మధురాష్టకం రచన: వల్లభాచార్యులు జీవితము సుఖదుఃఖాల సమ్మేళనము. తీపిని తాత్కాలికంగా రుచి చూపే అనుభవాలు కొన్నయితే, శాశ్వతంగా చేదును ముందుంచే అనుభవాలు, అనుభూతులే జీవితంలో ఎక్కువభాగాన్ని పెనవేసుకొని యుంటాయి. ప్రతి మానవుడు మాధుర్య జీవనాన్నే వాంఛిస్తాడు. అయితే తాను వాంఛించు మాధుర్యము మాయాప్రపంచములో లభ్యంకాదు. మాధవునినుండే లభించాలి. మధురామృత మందించు మాధుర్య జీవనము ననుభవించి తరించవలెనన్నచోమధుసూదనుని శరణు జొచ్చుటకన్నా వేరే మార్గము లేదు. మాధవుడే మాధుర్యము. అతడే మాధుర్యమూర్తి. మంగళకరుడైన అట్టి మాధవుని మాధుర్యానుభూతిని ఈ “మధురాష్టకం” ద్వారా వల్లభాచార్యులు కీర్తించుచున్నారు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||1|| పెదవులు తీపి, ముఖము తీపి, నేత్రములు తీపి, నవ్వులు తీపి, హృది తీపి, నడవడి తీపి, తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతే రఖిలం మధురం ||2|| పలుకు తీపి, ప్రవర్తన తీపి., దుస్తులు తీపి, ధోరణి తీపి, నడక తీపి, నటించుట తీపి. తీపికి నాథుడైన వాడంతయూ తియ్యదనమే. వేణుర్మధ...