Monday, April 17, 2023

#గణేశ_పంచరత్నమ్#శ్రీశంకరులు#swami_sundara_chaitanyananda

గణేశ పంచరత్నమ్ రచన : శ్రీ శంకరులు యజ్ఞజీవన మాశించు వారలకు విఘ్నములు అవాంఛ నీయములు విఘ్నము లంతరించి, సుఖప్రదమగు శుభములను పొంది తరించవలెనన్నచో విఘ్నవినాశకుడైన విఘ్నేశ్వరుని స్తుతించవలెను. గణాధిపతియైన గణేశుని అగణిత గుణశోభను ఈ స్తోత్రముద్వారా శ్రీ శంకరులు తెలియజేయుచున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం కలాధరా వతంసకం విలాసి లోకరక్షకమ్ అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం. ||1|| ఆనందంతో హస్తమందు మోదకమును ధరించిన వాడును, సదా మోక్షసాధకుడును, శిరమున చంద్రుని ధరించినవాడును, సర్వాధికుడును, సర్వలోకమునకు రక్షకుడును, ఏకైక ప్రభువును, గజాసురుని వధించినవాడును, తన నాశ్రయించిన భక్తుల అశుభములను తొలగించువాడును నగు వినాయకుని నమస్కరింతును. సతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధి కాపదుద్ధరమ్ సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరస్తరమ్ ||2|| తనకు మ్రొక్కని వారలకు మిక్కిలి భయంకరుడును, ఉదయ భానునివలె ప్రకాశించువాడును, సురాసురులచే నమస్కరించబడువాడును తనను పూజించు భక్తుల జీవిత బాధలను పొగొట్టువాడును, దేవేశ్వరుడును ! ఐశ్వర్య రాముండును, గణేశ్వరుదును, ప్రమధ గణేశ్వరుడును, మహా ప్రభువును, పరాత్పరుడును నగు వినాయకుని నమస్కరింతును. సమస్త లోక శంకరం నిరస్తదైత్యకుంజరం ద రేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరమ్ కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||3|| సమస్త లోకములకు శుభము లొసగువాడును, రాక్షసశ్రేష్టులను వధించినవాడును, ఉత్తముడును, శ్రేష్ఠమైన గజవక్త్రముగల వాడును, అక్షరుడును, కృపాకరుడును, క్షమానిలయుడును, సంతోషభరితుండును, తనకు నమస్కరించు వారలకు చక్కని కీర్తిని, మనస్సును కలుగజేయువాడునునగు వినాయకుని నమస్కరింతును. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వవందనం సురారి గర్వ చర్వణమ్ ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ కపోల దాన వారణం భజే పురాణ వారణమ్ ||4|| పేదల ఆర్తిని పోగొట్టువాడును, వేదములకు నిలయమైనవాడును, పరమేశ్వరుని జ్యేష్ఠపుత్రుడును, రాక్షసుల గర్వము నణచినవాడును, ప్రళయకాల భయంకరుడును, ధనంజయాది సర్పములను భూషణములుగ ధరించినవాడును నగు వినాయకుని నమస్కరింతును. నితాంత కాన్త దన్త కాన్తి మన్త శాస్తకాత్మజమ్ అచింత్యరూప మన్తహీన మన్తరాయ కృన్తకమ్ హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం తమేకదన్త మేవ తం విచిన్తయామి సంతతమ్ ||5|| అత్యంత మనోహరమైన దన్తకాన్తి గలవాడును, మృత్యుంజయుని కుమారుడును, చింతించుటకు వీలుగాని రూపముగలవాడును, నాశరహితుడును, విఘ్న వినాశకుడును, యోగుల హృత్పుండరీ కములందు సదా వసించువాడును నగు వినాయకుని స్మరింతును. మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మర న్గణేశ్వరమ్ అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్ ||6|| గణేశ్వరుని హృదయమున స్మరించుచు ఈ గణేశపంచరత్నమును ఎవ్వరయితే ప్రతి నిత్యము ప్రాతఃకాలమున పఠింతురో అట్టివారు ఆరోగ్యమును, సర్వోపద్రవ రహితస్థితిని, ఉత్తమ సాహిత్యమును, శుభకరమైన సంతతిని, పూర్ణాయుషును అప్లైశ్వర్యములను పొందుదురు.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular