మన పోతన మధురిమ
మన పోతన మధురిమ
థనం మధురం.. శ్రవణం మధురం.. గానం మధురం..వ్యాస భాగవతం అతి మధురం. మన తెలుగు భాగవతం మధురాతి మధురం. భక్త కవి పోతన.. అధ్యాత్మ భావనను పూత పూసి, పోత పోసిన పద్యాలు.. పరమ భాగవతులు ప్రవచించి తరించారు. పామరులు సైతం విని పరవశించారు. సాధకులు వరమని భావించారు.
కథనం మధురం.. శ్రవణం మధురం.. గానం మధురం..వ్యాస భాగవతం అతి మధురం. మన తెలుగు భాగవతం మధురాతి మధురం.
భక్త కవి పోతన.. అధ్యాత్మ భావనను పూత పూసి, పోత పోసిన పద్యాలు.. పరమ భాగవతులు ప్రవచించి తరించారు. పామరులు సైతం విని పరవశించారు. సాధకులు వరమని భావించారు. మోక్షానికి మార్గం ఇదేనని తీర్మానించుకున్నారు. నవరస భరిత భాగవతానికి పోతన మధురిమ తోడై.. ఎన్నెన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు నిలువ నీడైంది. పోతన భాగవతం, వ్యాస భాగవతానికి అక్షరానువాదం కాదు. యథా నుసరణానువాదమని ఉభయ భాగవతాల అధ్యయనపరులకు అనుభవైకవేద్యమే. భక్తిరస పోషణ, ఆవిష్కరణలో కూడా పోతన మేను మరచి ‘ఇంతింతై… బ్రహ్మాండాంత సంవర్ధియై’ అన్నట్టు విశ్వరూపం చూపి మూలాన్ని మించి మురిపించాడు. అందుకే తెలుగు భాగవతం.. మూలం కంటే దాదాపు మూడింతలు పెరిగింది. భాగవత పురాణం వేదమనే కల్పవృక్షం నుంచి జారిన ఫలం. అది శుకముని ముఖంలోని అమృత ద్రవంతో నిండి నిబిడీకృతమై ఉంది. ఆ అమృతంలో తెలుగు భాషామృతాన్ని కుమ్మరించి.. మనకు భాగవత మధురిమను అనుగ్రహించారు భక్త కవిరాజు పోతరాజు. ‘చింతన’ వేదికగా
‘నమస్తే తెలంగాణ’ పాఠకులను 231 వారాలుగా అలరిస్తున్న శ్రీహరి లీలామృతం చివరి బొట్టును ఫలశ్రుతిగా ఆస్వాదించండి.
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! పరమాత్మ పాద ప్రక్షాళన జలం గంగ తీర్థరాజం, అతి పవిత్రం. అయినా, పరమతీర్థ స్వరూపుడు పద్మనాభుడు శ్రీమహావిష్ణువు ఛద్మ- కపట మానుష వేషంతో కృష్ణుడుగా యదువంశంలో అవతరించగా, అదునుగా- నీ ప్రాయోపవేశ సమయంలో నేను నీకు వినిపించిన ఆ మహానుభావుని కీర్తి అనే తీర్థంతో పోలిస్తే, అమరనదీ జలమహిమ ఇలలో కరమరుదుగ- మిక్కలి ఆశ్చర్యకరంగా తరగి- తగ్గిపోయింది. ఆ స్వామి స్వరూప మహిమ ఎంత అమోఘం, అనుపమమంటే, ఆయనను ప్రేమించి అనుగ్రహ పాత్రులైన భక్తులు, ద్వేషించి ఆగ్రహానికి గురైన శత్రువులు, లోకం అబ్బురపడే విధంగా, ఇరువురూ ఆయనలోనే ఐక్యమయ్యారు. విశేషించి తనను ద్వేషించి దూషించువారిని కూడా మోక్షమిచ్చి భూషించువాడు ఒక్క సనాతన ధర్మంలోని భగవంతుడు అధోక్షజుడు మాత్రమే! ప్రకృతికి అతీతుడైన పరమాత్మ తాను కల్పించిన ధర్మ మర్యాద- వ్యవస్థను రక్షించడానికి దివ్యదేహం ధరించి అనేక అలౌకిక, అద్భుత లీలలను అభినయించాడు. విశ్లేషించి పరికిస్తే వాస్తవానికి అవన్నీ గంభీరమైన శాస్త్ర పరమార్థాలే! ఆ లీలలు జ్ఞానాగ్ని కీలలై శ్రోతల, అధ్యేత-పాఠకుల జన్మ కర్మ బంధాలను అవలీలగ దహించి వేస్తాయి.
మ॥ ‘మనుజేంద్రోత్తమ! యేను నీకు ద్రిజగ
న్మాంగల్యమై యొప్ప జె/
ప్పిన ఈ కృష్ణకథాసుధారసము సంప్రితాత్ములై భక్తి గ్రో/
లిన పుణ్యాత్ములు గాంతురిందు
సుఖముల్, నిర్ధూత సర్వాఘులై/
యనయంబున్ దుది గాంతురచ్యుత
పదంబైనట్టి కైవల్యమున్’
‘మహారాజా! నేను నీకు బోధించిన, ముల్లోకాలకు మంగళకరమైన మాధవుని- శ్రీకృష్ణుని కథాసుధారసాన్ని ప్రేమ పూర్వకమైన భక్తితో పానం చేసిన పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖశాంతులు పొందుతారు. వారి సమస్త దురితాలు దూరమైపోతాయి. తుదకు వారు అవశ్యం అచ్యుత పదాన్ని- చ్యుతి (పునరావృత్తి)లేని కైవల్యాన్ని చూరగొంటారు. (శరీర, ఇంద్రియాలతో విడివడి ఆత్మ అద్వితీయంగా ఉండుట కైవల్యం)’
పోతన్న మహాకవి తన భాగవతాన్ని ‘శ్రీకైవల్య పదంబుజేరు…’ చింతనతో ఉపక్రమించి, ఉపసంహారం- ముగింపు కూడా ‘తుదిగాంతురచ్యుత పదంబైనట్టి కైవల్యమున్’ అంటూ ‘కైవల్య’ పదంతోనే గావించి, భాగవతానికి కైవల్యమే పరమ ప్రయోజనమని సిద్ధాంతీకరించాడు.
కం॥ ‘అని యిట్లు బాదరాయణి
మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె
ప్పిన విధమున సూతుడు ముని
జనుల కెఱిగింప వారు సమ్మతి తోడన్’
ఈ రీతిగా బ్రహ్మరాతుడుగా ఖ్యాతి వహించిన బాదరాయణి శుకయోగి కడుప్రీతితో క్షితినాథుడు (రాజైన) పరీక్షిత్తుచే పానం చేయించిన, అతనికి అమృతత్తాన్ని సిద్ధింపజేసిన భాగవత కథామృతాన్ని పూత- పవిత్ర మనస్కుడైన సూతముని నైమిశారణ్యంలో శౌకనాది మునివ్రాతా- బృందానికి అనుగ్రహించాడు.
ప్రతి స్కంధానికి వలెనే దశమానికి కూడా ఇతిశ్రీ- ముగింపు పలుకుతూ పోతన అమాత్యుడు పరిపాటిని పాటిస్తూ తన ఇష్టదైవమైన ఇనకులాభిసోముని రాముని చంపక-సంపెంగ సుమమాలతో సింగారించి ఇలా ఘనంగా సంభావించాడు..
చ॥ ‘సరిసిజ పత్త్రనేత్ర! రఘుసత్తమ! దుష్టమదాసురేంద్ర సం
హరణ! దయాపయోధి! జనకాత్మభవానన పద్మమిత్ర భా
స్కరకుల వార్ధిచంద్ర! మిహికా వసుధాధర సూతి సన్నుత
స్ఫురిత చరిత్ర! భక్త జనపోషణ భూషణ! పాప శోషణా!
‘రాజీవ- పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడా! రఘువరా! రాక్షస సంహారా! దయాసాగరా! సీతాముఖ సరోజానికి సూర్యునివంటి వాడా! ఇన (సూర్య) కులమనే వననిధికి (సాగరానికి) వెన్నెల రాయుడా! పార్వతీదేవిచే ప్రస్తుతింపబడు పవిత్ర చరిత్ర గలవాడా! భక్తజన పోషణే భూషణంగా కలవాడా! పాపహరణా! నీకు ప్రణతులు!’
పరమ భాగవతుడైన పోతన మహాకవి భాగవత కథా కవితా సుధామాధుర్యాన్ని, కనుమరుగైపోతున్న మన జాను (అచ్చ) తెనుగు బాస తియ్యందనాన్ని, ‘మన పోతన మధురిమ’ అన్న ప్రధాన శీర్షికన సరస హృదయులకు, విబుధవరులకు, సాధు పురుషులకు, ఒరులకు- ఇతరులకు రుచి చూపించే ఈ చిరు ప్రయత్నానికి, ఉరు- గొప్ప భాగ్యానికి అవ్యాజమైన అభిమానంతో అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక యాజమాన్యానికి, సంపాదక వర్గానికి పత్రికా ముఖంగా కృతజ్ఞతా పూర్వక అభినందన చందనాలు సమర్పిస్తున్నా. (సమాప్తం)
సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Comments