ఆప్తవాక్యం - వెన్నెల పాలవెల్లి #SEP_2025_GIRIDHARI#swami_sundara_chaitanyananda
ఆప్తవాక్యం - వెన్నెల పాలవెల్లి
అంబరాన్ని అంటే నా ఆలోచనల వెనుక
అబ్ధిని కుదిపే నా సంకల్పాల నడుమ
అవనిని కదిపే నా ఆశల మాటున
యుగయుగాలుగా ప్రభో! ఎలా ఒదిగిపోయావు?
జగమంతా చీకట్లు ముసురుకున్నప్పుడు
వత్తు లేసుకొని నాలో తొంగి చూచిందెవరు?
మూతబడిన నా నయవాల తిమిరాలలో నిల్చొని
మౌనంతో నన్ను పలకరించిందెవరు?
దాగిందెవరు? చెప్పు !
నిన్ను నాలో దాచిందెవరు?
దాగేవాడు దొంగయితే
దాచేవారు దొరలా?
నీవెప్పుడూ నాతోనే ఉన్నా
నేనెప్పుడూ నీతో ఉండలేకపోతున్నా
ప్రతిక్షణం నీవు నన్ను పిలుస్తున్నా
మరుక్షణంలో నేను పడిపోతున్నా
ఒంటరిగా నీతో మాట్లాడాలనుకుంటున్నా
ఒంటరినై మాట్లాడేదెలాగో తెలియక పడిఉంటున్నా
నిన్ను చేరే ఆలోచన చెయ్యాలనుకున్నా
ఏమైందో గాని ఆలోచనను ఎక్కడో పారేసుకున్నా.
గాలిమేడలుగా ఎందరికి అగుపించినా
గాలి భాషలోనే నేను ఆలపిస్తున్నా
నీటి మూటలుగా మరెందరికి కనిపించినా
నీటి పైటనే నేను పట్టుకొని ఉన్నా
అంతమెక్కడో తెలియదని అందరంటున్నా
నా ఆంతర్యంలోనే అంతా ఉన్నదంటున్నా
నీ నిద్రకు భంగమని పలుకలేకున్నా
నీవు పిలిచినపుడు ఆదమరచి నిద్రపోతున్నా
ప్రభో!
మట్టిలోనే చెట్టు నిలిచి ఉన్నా
చెట్టు చుట్టూ మట్టే ఉన్నా
ఒట్టేసి మరీ చెప్పమంటున్నా
వట్టిమాటలు ఇక వద్దంటున్నా!
మల్లెలు మహిలో విరిసినా
నా ఊహల నవి తాకలేవని
జాడ తెలుపక జారుకుంటున్నా
జతగా నిన్ను చేరుకుంటున్నా!
వెన్నెల భువిలో కురిసినా
నా భావాలను తడుపలేదని
తలుపులు మూసి మురీ పోతున్నా
నీ తలపులతో నిండిపోతున్నా!
చిరుగాలి ఎంతగా తిరిగినా
నా చిరునామా దొరకదని
మాట పడేసి పోతున్నా
మాట మూలాన పడి ఉంటున్నా
పైరు పచ్చగా ఎదిగినా
ఎగిరి నన్ను పట్టలేదని
ఎరుక పరచి పోతున్నా
ఎరుకలోనే నేనుంటున్నా!
మేఘాలు చుట్టు మూగినా
దోగాడే నన్ను నిలపలేవని
దారి చూపే తారకలను
దారిలో ఎవరూ ఆపలేరని
అన్నీ వదిలిపోతున్నా
నిన్ను వదలలేక నేనున్నా!
వేదనలు వెన్ను విరుస్తున్నా
ప్రార్థనలు పలుకుతూనే ఉన్నా
ఆవేదనలు అడ్డు నిలుస్తున్నా
ఆరాధనలు ఆపకుండా ఉన్నా
నిశీధి నన్ను చుట్టేసినా
నీరాజనంతో నీ మోము చూస్తూనే ఉన్నా
సహృదయు లెందరు పిలిచినా
హృదయంలో నీతోనే పలుకుతున్నా!.
నా హృదయ సదనములో
సదా మెరిసే వదనము నీదే
నా హృదయ గగనములో
సర్వదా విరిసే వెన్నెల నీదే
ప్రభో!
మనస్సు విప్పి నేను చెబుతున్నా
మనస్సు పెట్టి నిన్ను వినమంటున్నా
పాలుపోక పాలుగొంటానే గాని..
పనిగట్టుకొని పాలు పంచుకోను
కురిసింది మదిలో నీ ప్రేమజల్లు
తనకు తానుగా అదే శాంతిని వెదజల్లు
నా హృదిలో వెలిసింది నీ వెన్నెల పాలవెల్లి
వేడుతూ ఉంటాను నా మాటల పూలు జల్లి
3ు స్వామి సుందర చైతన్యానంద
Comments