం : చేయబడు పూజా కార్యమునకు (1) భక్తి (2) శ్రద్ద (3) భావన అనునవి జీవములుగా పేర్కొనబడినవి.
గాన వానిని పెంపొందించు కొనవలెను.
2.శ్లోకం : భగవతో బలేన - భగవతో వీర్యేణ |
భగవతస్తే జసా - భగవతః కర్మ కరిష్యామి ||
తాత్పర్యం : నేను భగవంతుని యొక్క బల, వీర్య, తేజస్సుల సహాయంతో భగవంతుని కర్మ చేయుచున్నాను.
3.శ్లోకం : నారాయణ సమారంభాం - శంకరాచార్య మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం - వందే గురు పరంపరామ్ ||
తాత్పర్యం : (మనది శాశ్వతమైన సనాతన ధర్మం. దీనికి భగవానుడైన
నారాయణుడు ఆదిగురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి వశిష్ఠుడు, వశిష్టుని నుండి శక్తి, శక్తి నుండి పరాశరుడు, పరాశరుని నుండి వ్యాసుడు, వ్యాసుని నుండి శుకుడు, శుకుని నుండి గౌడపాదుడు, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులు, అతని నుండి ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని స్వీకరించి కొనసాగించారు. ఆ సనాతన ధర్మాన్ని ఉపదేశించి మనలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించే గురువే గురువు)
నారాయణుని మొదలుకొని మధ్యను శంకరాచార్యులవారు, పిమ్మట మళ్ళీ మన గురువు వరకూ ఉన్న గురు పరంపరకు నమస్కారము అని గురువందనము.
4.శ్లోకం : మాతా పితృభ్యో నమః, శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః,
ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః,
శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః,
ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతాభ్యో నమః
తాత్పర్యం : తల్లిదండ్రులకు నమస్కారము, లక్ష్మీనారాయణులకు నమస్కారము,ఉమామహేశ్వరులకు నమస్కారము,
వాణీ చతుర్ముఖులకు నమస్కారము, శచీదేవీ ఇంద్రులకు నమస్కారము, అరుంధతీ వశిష్టులకు నమస్కారము, సీతారాములకు నమస్కారము, మహానుభావులందరికీ నమస్కారము, ఇంద్ర, అగ్ని, యమ, నిఋతీ, వరుణ, వాయు, కుబేర, ఈశాన అను 8 దిక్కుల అధిపతులకు నమస్కారము.
5.శ్లోకం : పూర్వ జన్మాను శమ నాజన్మ మృత్యు నివారణాత్ |
సంపూర్ణ ఫల దానాశ్చ - పూజేతి కథితాప్రియే ||
తాత్పర్యం : కులార్ణవ తంత్రంలో 'పూజ' పూర్వజన్మల కర్మవాసనలను
నశింపజేసి, జనన మరణ చక్రాన్ని ఆపివేసే, సంపూర్ణ ఫలాన్నిచ్చే
చర్యగా నిర్వచిస్తారు.
6.శ్లోకం : కరాగ్రే వసతే లక్ష్మీః - కరమధ్యే సరస్వతీ |
కరమూలేతు గౌరీచ - ప్రభాతే కరదర్శనమ్ ||
తాత్పర్యం : మన కుడిచేయి వేళ్ళయందు లక్ష్మియు, మధ్య భాగమునందు సరస్వతియు, మూలమందు గౌరీదేవియు
వసించియుందురు. గాన నిద్ర నుండి మేల్కొనిన వెంటనే అరచేతిని చూచుకొనవలెను.
7.శ్లోకం :సముద్రవసనే దేవి! - పర్వత స్తనమండలే |
విష్ణుపత్ని! నమస్తుభ్యం! - పాదస్పర్శం క్షమస్వమే ||
తాత్పర్యం : నిద్రలేచిన వెంటనే పాన్పు నుండి కాలు నేలపై పెట్టేముందు, సముద్రాలు వస్త్రముగా గల, పర్వతములు పాలిండ్లుగా గల విష్ణుపత్నియైన ఓ భూదేవీ ! నీపై కాలుమోపుతున్నాను. నీకు
నమస్కారము. నా పాదస్పర్శను క్షమింపుము.
8.శ్లోకం : గంగేచ యమునే చైవ - గోదావరి సరస్వతి!
నర్మదే సింధు కావేరి - జలేస్మిన్ సన్నిధింకురు ||
తాత్పర్యం : ఓ గంగా యమునా గోదావరీ సరస్వతీ నర్మదా సింధూ కావేరీ మహానదులారా! నేను స్వీకరిస్తున్న ఈ పవిత్రమైన జలాలలో
మీరందరూ సన్నిహితులు కండి. (దేవతార్చన సమయాల్లో, స్నాన వేళల్లో హిందువులంతా జల పవిత్రీకరణానికి భక్తిశ్రద్దలతో పఠించే పుణ్యశ్లోకం ఇది. )
9.శ్లోకం : ఉదయేచ స్వయం బ్రహ్మా - మధ్యాహ్నే తు మహేశ్వరః |
సాయంకాలే మహావిష్ణుః - త్రయీమూర్తిః దివాకరః ||
తాత్పర్యం : సూర్య భగవానుని ఉదయ కాలమునందు బ్రహ్మస్వరూపముగను,మధ్యాహ్నమున మహేశ్వరుడుగను,
సాయంకాలమునందు విష్ణురూపునిగను ఇట్లు త్రిమూర్తుల రూపముగ భావించినమస్కరించవలెను.
10. శ్లోకం : అవిద్యాది తమః పుంజ విచ్చేదన పటీయసీ |
పరబ్రహ్మ స్వరూపా త్వం దీపలక్ష్మి నమోస్తుతే ||
తాత్పర్యం : అవిద్యవంటి చీకట్లను నాశనం చేయగలిగే శక్తివి నీవు. ఓ దీపలక్ష్మీ!నీవు పరబ్రహ్మ స్వరూపురాలవు. నీకు నమస్సులు.
No comments:
Post a Comment