Thursday, October 2, 2014

బతుకమ్మా! బ్రతుకు!

బతుకమ్మా! బ్రతుకు!


బతుకమ్మ ఒక అచ్చమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన గేయం. తెలంగాణ సంస్కృతిని శాశ్వతం చేసిండు కాళోజీ.
-నాగిళ్ళ రామశాస్త్రి, 97041 12830
తెలంగాణకే ప్రత్యేకమైన పండగ. తెలంగాణ సంస్కృతిలో భాగం బతుకమ్మ. కాళోజీ చెప్పినట్టు బతుకును personify (మూర్తిమంతం) చేస్తూ ప్రపంచంలో ఎక్కడా పండగ లేదు, ఒక్క తెలంగాణలోనే తప్ప. అటువంటి పండగ గురించి కాళోజీ రాసిన గేయం గురించి ఒక చిన్న పరిశీలన. ముందు పండగను ప్రస్తావించుకుంటూ చూద్ధాం. .
బతుకమ్మ ఆశ్వీయుజమాసంలో వస్తది. అప్పటికి వానలు తగ్గి అంతా ప్రశాంతంగా ఉంటది. పంట చేన్లు పచ్చగా భూమికి పచ్చరంగేసినట్లుంటవి. తీరు తీర్ల పూలు పూస్తుంటవి. తంగేడు, గునుగు, కట్ల, తుమ్మ-నువ్వు, తేలుకొండి, గోరంట, లొట్టపీచు, రంగురంగుల కట్ల-ఇవేగాక తెల్ల గునుగు పూలు వాటికి రంగేస్తే రంగురంగుల పూలు. ఇలా పూలకు లెక్కలేదు. ఒక తీరుగ ఇది ప్రకృతి ఆరాధనేమో.

ప్రాకృతికమైన తీరొక్క తీర్ల పూలు తెచ్చి శ్రద్ధతో మేదరి సిబ్బిల్నో, తపుకులోనే, తాంబాలంలోనో పూలు దొంతర దొంతరలుగ పేర్చడం- దానికీ ఒక పద్ధతీ, పాటా ఉన్నాయి. తొలుత తంగేడు పువ్వు, తదుపరి గుమ్మడి పువ్వు తదుపరి కట్ల ఇంకా ఇతర పువ్వులు పేర్చి శిఖరం మీద మంచి గుమ్మడి పువ్వు లోపటి కేసరాన్ని గౌరమ్మగా బెటి,్ట పసుపు గౌరమ్మను బెట్టి బతుకమ్మను ఆరాధిస్తరు.

ప్రకృతిలో దొరికే అన్ని తీర్ల పూలను పొద్దున్న మగవాళ్ళు తీసుకొస్తే ఆడవాళ్ళు పొందికగా కూర్చొని బతుకమ్మను పేర్చి, నైవేద్యం పెట్టి సాయంకాలం ఆడుకుంటరు. మొదటినాడు ఎంగిలి పూలంటరు. ఆరవ నాడు అర్రెం అంటరు. ఆ రోజు బతుకమ్మ ఆడరు. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మ. ఆనాడే పోటీ బతుకమ్మలు. ఎన్ని ఎక్కువ పూలు పెట్టి ఎంత పెద్దగా పేరిస్తే అంత గొప్పదనుకునేంత ఆనందం. మిగిలిన రోజులు గునుగు పూలను అంతగ వాడక పోయినా సద్దుల బతుకమ్మ కోసం గునుగు పూలు తెప్పించి, సమానంగా కట్ చేసి కట్టలు గట్టి రెండు రోజుల ముందే తీరొక్క రంగుల్లో ముంచి ఆరబెడ్తరు. ఇవి పెద్ద బతుకమ్మగా పేర్వటం ఆడవాండ్ల సృజనాత్మకత మీద ఆధారపడి ఉంటుంది.

మొదటి రోజుగ దగ్గరున్న గుడిల కాడ ఆడితే ఆఖరు నాడు దగ్గర్లోని చెరువుకో, వాగుకో పోయి ఆడి నీళ్ళల్ల బతుకమ్మను విడిచిపెట్టి మళ్ళీ ఏడాదికి రమ్మని కోరుకుంటరు. గౌరమ్మను విడవలేక విడవలేక, విడుస్తరు. ఆడబిడ్డలు ఏ పండక్కచ్చినా, రాకపోయినా బతుకమ్మ పండక్కు వచ్చుడు తప్పనిసరి. రాకపోతే తల్లిదండ్రులు నిరుత్సాహపడ్తరు. ఎన్నడు రానేరాదు, బిడ్డను బతుకమ్మ పండక్కన్నా తోలరు మా ఇయ్యంపులు అని రంధి పడ్తరు. ఆఖరినాడు తెచ్చిన అయిదుతీర్ల పలారాల్ని బతుకమ్మ రూపంలోని గౌరమ్మకు నైవేద్యం పెట్టి ఆడ్నే వాయినాలిచ్చు కుంటరు. ఐతే పండగ పేరిట కాళోజీ రాసిన గేయంలో మరింత విస్త్రృతితో బతుకు ప్రస్తావనలు ఉంటై. గేయాన్ని చదివిన ప్రతీసారి బతుకు విస్త్రృతి మరింత విస్తారమైతది. అదీ కాళోజీ ప్రత్యేకత.

నిజంగానే, కాళోజీ రాసిన బతుకమ్మ పాట ఒక అద్భుతం. బతుకమ్మ బతుకు, అమ్మని మరువని సంతానము గని బతుకమ్మ బతుకు అని అంటడు. బిడ్డలెప్పుడు తల్లిదండ్రులను మర్చిపోవద్దని, వాళ్ళ సంతానం కూడా, వాండ్ల తల్లిదండ్రులను కూడా యాది బెట్టుకోవాల్నని చెబ్తడు.

పూలంటేనే మహిళల కిష్టం. ముత్తైదువ చిహ్నాలు పూలు. తంగేడు పూలు పసుపు పచ్చగ ఉంటయి. పెద్ద ముత్తైదువ నగలుగిట్ల పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఉంటే పూచిన తంగేడోతుగ ఉన్నది అని అంటరు. తురాయీ ఒక రకమైన పూవే. తురాయి అంటే కిరీటమని, ఈకలతో కలికితురాయి అని రామదాసన్నడు. కట్లపూలు-నీలి కట్లపూలు, నీలిరంగు తోటి అందంగ ఉంటయి. ఎర్ర కట్లపూలుంటయి గాని, నీలి అందం నీలిదే. బతుకు, గుమ్మడిపూల వతుగ పుయ్యాలె. కలికితురాయిగ తలెత్తుగ తిరుగాలె. అమ్మని మరువని సంతానం కని బతకాలె అని అభిలషిస్తడు కాళోజీ.

భూమి అంత పచ్చగ, పచ్చని బతుకు, పచ్చరంగు శుభానికి సంకేతం. అందుకే కాళోజీ పచ్చని పసరిక బయళ్ళ బ్రతుకు, పల్లెల్లో పట్టుల పంటల బ్రతుకు, పసుపుతోట మరియాదగ బ్రతుకు, పున్నమి వెన్నెల మాదిరి బ్రతుకు అని రాస్తడు. మరియాదకు పసుపు గుర్తు. ఇది శుభానికి సంకేతం. ఏ పండగైన పసుపు కుంకుమలతోటే మొదలైతది. శరత్తులో వెన్నెల హాయిగుంటది. శరత్‌చంద్రుడు సాహిత్యంలో చాలా ఫేమస్. పున్నమి వెన్నెలైతే చెప్పే పనే లేదు. పసుపు తోట మరియాదగ, పున్నమి వెన్నెల మాదిరిగా బతుకు అనడంలో, బతుకు అనబడే బతుకు, బతక దగిన బతుకు, ఎట్లా బతకాల్నో చెప్పిన బతుకు అది కాళన్న గేయం.

అయితే, ఎవరి బతుకైనా బతుకే. కాని ఎఫ్పోర్డబిలిటి-తాహతు-దీంతోనే అసలు కథ. అందుకే, మూడుముళ్ల బిగియింతల పద్దుల, జంట బతుకు తాహత్తుల హద్దుల అంటడు. జంట బతుకుల్లో ఎఫ్పోర్డబిలిటి-పరిమితులు దాటడం కష్టం. బతుకు ఎప్పుడు మమతల బతుకు కావాలి. మమతలను పంచేది, పెంచేది కావాలి. ఏ ఆడబిడ్డ అయినా తన ఇంట్ల ఎట్లా మసులు కోవాలో తెలిపే పద్ధతి ఈ గేయంలో ఉన్నది.

పసుపు కుంకుమ, పారాణి, ఇవ్వే కాక రైతుకు ఆలమందలు గొప్ప సంపద. ఆలమందల గొంతుల్లో అంబా అనే శబ్దం వస్తే ఎంత హాయి. దాంపత్యపు దివ్వెలు-ఆలుమగల సంసారం ఇతరులకు వెలుగివ్వాలి. ఇంకా కొన్ని దీపాలు వెలిగించేటట్టుగా ఉండాలి. ఇవ్వన్ని ఉన్న అద్భుతమైన బతుకు, హాయైన బతుకు, ఆదర్శమైన బతుకును కాళోజీ కవిత్వం చేస్తడు.

బతుకమ్మ సంతానం పెరిగినా కొద్దీ కొడుకులు తండ్రులైతరు. తండ్రులు తాతలైతరు, మురిసిపోతరు. అమ్మలు అవ్వలైతరు. బిడ్డలు తల్లులైతరు. వాళ్ల వంశం వృద్ధి చెందుతుంది. నొసటి కుంకుమ తళుకుల నీనుచు, మంగళసూత్రం వలపుల బేనుచు - వట్టి దారాలతో పేనింది కాదు అది. ఆ సూత్రం వలపులతో పేనిన సూత్రం. దారాలతో పేనిన సూత్రం తెగవచ్చు గాని, వలపుల సూత్రాలతో పేనింది తెగదు. ఒక పల్లెటూరి ముత్తైదువ చేసుకున్న అలంకారాలన్నింటినీ బతులోని శుభంకరమైన, వాటి ప్రాముఖ్యాలను తెలిపేటట్లున్నది ఈ గేయం.

ఇంట పసిడి రాసులు కురువాలంటరు. మక్కజొన్న రంగు పసిడి రంగు. సీతాఫల కనుగ్రుడ్డుగ బతుకు అన్నది. సీతాఫలాల్ని, గుడ్ల పండ్లు, పెద్ద పెద్ద గుడ్లవలె ఉన్న పండ్లు ఎంత తీయగ ఉంటాయో, అందుకే, బతుకంతా తీపి ఉండాలని కాళోజీ భావన. అప్పుడే పాలు పట్టుతున్న గింజ ఎంత తియ్యగా ఉంటది, బతుకులోని మాధుర్యాన్ని చెప్పడం కోసం ఇవన్నీ.

ఇట్లా చెప్తూ, చెలిమె చెలిమలు ఊరేదాకా, చెలిమి కలుములు నిలిచే దాకా, చెలిమి వెన్నెలలు కాసేదాకా, చెలిమి రాగములు ఒలికే దాకా - బతుకు అన్నడు.

కాళోజీకి స్నేహం, సౌభ్రాతృత్వం ఎంత ఇష్టమైనవో! పల్లెటూర్లలో వాగుల్లో చెల్మెలు తోడుకుంటరు. అందులో నీళ్లు చల్లితేనే నీళ్లు ఊరుతయి. ఎంత చల్లితే అంత త్వరగా నీళ్లు ఊరుతవి. స్నేహం పంచే కొద్దీ ఊరుతది. అట్ల అందరికి ఆ స్నేహం పంచాల్ననీ, చెలిమియే కలిమి (సంపద) అని, స్నేహ సంపదే చివరకంటా నిలిచే కలిమి అని, మిగతావి అశాశ్వత సంపదలు అని అంటడు కాళోజీ.

ప్రకృతిలో పంచభూతాలు శాశ్వతం. ప్రతిదీ ఈ భూతాల్లో కలువాల్సిదే. ఈ బతుకు అమ్మను బతుకమ్మను కాళోజీ మన్నూ, మిన్నూ ఉండేదాకా, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు ఉండేదాకా, అంతేగాదు, కాలచక్రం తిరిగినంత సేపు బతుకమన్నడు, బతుకే శాశ్వతం.

ఈ ప్రాకృతిక సంపదను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఒక్కసారి ఈ గేయం చదివితే పల్లెపట్టుల సంస్కృతి, తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టినట్లు కళ్లల్లో నీళ్లు తిరుగుతయి. కన్నీళ్లు మనిషిని ఇంకొన్ని రోజులు బతికిస్తయి. చెమ్మగిల్లిన కన్నులే బ్రతుకులోని కమ్మదనాన్ని చూస్తయి అని కాళోజీ వేరో చోట అంటడు గూడ. బతుకమ్మ ఒక అచ్చమైన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన గేయం. దీని ద్వారా తెలంగాణ సంస్కృతిని శాశ్వతం చేసిండు కాళోజీ. 1966 పరాభావ శరత్తులో రాసిందీ గేయం. పరాభవ శరత్తులో రాసినా శరదశ్శతం బతికేది ఈ గేయం.

కాళన్న 1966 బతుకమ్మ పండగ సందర్భంలో రాసిన గేయం
గుమ్మడిపూలు పూయగ బ్రతుకు
తంగెడి పసిడి చిందగ బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు
అమ్మను మరవ సంతానము కని
॥బతకమ్మా! బ్రతుకు॥
॥బతకమ్మా! బ్రతుకు॥
పచ్చని పసరిక బయళ్ల బ్రతుకు
పల్లె పట్టుల పంటల బ్రతుకు
పసుపుతోట మరియాదగ బ్రతుకు
పున్నమి వెన్నెల మాదిరి బ్రతుకు
॥బతకమ్మా! బ్రతుకు॥

మూడుముళ్ల బిగియింతల పద్దుల
జంట బ్రతుకు తాహత్తుల హద్దుల
మమతల, మమతల పెంచెడి సుద్దుల
తీరుతీరు చవులూరెడి చద్దుల
॥బతకమ్మా! బ్రతుకు॥
పసుపు కుంకుమల వసతుల తేలుచు
పారాణిలో మారాణిగ పారుచు
ఆలమంద గొంతుల అంబాడుతు
దాంపత్యపు దివ్వెల వెలయించుచు

॥బతకమ్మా! బ్రతుకు॥

తండ్రుల తాతల జేయుచు మురియుచు
కొడుకుల తండ్రుల జేయుచు వెలయుచు
అమ్మల అవ్వల జేయుచు కాయుచు
బిడ్డల తల్లుల జేయుచు సాకుచు
॥బతకమ్మా! బ్రతుకు॥

నొసటి కుంకుమల తళుకుల నీనుచు
మంగళసూత్రము వలపుల పేనుచు
గాజుల గలగల నవ్వుల తేలుచు
కాలి మట్టియల పలుకుల కులుకుచు
॥బతకమ్మా! బ్రతుకు॥

మక్కలరాసుల పసిడిగ బ్రతుకు
గేగుల కండల జవగా బ్రతుకు
సీతాఫల కనుగ్రుడ్డుగ బ్రతుకు
పాలుపట్టి గింజూరగ బ్రతుకు
॥బతుకమ్మా! బ్రతుకు॥

నల్లపూసల నడుమనె బ్రతుకు
పాలతిన్నియల దాపునె బ్రతుకు
నొసటి మధ్య మందారమ! బ్రతుకు
కాళ్ల పసుపు పారాణీ! బ్రతుకు
॥బతకమ్మా! బ్రతుకు॥

పాటపాడి పాటల పాడిస్తూ
ఆటలాడి ఆటల ఆడిస్తూ
జంటగూడి జంటల కూరుస్తూ
బతుకు బ్రతికి బతుకుల బ్రతికిస్తూ
॥బతకమ్మా! బ్రతుకు॥
చెలిమి చెలమలు ఊరేదాకా
చెలిమి కలుములు నిలిచే దాకా
చెలిమి వెన్నెలలు కాసేదాకా
చెలిమి రాగములు ఒలికేదాకా
॥బతకమ్మా! బ్రతుకు॥

మన్నూ మిన్నూ ఉండే దాకా
సూర్యుడు చంద్రుడు వెలిసే దాకా
చుక్కలు మింటిలో కులికే దాకా
కాలచక్రము తిరిగే దాకా
॥బతకమ్మా! బ్రతుకు॥

అమ్మను మరవని సంతానము కని
॥బతకమ్మా! బ్రతుకు॥
మనదైన కవిత్వం కాళోజీ ‘బతుకమ్మ’

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular