Wednesday, August 9, 2023
#నమస్తేతెలంగాణ#మసకబారినమానవత్వం#T_హరికృష్ణ 9494037288_వ్యాసకర్త_రాష్ట్ర కార్యదర్శిమానవహక్కులవేదిక
నమస్తే తెలంగాణ
మసకబారిన మానవత్వం -
T . హరికృష్ణ 9494037288
(వ్యాసకర్త: రాష్ట్ర కార్యదర్శి, మానవ హక్కుల వేదిక)
మణిపూర్ ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి,
ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి
గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు
వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం పోలీసులు కూడా
అల్లరిమూకలకు పూర్తిగా సహకరించారు. జాతీయ మహిళా కమిషన్ కు
ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మే 3న అల్లర్లు
మొదలైతే, 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ వెళ్లారు.
అంటే కేంద్రం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెజారిటీ ప్రజలైన మెయితీలకు మైనారిటీ ప్రజలైన
కుకీ, నాగ, జోమి తెగల మధ్య చర్చలకు ఎంత మాత్రం
ఆస్కారం లేనివిధంగా విపరీతమైన దాడులు,
గృహ దహనాలు జరిగాయి.
మెయితీ, కుకీ, నాగ తెగల మధ్యదాడుల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక చర్చిలు ధ్వంసమయ్యాయి. వేలసంఖ్యలో ప్రజలు శరణార్థి శిబిరాల్లో
తలదాచుకుంటున్నారు. హింస ప్రబలటానికి కారణమయ్యే తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా ప్రచారమైంది. దీనికి కొన్ని మత శక్తులు
ఇతోధికంగా తోడ్పడ్డాయి. చారిత్రకంగా మెజారిటీ ప్రజలకు
అన్యాయం జరిగిందని, మైనారిటీల వల్లే మెజారిటీ
ప్రజల సంస్కృతి నాశనమైపోతున్నదని, త్వరలో
మైనారిటీలు మెజారిటీలుగా రూపొందుతారన్న
విషప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఒక సమూహం మగవారు మరొక
ఆడవారిపై లైంగికదాడి చేశారనే ఫేక్ న్యూస్ వ్యాప్తితో ఒక
దుండగ మూక కుకీ స్త్రీలను వివస్త్రలను చేసి, ఊరేగించి
అత్యాచారం చేసింది. ఈ ఘోరానికి పాల్పడ్డవారు
ప్రస్తుతం అరెస్టు అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి
సృష్టించి, తమ రాజకీయ పబ్బం గడుపుకొనే వారే
అసలు నేరస్థులు. వారికే కఠినమైన శిక్ష పడాలి,
ఈశాన్య రాష్ట్రాల సామాజిక జీవనం దాని భౌగోళిక
స్వరూపం లాగే, మిగతా ప్రాంతాల సామాజిక జీవనంకన్నా
భిన్నంగా ఉంటుంది. మణిపూర్లో తొంభైశాతం కొండలు,
పదిశాతం మాత్రమే చదునుగా ఉండే లోయ ప్రాంతం.
ఇక్కడ మెయితీలు, గిరిజనులైన నాగ, కుకీ, జోమీ తెగలు
ప్రధానమైనవి. నాగ, కుకీ తెగల జనాభా 35 శాతం.
కాగా వీళ్లలో ఎక్కువ మంది క్రైస్తవులు. ఇక్కడ 65 శాతం
ఉన్న మెయితీలు, పది శాతం ఉన్న లోయ ప్రాంతంలో
ఉన్నారు. వీరిలో హిందువులు, కొంతమంది ముస్లింలు
కూడా ఉన్నారు. ఈ రెండు సమూహాల మధ్య చారిత్రకంగా
కొన్ని విభేదాలున్నప్పటికీ వాటిని అవకాశవాద, విభజన
రాజకీయాలకు వాడుకున్నది మాత్రం పాలకులే.
ప్రస్తుత హింసకు తక్షణ కారణాలు రెండు. మొదటిది
మణిపూర్ అడవులను సంరక్షించే నెపంతో
బీరెన్ సింగ్ ప్రభుత్వం కొండల్లో నివసించే కుకీ తెగలున్న
గ్రామాలను ఖాళీ చేయించింది. ఆ ప్రాంతాలను
రక్షిత అటవీ ప్రాంతాలుగా ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వంతో
ఉన్న కుకీ ఎత్నిక్ గ్రూప్ కూడా దీన్ని సమర్ధించింది.
అయితే ఈ చర్యను నిరసిస్తూ గిరిజనుల ఆధ్వర్యంలో
ఒక శాంతియుత ర్యాలీ జరిగింది. ప్రభుత్వం మాత్రం ఆ గ్రామస్థులు అడవిని ఆక్రమించి గంజాయి సాగుచేస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే చూరాచాందిపూర్ జిల్లాలో ఏప్రిల్ 28న సీఎం వీరేంద్రసింగ్ ఓపెన్ జిమ్ ప్రారంభించవలసి ఉన్నది. అయితే గిరిజనులను అడవుల నుంచి ఖాళీ
అడవుల సర్వేను, ఇంకా చర్చిల విధ్వంసాన్ని నిరసిస్తూ
గిరిజన నాయకుల ఫోరం అదే రోజు చూరాచాంది పూర్
బందుకు పిలుపునిచ్చింది. అదే రోజు వీరేంద్రసింగ్
ప్రారంభించాల్సిన జిమ్కు గుర్తు తెలియని వ్యక్తులు
నిప్పు పెట్టారు. దీనితో గొడవ పెద్దదైంది. జిల్లాలో ఐదు
రోజులపాటు కర్ఫ్యూ విధించడమే కాకుండా
ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది.
ఇక రెండవ కారణం ఏమిటంటే.. పదేండ్ల క్రితమే
మెయితీలు తమను ఎస్టీలుగా గుర్తించాలని కేంద్ర
గిరిజన మంత్రిత్వ శాఖకు, ఎస్టీ కమిషన్కు వినతి పత్రాన్ని
సమర్పించారు. దాన్ని ఆసరాగా తీసుకొని కేంద్ర ఎస్టీ
కమిషన్ ప్రస్తుత మెయితీల ఆర్థిక, రాజకీయ, సామాజిక
స్థితిగతులను తెలియజేస్తూ ఒక నివేదికను సమర్పించమని
నాటి ప్రభుత్వాన్ని కోరింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
దీంతో మెయితీలు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆ పని
పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే కుకీలను అడవుల నుంచి ఖాళీ చేయించటం, మెయితీలను గిరిజనులుగా గుర్తిస్తారన్న వార్త ప్రబలటంతో కుకీ, నాగ, జోమి తెగల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మే 3న కోర్టు
ఆదేశాలను నిరసిస్తూ కుకీ విద్యార్థులు నిరసన ప్రదర్శన
చేశారు. ఆ రోజు నుంచే దాడులు మొదలయ్యాయి.
తమ సంస్కృతిని రక్షించుకోవడానికి ఎస్టీ రిజర్వేషన్
కావాలని, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి
వల్ల తమ సంస్కృతికి నష్టం జరుగుతుందని
మెయితీల ఆరోపణ. దీనికి తోడు మెయితీలు వేలఏండ్లుగా
హిందువులని, నాగలు, కుకీలు ముస్లింలు, క్రైస్తవులనీ వారి
వల్ల సంస్కృతి దెబ్బతింటుందని ప్రచారం సాగింది.
ఇది ఘర్షణను పెంచింది. మణిపూర్ హైకోర్టు ఆదేశంతో
మిగిలిన అవకాశాలు కూడా తమకు ఉండవని
కుకీ, నాగలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకమైంది.నిజానికి ఇదంతా కేవలం మెయితీలు భూమ్మీద హక్కు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమే. దీనికి
కారణమేమంటే మణిపూర్ అటవీ ప్రాంతంలో
లైమ్ స్టోన్, క్రోమైట్, నికెల్, కాపర్ అజురైట్, మ్యాగ్నటైట్
వంటి ఖనిజాలు భారీ ఎత్తున ఉన్నట్టుగా
కనుగొనబడింది. ఒక్క లైమ్ స్టోన్ నిల్వనే రెండు కోట్ల టన్నుల
వరకు ఉన్నట్టుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
అంచనా వేసింది. దీన్ని తవ్వి తీసేందుకు బీజేపీ
ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు
చేసుకున్నాయి. అయితే ఆదివాసీ చట్టాల ప్రకారం
షెడ్యూల్డ్ ఏరియాలోని భూమిని ప్రైవేటు కంపెనీలకు
అప్పచెప్పటం అంత సులువు కాదు. కనుక మెయితీలకు
ఎస్టీ హోదా ఇచ్చి ఆ భూములపై నియంత్రణ
సంపాదించాలన్నది ప్రభుత్వ ఎత్తుగడ. తద్వారా కార్పొరేట్లకు
భూమిని అప్పగించాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నది.
పాలకుల స్వప్రయోజనాలు ఇలా ఉండగా వారి వికృత
క్రీడలో పావులైన మెయితీలు, కుకీల మధ్య భారీస్థాయిలో జరిగిన మారణకాండకు భారతదేశం సిగ్గుతో
తలదించుకోవలసి వస్తున్నది. ఇది కచ్చితంగా రాష్ట్ర,
కేంద్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన పన్నాగమే!
(వ్యాసకర్త: రాష్ట్ర కార్యదర్శి, మానవ హక్కుల వేదిక)
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
-
https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh3 3 ...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
No comments:
Post a Comment