దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

 

 దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం  మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.

*గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి,
పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే
'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజభరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం.
నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు, జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి కదా! అసలేమి లేదు. *

*నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే లబ్ది దారుడే గొప్పవాడు. ముత్యాలహారం కంటే దానిని ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటే సంపంగి ముక్కు విలువైనది. 'అమ్మాయి' నామ వాచకం. ఆమె ధరించిన 'నగ' విశేషణం. హారం పోయినా పర్వాలేదు, కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పది కోట్లు. ముక్కెర లేకపోయినా నష్టం లేదు. ముక్కు ఉంది. అదే మహాభాగ్యం.నీ తలపై ధరించే తలపాగా లేదా నవరత్న ఖచిత కిరీటం కంటే, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటం లోని మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నె చిన్నెలను తక్కువగా చెప్పడం కూడా కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు. అన్వేషించు, శతవిధాల ప్రయత్నించు. సాధించు. తప్పులేదు. కానీ, దానికోసం లేనిపోని
తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పి కట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరోభూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితం గా ఉంటుంది. ఒక మంచి వక్తను చూడండి. చక్కటి కృషితో భాషా విజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమను పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగుడుతున్నారు. అది అతనికి ప్రత్యెక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన వ్యవహారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనందరికీ గర్వకారణం. చాకచక్యంగా
సంభాషించలేక పోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని మూగవారి గురించి ఆలోచించండి! వారికంటే మనమెంత అదృష్టవంతులం! ఒకసారి సరదాగా మిత్రులతో అన్నాను, నేను విశేషణాలు, ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని. 'నేను నేనుగా' ఉన్నాను. 'నీవు నీవుగా' ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా సరే, నీకంటే గొప్పవి కావు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాల కంటే చాలా అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా అజీర్ణ వ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనంచేయడం, జీర్ణం చేసుకుని శక్తిగా మార్చుకోవడం మామూలు విషయం కాదని అప్పటికి గానీ తెలిసి రాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయాలంటే, రెండు - మూడు వేలు ఖర్చు అవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్ చేస్తాయి. అంటే రోజుకు లక్ష రూపాయలను మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటి నిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండడమే నీ పరమగమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి, అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
సాధించకపోయినా ఇబ్బంది లేదు. పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వును సమాధానంగా ఇస్తుంది. పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే.
శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ! కూడు, గూడు నిత్యావసరాలకు సరిపడినంత ధనం ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని (జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢతను పెంచేలా ఉండాలి. మనం సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరఫున సాధించిన లక్ష్యం (ఆరోగ్యంగా జీవించడం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని కటాక్షించాలి. అంతే కానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను సాధించడానికి వృధాగా ధారపోయరాదు. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతితో తాదాత్మ్యం చెందడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం. *
*ఆడడం నెమలి లక్ష్యం. పాడడం కోయిల లక్ష్యం ఆడుతూ పాడుతూ బ్రతకడం మనందరి లక్ష్యం *
ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*

 

 

 

Comments

Popular posts from this blog

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి