Posted On:3/18/2015 11:51:58 PM
|
రామయ్యగారు ఒకరోజు ఆత్మలు, దేహాలకు అతీతంగా వాటి అస్తి త్వం గురించి బోధిస్తున్నారు. ఆత్మలు లేవని, అవి వెంటాడే భావాలు మాత్రమేనని వాదించాను. భావాలు దేహసంబంధమైనవని, ఒక మనిషికి సంబంధించిన రూపలావణ్యాలు, జ్ఞాపకాలు, భావాలు మాత్రమే అతని మరణానంతరం కొనసాగుతాయని, వాటిని మనిషి ఆత్మలుగా భావించేవారని వాదించాను. కానీ ఆత్మ సత్యం, ఆత్మనిత్యం అన్న భారతీయ తత్వమూలాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆత్మ పరమాత్మను చేరినప్పుడు మనిషి జీవన్ముక్తుడవుతారని చెప్పేవారు. అయినా ఆయన అజమాయిషీ చేసేవారు కాదు. ఒప్పించాలని చూసేవారు కాదు. గంటలు గడచిపోయేవి. ప్రజాస్వామిక వాదిగా అభిప్రాయాలను గౌరవించేవారు. తత్వశాస్త్ర తరగతి గది సజీవంగా నడుస్తున్నందుకు ఆనందించేవారు. ఆయన పిల్లల్లో పిల్లవాడిలా, పెద్దల్లో పెద్దవాడిలా ఉండేవారు. భారతీయ తత్వపరిశోధనా మండలిలో చాలా కాలం సభ్యునిగా పనిచేశారు.
అనేక మం ది ని పరిశోధనలకు ప్రోత్సహించి డాక్టరేట్లను చేశారు. నా ఎంఫిల్‌కు కూడా ఆయనే మార్గదర్శన చేశారు. క్యాన్సరు వచ్చిన తర్వాత కూడా ఆయన ధైర్యాన్ని చెదరనివ్వలేదు. ఇరవైనాలుగేళ్ల తర్వాత మాజీ విద్యార్థుల సమావేశం జరిగితే ఆయన ఉత్సాహంగా మాతో రోజంతా గడిపారు. తలకోన కొండకోనల్లో కలిసి నడిచారు. ఏర్పేడు ఆశ్రమ స్వామీజీ వ్యాఖ్యాన సహిత భగవద్గీతను తెనిగించే పనిని పెట్టుకున్నట్టు ఆ సందర్భంగా చెప్పారు. ఆయన చివరిదాకా చదవడం, రాయడం మానలేదు. ఆయన గొప్ప ఆచార్యుడు, తాత్విక జిజ్ఞాసి. గొప్ప మనిషి. ఆయన బుధవారం బెంగుళూరులో మరణించారు. తిరుపతిలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆయన విద్యార్థులపై చూపించిన ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేనిది. ఆయనకు హృదయపూర్వక నివాళి.
-కట్టా శేఖర్‌రెడ్డి
No comments:
Post a Comment