Friday, April 10, 2015

ధర్మ ప్రభోధం - 10 APR 2015

జీవన మాధుర్యం

Posted On:4/10/2015 12:38:45 AM

సకల చరాచర సృష్టి నిర్మాణం అద్భుతం. పంభూతాల సాక్షిగా ఆవిర్భవించిన ప్రపంచ తత్తం అర్థం చేసుకొని మసులుకునే విశేషజ్ఞానాన్ని వివేకంలా మనిషికిచ్చాడు భగవంతుడు. ప్రకృతి సంపదలను ఆలంబనగా చేసుకొని సుఖంగా జీవించమని ఆశీర్వదించాడు. కానీ మనిషి కూర్చున్న కొమ్మనే నరికివేసుకునేంత స్థితికి దిగజారిపోయాడు.

గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, పర్యావరణ చింతనా వైశిష్ట్యాన్ని మనిషికి తెలియపరుస్తూ అడుగడుగునా మనిషి జీవనానికి ఆధారమయ్యాయి. ప్రకృతిని రక్షించుకున్నప్పుడే కదా, మనిషి సురక్షితంగా మనుగడ సాగించేది. ప్రపంచాన్ని కాంక్రీటు వనంలా మార్చేసి విశాలమైన భవంతుల్ని నిర్మిస్తున్నాడే గానీ, మానవత్వం విషయంలో రోజురోజుకూ కుంచించుకుపోతున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే విధానానికి స్వస్థిపలికి ఇకనైనా పాంచభౌతిక ప్రపంచాన్ని ప్రకృతివరంగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయాలి.

ఓం మధువాతాఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వో
షదీః మధు నక్తముతోషసి మధు మత్పార్థివగ్‌ం రజః మధు ద్యౌరస్తు
నః పితా మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తు సూర్యః మాద్వీర్గావో
భవంతు నః ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
మంచి పనులు చేయాలని అభిలషించే మనకు గాలి మాధుర్యంగా వీచాలనీ, నదులు తియ్యని నీటితో నిత్యం ప్రవహించాలనీ, చెట్టు చేమలు పచ్చగా పరిపుష్టిగా ఉండాలనీ, రాత్రింబవళ్ళు ప్రశాంతంగా గడవాలనీ, భూమి మాధుర్యాన్ని అందించాలనీ, ఆకాశం మాధుర్యాన్నీ వర్షించాలనీ, చంద్రుడు చల్లని వెన్నెల కురిపించాలనీ, పశువులు సమృద్ధిగా పాలను ఇవ్వాలనీ పరిశుద్ధ మనస్కులై మనుషులంతా కోరుకోవాలని ఆకాంక్షిస్తుందీ మంత్రం.
నిస్సారంగా, నిస్తేజంగా గడిపేస్తే జీవితానికి విలువేముంటుంది. మధురమైన ప్రతీ క్షణాన్ని ఆనందంగా జీవించడమే జీవనధర్మం. నేను అనే భావన స్వార్థాన్ని పెంపొందించి ఇరుకైన ప్రపంచంలోనే జీవితాన్ని ముగించేస్తుంది. మనం అనే ఆలోచనల విశ్వమే అవధిగా మాధుర్యాన్ని కురిపిస్తుంది. మనం మంచిగా, పరిశుద్ధంగా బతుకుదాం. ప్రకృతిని పరిశుద్ధంగా ఉంచుదాం. పర్యావరణ చింతనా దృక్పథంతో మాధుర్యాన్ని పంచుదాం.

-ఇట్టేడు అర్కనందనా దేవి
కర్మఫల త్యాగం

Posted On:4/1/2015 1:53:28 AM

ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే కర్మభూమి అయిన భారతదేశంలో మానవులుగా పుట్టే మహద్భాగ్యం సిద్ధిస్తుంది. ధన్యాస్తు యే భారతభూమి భాగే, స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయః పురుషాస్సురత్వాత్ అని విష్ణు పురాణంలో చెప్పబడినది. నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్యకర్మకృత్ అని భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ఉపదేశించినట్లుగా కర్మాచరణ పరులైన మానవులు తమకు కర్మాచరణయందే అధికారం కలదని, ఫలితాన్నిచ్చేవాడు భగవంతుడే అని విశ్వసిస్తారు.
కర్తవ్యనిష్ఠులైన ఆస్తిక జనులు ప్రతినిత్యము మనోవాక్ కాయములచే తాము ఆచరించు కర్మల యొక్క ఫలితాలను పరమాత్మయగు శ్రీ మన్నారాయణుని యందు కర్మఫల త్యాగం చేస్తారు.
కాయేనవాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పబడినది.

శాస్త్ర విహిత కర్మలను ఆచరించే కర్మిష్ఠులు సాత్విక త్యాగరూపముగా భగవంతుని ఆజ్ఞగా, భగవంతుని సేవగా భగవంతుడే స్వయంగా మాచేత ఈ పనిని చేయిస్తున్నాడు అనే భావశుద్ధితో
భగవదాజ్ఞయా భగవత్ కైంకర్యరూపేణ భగవానేవ స్వయం కారయతీతి బుధ్యా అనే సంకల్పంతో పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటారు. తాము కర్తవ్య బుద్ధితో కర్మాచరణ చేయవలసిన వారమేనని సర్వఫలప్రదుడు ఆ పరమాత్మయే అనే వాస్తవాన్ని గుర్తించగలిగిన మహనీయులను మనం ఆదర్శంగా గ్రహించాలి.
కర్మఫలిత్యాగభావన కలవాడు పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడగునుకర్మాణ్య సంకల్పిత తత్ ఫలాని సంన్యస్య విష్ణౌ పరమాత్మరూపే అవాప్యతాం కర్మమహీమనంతే తస్మిన్‌లయం యే త్వమలా ః ప్రయాంతి అని విష్ణుపురాణంలో పేర్కొనబడింది. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుటవల్లనే పరమసిద్ధిని పొందినారు. కావున ఓ అర్జునా నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితం. కర్మణైవ హి సంసిద్ధం అస్థితా జనకాదయః!
లోకసంగ్రహ మేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునికి భగవద్గీతలో చేసిన మహోపదేశం సకల మానవులకు ఆచరణీయం, అనుసరణీయం.
-సముద్రాల శఠగోపాచార్యులు
జీవిత సత్యం

Posted On:4/2/2015 1:52:20 AM

జీవితం ఒక దీర్ఘకాలిక స్వప్నం. మనం వాస్తవంలో కన్నా కలల్లోనే ఎక్కువగా బతుకుతుంటాం. అందులో కొన్ని కమ్మని కలలు. మరికొన్ని పీడ కలలు. మనది కానిదాని కోసం అనుక్షణం తాపత్రయపడుతూ మనదైనదీ, నిత్యమైనదీ, శాశ్వతమైనదీ అయిన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
యథా నద్యః స్యందమానాః సముద్రే స్తం
గచ్ఛంతి నామరూపే విహాయ
తథా విద్వాన్ నామరూపాత్ విముక్తః
పరాత్పరం పురుషముపైతి దివ్యమ్ ॥
ఎలాగైతే నదులన్నీ వాటివాటి నామరూపాలు మరచి సముద్రంలో విలీనం అయినట్లే సకల చరాచర జీవజాతి ఆత్మ అనే బంధంతో భగవంతున్ని చేరుతుంది. అవాస్తవంలో, అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నంత కాలం జీవిత సత్యం తెలుసుకోలేము. జ్ఞానదృష్టితో, ఆత్మ తత్తంతో పరమాత్మ స్వ స్వరూపాన్ని తెలుసుకోవాలి. భగవంతుడొక్కడే నిత్యం, సత్యం, శాశ్వతం. ప్రపంచమంతా మిథ్యే. విశ్వమంతా క్షణబంగురమే. ప్రతీ ప్రాణిలోని ఆత్మ-పరమాత్మ మాత్రమే అవినాశియై విరాజిల్లుతుంది.
ఓ ఊరిలో సాధారణమైన ఒక వ్యక్తి భార్యా, పిల్లలతో, కొంత ధనంతో మోస్తరుగా బతుకుతున్నాడు. అతనికి కలల్లో గొప్ప జీవితాన్ని ఊహించుకోవడం అలవాటు. ఒకరోజు రాత్రి అతనికో కల వచ్చింది. ఆ కలలో అతను రాజైనట్లు, అతి ధనవంతుడై సమాజంలో హుందాగా బతుకుతున్నట్లు కనిపించింది. తెల్లవారగానే కల చెదిరి మామూలు జీవితం కళ్ళ ముందుంది. అయినా ఆ కల గురించే ఆలోచిస్తూ రోజంతా గడుపుతాడు. అనుకోకుండా అతనింట్లో దొంగలు పడి ఉన్న ధనాన్నీ దోచుకుని వెళ్లిపోతారు. ఊరివాళ్లంతా విషయం తెలిసి పరామర్శించడానికి వచ్చినప్పుడు భార్యాపిల్లలు ఏడుస్తూ చాలా బాధపడుతుంటే ఆ వ్యక్తి మాత్రం నిర్లిప్తంగా, నిస్తేజంగా కూర్చుండిపోతాడు. అతని భార్య జరిగిన నష్టానికి బాధపడకుండా అలా ఉన్నావేమిటని అడుగుతుంది. అపారమైన ధనం పోయిందని బాధపడాలా? ఈ కొంత మొత్తానికి, చింతించాలా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె ఏ ధనమని ప్రశ్నిస్తే, కలను గూర్చి చెబుతాడు. అయ్యో! అది కల అంటుందామె. జీవితం కూడా దీర్ఘకాలిక స్వప్నమే అంటాడతడు. వాస్తవాన్ని పరిచయం చేసే ఆత్మ ప్రపంచంలో జీవించడమే అమర జీవనం.

- ఇట్టేడు అర్కనందనాదేవి
ప్రేరణాశక్తి

Posted On:4/3/2015 12:03:46 AM

సర్వం శక్తిమయం. శక్తినాట్యమే ఈ విశ్వం. శక్తి మనిషికి చైతన్యం, జీవితం. అందుకే బలమే జీవితం బలహీనతే మరణం అన్నారు మహాత్ములు. శరీరానికీ మనస్సుకూ సంబంధించిన అన్ని బాధలూ బలహీనత నుంచే పుట్టుకొస్తాయి. దేహశక్తి, మానసిక శక్తి, ఆత్మశక్తి మనిషి జీవితాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. కంటికి కనిపించే బాహ్య ప్రపంచాన్ని నడిపే స్థూల శక్తులూ, కానరాని ఆంతరిక ప్రపంచాన్ని నడిపించే సూక్ష్మ శక్తులూ మనిషికి ఆవశ్యకం.
ఓం తేజోసి తేజోమయి దేహి వీర్యంసి వీర్యం మయిదేహి
బలమసి బలం మయి దేహి ఓజోసి ఓజో మయి దేహి మన్యురసి
మన్యుం మయిదేహి సహో సహామయిదేహి ॥
భగవంతుడా! నీవు ఆత్మశక్తివి, నాకు ఆత్మశక్తిని ప్రసాదించు. నీవు సంయమన శక్తివి. నాకు సంయమన శక్తిని చేకూర్చు. నీవు శారీరక శక్తివి, నాకు శారీరక శక్తిని అనుగ్రహించు. నీవు దివ్యశక్తివి, నాకు దివ్యశక్తిని ఇవ్వు. నీవు ధైర్యమూర్తివి. నాకు ధైర్యాన్నివ్వు, నీవు సహనశీలివి, నాకు సహనాన్ని ప్రసాదించు. సానుకూల దృక్పథంతో జీవించాలనే మానసిక స్థితికి ప్రేరణ కలిగించే ఈ మంత్రం, ఉన్నతమైన,పరిపూర్ణమైన జీవితానికి నాంది పలుకుతుంది. జీవితాన్నిచ్చిన భగవంతున్ని దానిని సఫలం చేసుకునే ప్రయత్నంలో చేయూతనివ్వమనీ, శక్తినివ్వమనీ కోరే మనిషి ఆలోచనకు ప్రతిరూపమిది.
ఆత్మ సజీవంగా, చైతన్యంగా ఉన్నప్పుడు దేహశక్తి అంతరించిపోతే జీవితం నిరర్ధకమవుతుంది. అందుకే దేహశక్తి చైతన్యమయంగా ఉండడం అత్యావశ్యకం. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అన్నట్లు శరీరం దృఢంగా శక్తియుతంగా ఉంటేనే అన్ని ధర్మాలు నిర్వర్తించగలం. ఉరుకులు పరుగుల జీవితంలో మనకంటూ ఆలోచించే తీరికే లేని యాంత్రికతకు అలవాటుపడిన నేటి జీవనవిధానం స్వీయ ప్రేరణతోనే మార్పు చెందుతుంది. శక్తివంతమై అనేక ఘనకార్యాలను తన ఖాతాలో చేరవేస్తుంది.
ధైర్యం వీర్యం శక్తితో కార్యసాధనకై అడుగేసి, సహనంతో పరిస్థితిని సమీక్షించి కార్యోన్నతికై ప్రయత్నించాలి. సహనం కూడా మహోన్నత శక్తే. కొన్నిసార్లు తెలివితేటలతో నెగ్గలేనప్పుడు సహనమే సమాధానపరుస్తుంది. సహనం పాటిస్తున్నప్పుడు మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుంది. దానికి నిర్నిరోధమైన సంకల్పం. అందరికీ కావాలి. ఆ సంకల్పమే మహాశక్తియై జాతిని నడిపిస్తుంది.

- ఇట్టేడు అర్కనందనాదేవి
శోకమే శత్రువు

Posted On:4/4/2015 12:25:26 AM

మనసుకు నచ్చే సందర్భాలు, సంఘటనలు సంభవించినప్పుడు ఆనందిస్తూ కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దుఃఖిస్తూ ఉండేవారిని మనం చూస్తూనే ఉంటాం. కొందరు తమకు సంపదలు లేవని శోకిస్తారు. ఇతరులకు చాలా ఎక్కువగా ఉన్నాయని అసూయతో కుమిలిపోతుంటారు. మరికొందరు కష్టాలు అన్ని తమకే వచ్చాయని బాధపడుతూ సుఖపడే వారిని చూసి ఓర్వలేక వారిని మాటలతో దెప్పిపొడుస్తూ ఉంటారు. కానీ అది సరికాదు.
శిశువులు తమ ఆకలి బాధను, అనారోగ్యాన్ని మాటలతో చెప్పలేక ఏడవటం సహజమే. కానీ విద్యావంతులు, మహనీయ గుణాకరులు ఆపదల్లో శోకానుభవాన్ని పొందకూడదు.

ధైర్యాన్ని విద్యావివేకాలను సర్వశక్తులను నశింపచేసే శోకముతో సమానమైన వేరొక శత్రువు ఉండడు.
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్!
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః!!
అని వాల్మీకి రామాయణంలోని సూక్తి మనకు ఉద్బోధిస్తున్నది.
భార్యా వియోగాన్ని సహించలేక శోకిస్తున్న శ్రీరామచంద్రునితో నీవంటి మహాత్ములు శోకించడం తగదు. ఆపదల్లో కంటనీరు రావడం సహజమే. కానీ దాన్ని నిగ్రహించుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది. శోకానికి వశులై బాధపడే వారికి సుఖము ఉండదు. వారి శక్తి క్రమంగా తగ్గిపోవుచుండును శోకం ఉన్నవారి జీవితం సవ్యంగా సాగ దు వారు బతకడం కూడా సందేహమే ఓ రాజేం ద్రా శోకాన్ని వదులుము నేను నీకు ఆప్తమిత్రుడను నీ మేలుకోరి చెప్పుచున్నాను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.

యే శోకమనువర్తంతే ప్రణయాత్ త్వాం ప్రసాదయే!
తేజశ్చ హీయతే తేషాం నత్వం శోచితుమర్హసి!!
శోకేనాభిప్రవన్నస్య జీవితే చాపి సంశయః!
శోకం సంత్యజ రాజేంద్ర! ధైర్యమాశ్రయ కేవలమ్!!
అని సుగ్రీవుడు శ్రీరామచంద్రుణ్ణి కోరిన విషయాన్ని వాల్మీకి రామాయణంలోకి కిష్కిందకాండలో మనం దర్శించవచ్చు.
వయసుతో, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తించే సుగ్రీవుని వాక్కులలోని సారాంశాన్ని శిరసావహిద్దాం... ఆచరించేందుకు కూడా ప్రయత్నిద్దాం..

-సముద్రాల శఠగోపాచార్యులుర్యులు

సత్కార్య సాధకుడు

Posted On:4/7/2015 5:36:05 AM

సుఖదుఃఖాలను లెక్కించకుండా సంకల్పించిన కార్యం నెరవేరే వరకు విశ్రమించని వ్యక్తి కార్యసాధకుడుగా కీర్తింపబడుతాడు.
విఘ్నాలొస్తాయేమో అనే శంకతో కొందరు సత్కార్యాలను చేపట్టరు. మరికొందరు ప్రారంభించిన పనిని విఘ్నాలు రాగానే మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఉత్తములు ఎన్నెన్ని విఘ్నాలు వచ్చినా అన్నింటిని అధిగమించి ఆరంభించిన పనిని పూర్తిచేస్తారు.
విఘ్నైః ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః
ప్రారబ్దముత్తమజనాః న పరిత్యజంతి
అని చెప్పబడినది.
సంకల్పించిన సత్యార్యాన్ని శ్రద్ధతో పూర్తి చేయడమే కాకుండా సంకల్పించి పూర్తిచేసిన పనికి ఆటంకం లేకుండా తదనుగుణంగా మరికొన్ని సత్కార్యాలను సాధించగల కార్యదక్షత గల హనుమంతుని వంటి మహనీయులు కూడా మనకు చరిత్రలో దర్శనిమిస్తారు.
హనుమంతుడు సీతాన్వేషణ కార్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేయడమే కాకుండా, లంకాధిపతియైన రావణాసురుని దర్శించడం, అతని బలాబలములను గుర్తించడం, వానరుల శక్తిసామర్థ్యాలను రావణ సేనకు రుచి చూపించడం వంటి కార్యాలను ఎన్నింటినో సునాయసంగా సాధించి సత్కార్యాచరణపరుడిగా కీర్తిని పొందెను
కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్!
పూర్వకార్యవిరోధేన సకార్యం కర్తుమర్హతి!!
నహ్యేకః సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణ!
యోహ్యర్థం బహుధావేద స సమర్థో కార్థ సాధనే!! అని సుందరకాండ 41వ సర్గలో చెప్పబడినది.
హనుమంతుడి వంటి సత్యార్య సాధకుడు ఈ భూమిపైన మరొకరు మనకు లభించరని శ్రీరామ సుగ్రీవాదులు ఎందరో ప్రస్తుతించారు. శ్రీ రామాయణ మహామాలారత్నంగా, సత్కార్య సాధకుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుని ఆదర్శంగా గ్రహిద్దాం. మన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు త్రికరణశుద్ధిగా కృషిచేద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులుర్యులు
అహంకారం నశిస్తేనే ఆత్మప్రకాశం

Posted On:4/7/2015 11:44:49 PM

కారణం లేని కార్యం ఉండదు. సఫలం అయిన ప్రతీదానిలో మన వంతు కృషిని తలచి గర్వపడుతుంటాం. అంతా నేనే చేసానన్న భావనలో ఆత్మ విశ్వాసాన్ని కాస్తా అహంకారంగా మార్చేస్తాం. అన్ని అనర్థాలకూ కారణం అహంకారం. దానిని నిర్మూలించే సాధనం ఆనందమనే జ్ఞానం.
తస్మాదహంకారమియం స్వశుత్రుం
భోక్తుర్గళే కంఠకవత్ప్రతీతమ్
విచ్ఛిద్య విజ్ఞాన మహాసినాస్ఫుటం
భుంక్షాత్మ సామ్రాజ్య సుఖం యథేష్టమ్ ॥
మనిషికి మనిషే శత్రువనుకుంటాం.

కానీ అహంకారమే పరమశత్రువు. అదే అన్ని దుఃఖాలకూ హేతువు. అన్నం తింటూన్నప్పుడు కంఠంలో చిక్కుకున్న ముల్లు లా జీవితంలో బాధను తింటూన్నప్పుడు కంఠంలో చిక్కుకున్న ముల్లులా జీవితంలో బాధను కలిగిస్తూ ఉండేదే అహంకారం. విజ్ఞానం అనే ఆయుధంతో అహంకారాన్ని నిర్మూలించి ఆత్మ సామ్రాజ్య సుఖంలో ఆనందంగా బతకాలి. గ్రహణ సమయంలో నిండు చంద్రుని రాహువు పట్టేసినట్టుగా మనుషులందరినీ అహంకారం చుట్టేసింది. రాహువు వదిలితేనే చంద్రుని ప్రకాశం. అహంకారం పోతేనే ఆత్మప్రకాశం. నిర్మలం, పరిపూర్ణం, స్వయంప్రకాశం, ఆనందం అనే జీవితం ఆత్మజ్ఞానంతోనే లభిస్తుంది. అజ్ఞానం నశిస్తే అహంకారం దానంతటదే తొలగిపోతుంది. అహంకారం నశిస్తే ఆనందం జీవనసూత్రం అవుతుంది.

మనిషి అనుబంధాల, అనుభూతుల సాపత్సంలో నిండు నూరేళ్లూ బతకాలంటే అహంకారం వదిలి ఆత్మతృప్తితో జీవించాలి. సుహృదయంతో ఆలోచించగలగాలి. ఉన్నత వ్యక్తిన్ని పెంపొందించుకోవాలి. అన్నీ నాకే కావాలనే అత్యాశ, ప్రతీ అశాశ్వత విషయాలపై చింతన మనిషిని అహంకారంలోకి నెట్టేస్తుంది. నిమ్మచెట్టును మొదలు నుంచీ నరికేసినా వర్షపు నీటికో, అనుకోకుండా విదిల్చిన నీటికో మళ్లీ చిగురించి మహా వృక్షమవుతుంది. అహంకారం నశించినా ప్రాపంచిక విషయ వ్యామోహం వలన మళ్లీ విజృంభించి జీవితాన్ని చీకటి చేస్తుంది. వివేకం, విజ్ఞానం, మానవ మేధస్సునూ, మంచితనం నైతికత మానవ సుహృదయాన్నీ భావ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి తీసుకెళుతాయి. అహంకారం మనుషుల- మనసుల దూరాన్ని పెంచితే ఆనందం విశ్వమంతా మనదేనన్న ఆత్మబలాన్ని చేకూరుస్తుంది.
-ఇట్టేడు అర్కనందనాదేవి
భూమికి భారం

Posted On:4/9/2015 12:07:06 AM

భగవంతుని సృష్టిలోని క్రిమికీటకాలకన్న, పశుపక్ష్యాదులకన్న మానవ జన్మకు ఉండే ప్రత్యేకతను అందరూ అంగీకరిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మానవుడు తన మేధాశక్తితో, సంకల్ప శుద్ధితో, సత్కార్యాచరణతో, సంభాషణా చాతుర్యంతో అందరినీ మెప్పించగల సామర్థ్యం కలవాడు. విశ్వశ్రేయస్కరమైన మార్గంలో తరువాతి తరాలకు ఆదర్శప్రాయంగా నిలువగలిగే రీతిలో లోకోత్తరమైన కార్యాచరణతో మానవీయ విలువలను పెంపొందించునట్లు తన జీవనయానాన్ని కొనసాగించగలడు.
అయితే ఆ విలువలను గుర్తించక సోమరితనంతో ఒక లక్ష్యం లేక కర్తవ్య నిర్వహణను విస్మరించి జీవించే మానవుణ్ణి ఎవరూ ఆదరించరు.

ఎన్నెన్నో విద్యలను శ్రద్ధగా అభ్యసించాల్సి వుండగా అశ్రద్ధతో విద్యాభ్యాసాన్ని నిర్లక్ష్యం చేసినవాడు, ఒక మంచి ఆలోచన గాని, ఏకాగ్రతగాని లేని వాడు, తనకు ఉన్నంతలో ఆపదలో ఉన్న వ్యక్తికి ఎంతో కొంత దానం చేయాలనే తపన లేనివాడు, యుక్తాయుక్తములను గుర్తించుటకు అవసరమైన జ్ఞానం లేనివాడు, సకల సద్గుణాలకు మూలమైన సత్ప్రవర్తన లేనివాడు, మానవుడికి చెరగని కీర్తిప్రతిష్ఠలను సాధించిపెట్టే సద్గుణములు లేనివాడు, ధర్మాచరణ లేనివాడు, ఆకారాన్నిబట్టి మనిషిగా లోకంలో చెలామణి అవుతున్నను అతడు భూమికి భారమై బతుకుచున్నట్టివాడు -
యేషాం న విద్యా న తపో న దానం జ్ఞానం న శీలో న గుణో న ధర్మః
తే మర్త్యలోకే భువిభారభూతాః ॥
అని వ్యాసమహర్షి మహాభారత గ్రంథంలో పేర్కొన్నాడు. మహనీయులైన సాధుసజ్జనుల సాంగత్యాన్ని ఏర్పరచుకొని మానవ జీవితాన్ని ధన్యమొందించుకొనుటకు కావలసిన శాస్త్ర జ్ఞానాన్ని పెద్దలవద్ద అభ్యసించి భావశుద్ధితో పరోపకార బుద్ధితో జీవించేవారు లోకోపకారకులుగా ప్రఖ్యాతిని పొందుతారు. ఉండవలసిన మంచి అనేది మచ్చుకు కూడా లేక దుష్టసాంగత్యాన్ని, దురభ్యాసాలను, దురాలోచనలను కలిగియుండి దుష్కృత్యాలను చేసేవాణ్ణి సమాజాన్ని చీడపురుగులాగా పట్టిపీడించేవాణ్ణి భూమికి భారంగా బతుకుతున్నాడని అంటారు.
అమిత తపశ్శక్తి కలవాడై, వేదవేదాంగపండితుడై ఉండికూడా అధర్మబుద్ధితోదేవతల పట్ల, స్త్రీలపట్ల, నవగ్రహాల పట్ల అపచారాలను చేస్తున్న రావణుణ్ణి, అతని పరివారజనుల భారాన్ని తాను మోయలేకపోతున్నానని భూదేవి బ్రహ్మాదులవద్ద విన్నవించినది. భూమికి భారమై జీవించిన రావణాసురుని చేష్టలను, సంకల్పాలను మనం అనుసరించకూడదు, కొనసాగించకూడదు అనే సత్యాన్ని గుర్తిద్దాం.

- సముద్రాల శఠగోపాచార్యులు

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular