#chaitanya_bhagavad_gita #12th_Chapter_20_slokam#lyricsvideo #telugu_lyrical

 యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే |

శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే.. తీవ మే ప్రియాః ॥ 20॥

యే-తు- ధర్మామృతం- ఇదం-యథా-ఉక్తం-పర్యుపాసతే

శ్రద్ధధానా:-మత్పరమాః-భక్తాః-తే-అతీవ-మే-ప్రియాః

అర్జునా! ఈ ధర్మము అమృత స్వరూపము. నా భక్తులు శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు.

వ్యాఖ్య

ధర్మామృతం

ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించ బడింది (ఇదం యథోక్తం) ధర్మ్యామృతము

(ధర్మ్యామృతము). అంటే, ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్ధము.

ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది కనుక ధర్మ్యం (ధర్మాత్ అనపేతం ధర్మ్యం). ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము (అమృతహేతుత్వాత్). జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుకఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి (అమృత స్వరూపాచ). భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు. భక్తుడు కూడా అమృత రూపుడే.కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్టించినవారు అమృత స్వరూపులవుతారు.

భగవంతుని పరమగతిగా భావించి (మత్పరమాః), శ్రద్ధావంతులై( శ్రద్ధధానాః) భక్తి చేసే వారు

భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు (అతీవ ప్రియాః).

ఎవరైతే పరమేశ్వరుని మరొక దాని కొరకు కాకుండా, కేవలం పరమేశ్వరుని కొరకే సేవిస్తారో వారినే “మత్పరములు” అంటున్నాడు భగవంతుడు. కనుక, మరొక అవసర నిమిత్తం కాకుండా మోక్షార్థమే భగవంతుని ఆశ్రయించే పరమ భక్తులు ఉత్తమ శ్రద్ధావంతులై ఉండాలి.

భగవంతుని యందు, భగవంతుని స్వరూపాన్ని ప్రామాణికంగా అందించే శాస్త్రము నందు, ప్రమాణాన్ని సుస్పష్టం చేసే సద్గురువు నందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ. శ్రద్ధ గల వారు ధర్మామృతాన్ని పానం చేస్తారు. శ్రద్ధావంతులకే జ్ఞానామృతం ప్రాప్తిస్తుంది (శ్రద్ధావాన్ లభతే జ్ఞానం).

కర్మయోగులు సాధనా రూపమైన భక్తిని ఆచరిస్తారు. జ్ఞానయోగులు సాధ్యరూప భక్తిలో అలరారుతారు. కర్మయోగులు ధర్మాచరణంలో శుద్ధిని పొందుతారు. జ్ఞానయోగులు అమృత సిద్ధిని పొంది శోభిస్తారు. యోగులు ఆచరించే ధర్మము అమృత స్వరూపమైన జ్ఞానానికి హేతువుగా ఉంది.

కనుక కర్మయోగుల ధర్మమును, జ్ఞానయోగుల అమృతమును రెండిటిని కలిపి ఈ అధ్యాయము ధర్మ్యామృతముగా అందించింది. ధర్మ సంబంధమైన ఈ అమృతమే మోక్ష హేతువుగా ఉంది.

ధర్మరూపంగా శోభిస్తూ, అమృతత్వానికి సాధనం కావడం చేత అమృతమైంది. 

అమృతమువలె ఆస్వాదింప బడుటచేత కూడా అమృతమైంది. అక్షర రూపులైన అవ్యక్తోపాసకులు ఆస్వాదించేదీ అమృతమే.

అమృత జ్ఞానం చేత ఏ అద్వేష్టృత్వాది లక్షణాలు శోభిస్తున్నాయో అవి జ్ఞానికి సహజ లక్షణాలే గాని సాధన రూపాలు కావు అని వార్తికాకారుని అభిప్రాయం కూడా.

శ్లో|| ఉత్పన్న ఆత్మావబోధస్య హి అద్వేషృత్వాదయో గుణాః ।

అయత్నతో భవస్త్యేవ న తు సాధన రూపిణః ||

ఆత్మజ్ఞానము కలిగిన మహాత్మునిలో అద్వేష్టృత్వాది లక్షణాలు ప్రయత్నము లేకుండానే శోభిస్తూ ఉన్నాయి. అవి సాధన రూపాలు కావు అన్నది వార్తికము.

అక్షర రూపమైన అవ్యక్తోపాసనను సాగించే జ్ఞానులు భగవంతునికి మిక్కిలి ప్రీతి పాత్రులు. అర్జునా! ఆత్మవిదుడైన భక్తునికి నేను మిక్కిలి ప్రియమైన వాణ్ణి. అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు (ప్రియోహి జ్ఞానినో... త్యర్థ మహం స చ మమ ప్రియః - 7 - 17).

అలాగే సగుణారాధకులైన విశ్వరూపోపాసకులు, జ్ఞానశుద్ధి ద్వారా పరమేశ్వరునే పొందుతూ ఉన్నారు. కనుక, అట్టి అనన్య భక్తులు కూడా భగవంతునికి మిక్కిలి ప్రియులు (మద్భక్తః మే ప్రియః : అ. 12- శ్లో. 14,15, 16, 17, 19).

అనన్య భక్తుడికి, జ్ఞానీ భక్తుడికి - ఇద్దరికీ పరమేశ్వరుడే పరమగతి కనుక ఇద్దరూ భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులే(భక్తాః తే అతీవ మే ప్రియాః)

ధర్మ్యామృతం దివ్యంగా కురిసింది. బుద్ధి పాత్రలలో నింపుకున్నాం. ఇక జుర్రడమే మిగిలి ఉంది. ధర్మ్యామృతాన్ని పానం చేసేవాడు భగవంతునికి ఇష్టుడవుతాడు. భగవంతునికి ఇష్టుడైన వానికి మోక్షం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వానికే మోక్షం లభించకుంటే ఇంకెవరికి లభిస్తుంది?

తస్మాత్ ఇదం ధర్మ్యామృతం ముముక్షుణా యత్నతః అనుష్ఠేయం విష్ణోః ప్రియం పరంధామ జిగమిషుణా ఇతి

వాక్యార్థః - కనుక, ప్రియాతి ప్రియమైన విష్ణుపదమును పొందాలని అభిలషించే ముముక్షువు, ధర్మ్యామృతమైన పరమ భక్తిని అవశ్యము ప్రయత్న పూర్వకంగా అనుష్ఠించాలి అని వాక్యార్థం. ఆచార్యుల వారి ఈ భాష్య వాక్య సందేశముతో భక్తిని విషయముగా కలిగిన భక్తి యోగమును సమాప్తం చేస్తూ ఉన్నాను. ఇంతటితో తత్

పదార్థ స్వరూపమైన మధ్యమ షట్కము సమాప్త మైంది.

ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః

ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు భక్తియోగమనే  పన్నెండవ అధ్యాయము .


Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి