Wednesday, August 9, 2023
41. సాధకుని హృదయం శాంతికి నిలయం
41. సాధకుని హృదయం శాంతికి నిలయం
శిష్యుడు : స్వామీ! భగవంతునికై పరితపించాలి
అన్నారు కదా! అది ఎలా సాధ్యం?
స్వామి : సాధుసాంగత్యం వల్ల నీ మనస్సు
నిర్మలమౌతుంది. ఆపైన నియమనిష్ఠలు పాటించావంటే
భగవత్పరితాపం, అంటే భగవంతుని గురించి
తెలుసుకోవాలనే ఆరాటం నీలో పెంపొందుతుంది. అదే
మార్గం నాయనా!
శిష్యుడు : అయితే, శాంతి ఎలా కలుగుతుందో
సెలవియ్యండి స్వామీ!
స్వామి : భక్తుని హృదయమే శాంతికి ఆలవాలం.
భగవత్ప్రప్తి పొందకుంటే జీవితం నిస్సారం అని గ్రహించు.
జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు
నీకు శాంతి లభిస్తుంది. సంసారంలో శాంతి కరవైనప్పుడు
హృదయంలో వైరాగ్యం జనిస్తుంది. అప్పుడు భగవంతునికై
వెదకడం ప్రారంభిస్తావు. సంసారం నిస్సారమని
అవగతమయ్యేకొద్దీ భగవద్భక్తి, దానితోపాటు శాంతి
పెల్లుబుకుతాయి. దాహం మిక్కుటమయ్యేకొద్దీ నీటికి ఉన్న
మాధుర్యం మరింతగా తెలిసి వస్తుంది. అంతటి పిపాస
కలిగినప్పుడే భగవంతుని ఆశ్రయించాలని, ఆశ్రయిస్తే
శాంతి లభిస్తుందని అంతరార్థం.
శిష్యుడు : ప్రేమ లేదా భక్తి కలగాలంటే?
స్వామి : ధ్యానప్రార్థనాది సాధనల ద్వారా అవి
కలుగుతాయి.
శిష్యుడు : లోకంలో ఉంటూనే మనిషి భగవంతుని
దర్శించగలడా స్వామీ?
స్వామి : అంటే లోకంలో ఉండకుండా లోకం
వెలుపల కూడ ఉంటాడంటావా?
శిష్యుడు : అది కాదు స్వామీ! 'సంసారంలో
ఉంటూనే' అని నా ఉద్దేశం.
స్వామి : ఓహో! అతడూ తరిస్తాడు. కాని అధికంగా
ప్రయత్నం చేయాలి.
శిష్యుడు : వైరాగ్యం జనించిన పక్షంలో సంసారం
పరిత్యజించాలా?
స్వామి : తప్పక పరిత్యజించాలి. నిజమైన వైరాగ్యం
అయిన పక్షంలో అది కార్చిచ్చులా మనస్సును
సాధకుని హృదయం శాంతికి నిలయం
క్రమ్మివేస్తుంది. శ్రీరామకృష్ణులు అన్నట్లు, 'వల నుండి
బయట పడ్డ చేపలా' సంసారాన్ని పరిత్యజించిన విరాగి
తిరిగి బంధంలో పడడానికి ఇష్టపడడు, నాయనా!
శిష్యుడు : గురువు ప్రమేయం లేకుండా
భగవత్సాక్షాత్కారం సాధ్యమేనా స్వామీ?
స్వామి : గురువు ప్రమేయం లేకుండా అంత
సులభసాధ్యం కాదు, నాయనా! మంత్రోపదేశం మూలంగా
భగవత్రాప్తికి మార్గాన్ని చూపేవాడు గురువే! ఆతడు
సాధనారహస్యాన్ని తెలియచేస్తాడు. శిష్యుడు మార్గభ్రష్టుడు
కాకుండా గురువు సదా వెయ్యికళ్ళతో గమనిస్తూ ఉంటాడు.
ఇదంతా, గురువు స్వయంగా బ్రహ్మజ్ఞాని అయినప్పుడే
సుమా!
శిష్యుడు : చిత్త ఏకాగ్రత ఎలా కలుగుతుంది స్వామీ?
స్వామి : సాధనల మూలంగా. అంటే విద్యుక్తంగా
పూజ జపధ్యాన ప్రార్థనలు చేస్తూ ఉండాలి. రోజుకు రెండు
గంటలసేపు ధ్యానం చేయగలిగితే చాలదు. సాధన
చేస్తూన్నకొద్దీ మనస్సుకు ఏకాగ్రత చేకూరుతుంది. నిత్యం
విధిగా సాధన కొనసాగిస్తూనే ఉండాలి.
సగుణ సాకారమైన తన ఇష్టదేవతను గూర్చి
సాధకుడు మానసికారాధనతో సాధనను ప్రారంభించాలి.
అప్పుడు తేజోరూపుడైన తన ఇష్టదేవతామూర్తిని ధ్యానిస్తూ
క్రమంగా ఆ రూపాన్ని నిరాకార రూపంగా మలచుకోవాలి.
భగవంతుడు సగుణ నిర్గుణ స్వరూపుడని, ఇంకా ఈ
రెండిటికీ అతీతుడని ఇందుమూలంగా గ్రహించాలి.
శిష్యుడు : ‘బ్రహ్మసత్యం - జగన్మిథ్య' అనే వేదాంత
వాక్యానికి అర్థం ఏమిటి స్వామీ?
స్వామి : ఈ కానవచ్చే ప్రపంచం యావత్తు మిథ్య
అనీ, అశాశ్వతమనీ, భగవంతుడు ఒక్కడే శాశ్వతుడనీ,
అదే సత్యమనీ అర్థం. సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఈ
బాహ్యప్రపంచం అదృశ్యమౌతుంది. ఆధ్యాత్మవిదుణ్ణి కనుక
తన అనుభవాన్ని గురించి చెప్పమని అడిగితే అతడి
సమాధానం ఇలా ఉంటుంది.
ఆ స్థితిలో ఉన్నదంతా దివ్యానందమే. అక్కడ నేను
నువ్వు అనే తారతమ్యం ఉండదు. సర్వమూ అఖండ
సచ్చిదానంద బ్రహ్మమే. ఆ ఆనందానుభూతి
ఎల్లలెరుగనిది, అది వర్ణనాతీతం.
శిష్యుడు : అయితే స్వామీ, భగవంతుడు ఉన్నాడు.
అనేందుకు నిదర్శనం ఏదైనా ఉన్నదా?
స్వామి : ఎందుకు లేదు? 'నేను భగవంతుణ్ణి
దర్శించాను. నువ్వూ దర్శించగలవు' అంటాడు జ్ఞాని.
'గంజాయి' అన్న మాట విన్నంత మాత్రానే మత్తు
కలుగుతుందా బాబూ? గంజాయి తెచ్చి, తగిన
దినుసులతో కలిపి పానీయం తయారుచేయాలి. ఆ
పానీయం సేవించిన కొంతసేపటికి మత్తు కలుగుతుంది”
అనేవారు శ్రీరామకృష్ణులు. అందుకే సాధనలు అనుష్ఠించి
సహనంతో వేచి ఉన్నప్పుడుగాని భగవద్దర్శన భాగ్యం
లభించదని నేను చెబుతున్నాను.
శిష్యుడు : జపం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి నా
మనస్సు భావశూన్యమైపోతుంది స్వామి. అందుకు కారణం
ఏమై ఉంటుంది?
స్వామి : ఆత్మవికాస మార్గంలో అదొక అంతరాయం
అన్నమాట. ధ్యానాన్ని జపంతో మేళవించి సాగించాలి
నాయనా!
ధ్యానమంటే? భగవత్పరమైన ఎడతెగని
భావపరంపరే ధ్యానం. ధ్యానం పరిపక్వమైనప్పుడు
తన్మయత్వం కలుగుతుంది. ఆపైన సమాధిస్థితి. ఆ స్థితిలో
అనుభవించేది ఆనందమే; అదే శాశ్వతానందం.
42. లోకహితార్థం జీవించు
స్వార్థపరత్వం లేనివాడే లోకక్షేమం కోసం
పాటుపడతాడు. మేలు చేసినవారికి సైతం కీడు
తలబెట్టేవాడు, స్వప్రయోజనం మాత్రం ఆశించేవాడు
స్వార్థపరుడు; కేవలం లౌకికుడన్నమాట.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పరోపకారం చేయడం
కోసమే జన్మించి జీవయాత్ర సాగించిన మహానుభావుడు.
ఆ మహానుభావుని నుంచి ఉపకారం పొందికూడ
ఆయన్ను నిందించినవారు, ఆయనకు కీడు
తలబెట్టినవారు లేకపోలేదు. ఇదేం వింత? అని ఆయన్ను
అడిగితే, ఇందులో వింత ఏముంది? అంటూ ఆయన
జాలిపడే వాడట. ఇది వింతల్లో వింత కదా! మేలు చేయడం
సజ్జనుడి స్వభావమైతే, కీడు తలబెట్టడమే దుర్జనుడి నైజం.
లోకం తీరే అంత కాబోలు.
ఒకప్పుడు ఒక సాధువు ఒక నది ఒడ్డున కూర్చుని
ధ్యానం చేసుకొంటున్నాడు. హఠాత్తుగా నీళ్ళమీద తేలుతూ
ఒక తేలు ఆయన కంటబడింది. దయతో చేయి చాపి
తన అరచేతిలోకి దాన్ని తీసుకొని కాపాడాడు. వెంటనే
ఆ తేలు ఆయన అరచేతిని కాటేసింది. బాధతో ఆయన
చెయ్యి విదిలించగా ఆ తేలు నీళ్ళలో పడిపోయింది. తేలు
నీళ్ళమీద తేలుతూవుంటే మళ్ళీ ఆయన దయతలచి తన
అరచేతిలోకి ఎక్కించుకొని రక్షించాడు. కాని తన ధోరణిలో
ఆ తేలు మళ్ళీ ఆయన్ను కాటేసింది. ఇలా మూడుసార్లు
జరిగింది. జరుగుతూన్నదంతా గమనిస్తున్న ఒక బాటసారి
ఆ సాధువుతో ఇలా అన్నాడు: "స్వామీ! అదేపనిగా
మిమ్మల్ని కాటువేస్తున్న ఆ తేలును పదే పదే మీరు
కాపాడటం నాకు అర్థం కావడం లేదు.”
అందుకు ఆ సాధువు ఇలా జవాబిచ్చాడు. “బాబూ!
కాటువేయడం తేలు స్వభావం. కష్టంలో ఉన్నవారికి
సహాయం చేయడం నా స్వభావం. కేవలం ఒక పురుగు
ఎట్టి పరిస్థితుల్లోనూ తన నైజగుణాన్ని విడిచిపెట్టనప్పుడు,
మనిషినైన నేను నా ధర్మాన్ని విస్మరించవచ్చా?”
అధోగతి, ఊర్ధ్వగతి అని మనస్సుకు రెండు గతులు
ఉంటాయి. అసూయ, స్వార్థం, భోగాలపట్ల అనురక్తి,
సోమరితనం మనిషి పతనానికి దారితీస్తాయి.
దైవభక్తి, శ్రద్ధ, ప్రేమ, సానుభూతి మనిషి ఉన్నతికి
తోడ్పడతాయన్నది ఎన్నటికీ మరువరాదు సుమా!
43. జపం - అనుబంధం
జపధ్యానప్రార్థనలకై, వాటి మూలంగా భగవద్దర్శన
నిమిత్తం గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేస్తాడు.
భగవంతుని పవిత్ర నామమే మంత్రం. ఇష్టదేవత మీద
మనస్సు నిలిపి మంత్రాన్ని పదేపదే స్మరించడమే జపం.
భగవన్నామాలన్నీ కూడ సమాన శక్తిమంతాలే అని
ఆర్యుల విశ్వాసం. అక్షయుడైన భగవంతునికి అనేక
నామాలు ఉన్నాయి. అవన్నీ ఆయనకు భిన్నత్వాన్ని
ఆపాదించడానికేమో అనిపించవచ్చు. కాని ఆ
పరమాత్ముని ఏ పేరుతో, ఏ రూపంలో ఉపాసించినా ఆ
భగవదనుగ్రహాన్ని, భగవత్ప్రప్తిని పొందవచ్చునని
గ్రహించాలి.
యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం |
మమ వర్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥
'పార్థ! ఎవరెవరు ఏఏ రీతుల్లో నన్ను ఉపాసిస్తారో
వారిని ఆయా రీతులలో అనుగ్రహిస్తూ ఉంటాను. సకల
విధాలా మానవులు నన్నే, నే చెప్పిన మార్గాన్నే
అవలంబిస్తున్నారు' అంటున్నాడు గీతాకారుడు.
'ఏకం సద్విప్రా బహుధా వదన్తి.' ఉన్నది ఒక్కటే,
ఋషులు ఆ పరతత్త్వాన్ని అనేక నామాలతో
పేర్కొంటున్నారు. సచ్చిదానంద స్వరూపమైన పరతత్త్వం
అద్వితీయం కాని అది అనేక నామరూపాల వ్యక్తం
అవుతూ ఉంటుంది, అనేక కళలతో భాసిస్తూ ఉంటుంది.
ప్రతి కళకు, ప్రతి అంశకు ప్రత్యేకమైన సాంకేతిక నామం
ఏర్పడి ఉంది. మంత్రద్రష్టలు, తత్త్వదర్శులు అయిన
మహనీయుల, ఋషివరేణ్యుల దివ్యానుభూతుల నుండి
ఈ నామాలు, మంత్రాలు వెలువడ్డాయి. అట్టి మంత్రం
సద్గురువు ద్వారా శిష్యుడికి ఉపదేశింపబడినప్పుడే, అది
దివ్యశక్తిని సంతరించుకొంటుంది. ప్రతి జీవిలోను
నివురుగప్పిన నిప్పులా అణగిమణగి పడి ఉన్న దివ్యత్వం
మంత్రజపధ్యానాదులచే ప్రదీప్తమవుతుంది, ధగధగ
ప్రకాశిస్తుంది. సాధకుడు ఉపాసించే ప్రత్యేక భగవద్రూపమే
'ఇష్టదైవం' అనబడుతుంది.
స్వామి వివేకానంద ఇలా అన్నారు: “ప్రతి మతమూ,
ప్రతి సంప్రదాయమూ తనదైన స్వీయ ఆదర్శాన్ని మాత్రమే
లోకులకు ప్రదర్శిస్తూ ఉండగా, దైవత్వమనే గర్భగుడిలో
ప్రవేశించాలంటే, వేదాంతమనే సనాతనధర్మ మంత్రం
మానవాళికి అనంత ద్వారాలు చూపుతూ,
భగవత్స్వరూపాన్ని నిరూపించే అనంతమైన ఆదర్శాలను
వెల్లడిస్తూ ఉంది.”
పూర్వకాలంలోనే కాదు ప్రస్తుత కాలంలో కూడ
దైవస్వరూపులు, అవతారమూర్తులు మానవజీవనమనే
దుర్గమారణ్యాన్ని భేదించి, నిర్మించిన రాచబాటను
వేదాంతం ముముక్షుజనానికి అమిత వాత్సల్యంతో
చూపుతూ, నిర్దేశిస్తూ ఉంది.
మాయనుండి విడివడి జీవాత్మ శాశ్వతానంద
సాగరంలో స్వేచ్ఛగా తేలియాడేందుకు అనువైన ఘట్టానికి,
అదే పరంధామానికి ముందు తరాలవారిని సైతం తన
దివ్యప్రేమమయమైన హస్తాలు జాపి, ఆహ్వానిస్తూ ఉంది
బాబూ!
కాని దీనిని బట్టి సాధకుడు భగవంతుని నేడు ఒక
రూపంలోను, రేపు మరో రూపంలోను ఉపాసిస్తున్నట్లు
భావించరాదు. సాధకుడు నిరంతరమూ తన ఇష్టదైవాన్ని
నిష్ఠతో ఉపాసించాలి. మొక్క ఎదిగి మాను అయ్యేదాకా
చుట్టూ కంచెవేసి జాగ్రత్తగా సంరక్షించాలి. ఆశయాలను,
ఆదర్శాలను తరచు మార్చుకోవడం, కర్తవ్య నిర్వహణలో
అశ్రద్ధ చూపడం వంటి పశువుల పాలబడితే పారమార్థికత
అనే మొక్క నశించిపోతుంది. సాధనలో ఏకాగ్రత ప్రారంభ
దశలో ఎంతో అవసరం.
ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మంత్రజపం
కూడ కొనసాగించాలి. ధ్యానంతో జపాన్ని
మేళవించకుంటే, ఆ జపం నిస్సారమైపోతుంది. అధవా
చేసినా ఫలితం శూన్యమే. ఏది ఏమైనా జపం అన్నది
ఫలప్రదమే అనడంలో సందేహం లేదు. పట్టుదలతో సాధన
కొనసాగిస్తే, అనాసక్తత తొలగి, ఆసక్తి పెంపొంది
భగవత్సాన్నిధ్యానుభూతి కలిగి తీరుతుంది. జపం ద్వారా
హృదయం ఆనందమయమౌతుంది; రసానుభూతి
చెందుతుంది నిశ్చల జపం భగవత్ర్పాప్తికి చేయూత
నిస్తుంది.
స్వామి బ్రహ్మానంద తమ ఉపదేశాలలో జపం యొక్క
ఆవశ్యకత, ప్రయోజనాల గురించి పదేపదే
వక్కాణించేవారు. మంత్రదీక్ష పుచ్చుకొన్న శిష్యులకు ఈ
ఉపదేశాలు ఇచ్చేవారు. ఏ గురువు వద్దా ఇంకా మంత్రదీక్ష
పుచ్చుకోని వారైతే, ఏ పవిత్ర భగవన్నామాన్ని అయినా
జపించవచ్చు అన్నారు.
నియమప్రకారం సంఖ్యను హెచ్చిస్తూ, తగ్గిస్తూ
నిత్యం నిర్ణీత సంఖ్యలో జపం చేయాలనే నియమంతో
కూడుకొన్నదే పురశ్చరణ,
ఉదాహరణకు; సాధకుడు శుక్లపక్ష పాడ్యమినాడు
వెయ్యిసార్లు మంత్రజపంతో పురశ్చరణ ఆరంభించవచ్చు.
మరునాడు రెండువేల సార్లు, ఆ మరునాడు మూడువేలు.
ఈ ప్రకారం రోజూ హెచ్చిస్తూ పౌర్ణమికి పదిహేనువేల
సార్లు జపించవచ్చు. మరుసటి రోజు పాడ్యమినాడు
పధ్నాలుగు వేలకు దిగవచ్చు. ఈ రీతిలో తగ్గిస్తూ
అమావాస్య వచ్చేసరికి వెయ్యిసార్లే జపించవచ్చు. ఈ
తీరులో సాధకుడు తన ఇష్టానుసారం గాని లేక
గురూపదేశాన్ని అనుసరించిగాని ఈ సాధనను ఒకటి
రెండు లేక మూడేళ్ళ పాటు సాగించడం శ్రేయోదాయకం.
ఒక్కోసారి దాన యాగాదులకు, ప్రాయశ్చిత్తానికి
బదులుగా అధిక జపం విధింపబడటం పురశ్చరణలోని
విశేషం.
జపసంఖ్యను సులువుగా లెక్కించే నిమిత్తం
హిందువులు, బొద్ధులు, క్రైస్తవులలోని కేథలిక్
సంప్రదాయస్థులు తరచు ఆపమాలను ఉపయోగిస్తూంటారు.
44. పారిజాతాలు
* నాయనా! ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు.
భగవంతుడు నీకు సకలం చేకూరుస్తాడు. భగవంతుని
పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండు. ఆయన
నామజపం చేయి. ఆయనే నీకు మనోబలాన్ని
ప్రసాదిస్తాడు. ఆందోళన చెందక, ఓర్పు వహించి,
ఒడుపుగా ప్రయత్నించు. సాధనానుష్ఠానం
కొనసాగించు. అప్పుడు భగవదనుగ్రహం తప్పక
పొందగలవు. అమూల్యమైన కాలాన్ని అర్థంపర్థంలేని
ఆలోచనలతో వ్యర్థంచేసుకోకు. మెట్ట వేదాంతాన్ని
కట్టిపెట్టు. విషయవాంఛలను నీలో తలెత్తనివ్వకు;
సత్ఫలితం అందుకొంటావు, భగవత్కృప పొందగలవు.
శ్రద్ధ జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.
శ్రద్ధ కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు
తప్పదు. భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి
అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి.
విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ
సమాధానాలుగానే తోస్తాయి.
* మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ
జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. పవిత్ర
గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి.
పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా
చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు
ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య
పటాటోపానికి మాత్రమే తగును. నాయనా!
దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే
తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే
భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో
మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక,
అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని
రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ
జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ
యుగంలో అవతరించారు.
* జపధ్యానాదుల వలనా, ప్రార్థనల చేతా హృదయ
వికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి,
దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు
సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను
ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం
సిద్ధించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న
సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించ
గలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి
సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని
చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు
నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు
భగవచ్చింతనలో లగ్నమైపోతుంది
మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని
పాదుగొలిపి విరాజిల్లుతున్నాడనే మహాతత్త్వాన్ని
మనస్సులో పదిలపరచుకోవాలి.
భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం
ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో
మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ
రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు
భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు.
అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. ఆయన
దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు
ఆనందంతో మురిసిపోతాడు. జ్ఞానమార్గావలంబులు
ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న
పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా
భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు.
* నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే
అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి
యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే.
కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత
నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా
దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే
ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు.
*మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ
మరచిపోకండి. ఆహార నిద్రాదులతోనే
పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ
మానవ జన్మ. దుర్లభమైన మానవ జన్మను
ప్రాప్తించుకొన్నావు కనుక ఇంద్రియ సుఖాలను
తృణీకరించి భగవత్సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని
పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో
మృత్యువును ఎదుర్కోవలసి వచ్చినా బెదరిపోవద్దు.
భక్తి, జ్ఞాన పారవశ్యం పొంది శాశ్వతమైన ఆనంద
సామ్రాజ్యంలో అడుగిడే ప్రయత్నం చేయాలి.
పారమార్థిక పారిజాతాలు
(ఆధ్యాత్మిక సులభ సాధనోపాయాలు)
స్వామి బ్రహ్మానంద బోధనలు
ఆంగ్లమూలం:
స్వామి ప్రభవానంద
రామకృష్ణ మఠం
దోమలగూడ, హైదరాబాదు - 500029
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
No comments:
Post a Comment