Friday, August 29, 2025

#అచ్చులు_హల్లులతో_గణపతి_పూజ #సేవ – తెలుగు భాషా ఉత్సవాలు 29-31 ఆగుస్ట్ 2025-శీర్షిక : నా తెలుగు భాష#కవి_పేరు_తుమ్మ జనార్దన్_జ్ఞాన్

  

అచ్చులు హల్లులతో గణపతి పూజ


మ్మ చేతిలో తయారైన 

గణనాధుడు

ప్పుడే బయలుదేరాడు 

రోజే వస్తున్నాడు

మాపుత్రుడికి ఉండ్రాళ్ళు సిద్దంగా ఉంచండి 

రూరా స్వాగతమంటూ...

లుక వాహనమెక్కి 

తెంచినాడు మన ఏకదంతుడు 

కమత్యము నేర్పి ఆదరించ

క్కమారు పిలువాగానే గజకర్ణుడు

ఓ ఓ యంటూ వడివడిగా వచ్చినాడు 

రా మన గణపతిని 

అం బాసుతుడిని భక్తితో

అహ ర్నిశలు  కొలుద్దాం.


మ్మనైన పాయసాలు నీకు కవీశా

ర్జూరం, అరటి, జామ, దానిమ్మ ఫలాలు

ణనాధుని మ్రొక్కి దీవించమంటూ

ఘు మఘుమలాడే పిండివంటలూ

క ఙ్క ణమ్ (కంకణం) కట్టుకొని 

క్రాల రథముపై ఊరేగిస్తూ చతుర్భుజుని

త్రము పట్టి విఘ్నురాజుని 

జం బూ ద్వీపం భారత ఖండం అంతా

ఝం డాలు అలంకరించి దండాలు చేస్తూ 

జ్ఞా నమిమ్మని గణనాయకుడికి మ్రోక్కుదాం

క టకా టకా టకా అడుగులే వేస్తూ 

ఠం ఠం ఠం ఠం డప్పులే మ్రోగ్రగా

మరుక ధ్వానాలతో 

ఢం కా నినాదాలతో తోడ్కోనివద్దాం

గ ణ నాయకునికి వందనాలిడదాం

తం డోప తండాలుగా చేరి 

క థ విందాం గణపతిది

యజూపు మాపైన గణాధ్యక్షా 

నధాన్యాలిమ్మని దూమ్రవర్ణుని

నం దివాహనుడి సుతుని ప్రార్థిద్దాం

త్రిపూజతోడ వక్రతుండుని కొలిచి

లము ప్రతిఫలము ఆశించక సేవించుదము

బం గారు పంటలతో రైతులను గావమని

జనలు చేసి భక్తితోడ 

ము బ్రోవమందాము విఘ్నేశ్వరుడిని

క్షగానముల కీర్తించుదము ద్విముఖుడిని

క్షనజేయుము తక్షణమే మము ముక్తిదాయ

క్షణమైన అక్షర సంపదలిమ్మని లంబోదరుని

రములిమ్మని వేడుదము వరాప్రదుని 

శివర్ణుని శంకర సుతున్ని శాంతినిమ్మని

రతులేమి లేని బ్రతుకునిమ్ము విఘ్నహర్తా

దా సద్భుద్ది నొసగు సిద్ధి వినాయకా 

రిద్రా హరించు మాలోని అరిషడ్వర్గాలను

ళంకములు రాకుండా దీవించు యోగాదిపా

క్ష మించు మా తప్పులను ఆశ్రిత వత్సలా

ఱం పము కోతవంటి రంధి లేకుండ జూడు వికటా.

..మనందరికీ గణపతి అండగా ఉండాలని ఆశీస్సులు 

మెండుగా అందాలని కోరుకుంటూ... 😊💐🎉

వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐🙏


        ✍️ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్) 


***********************************************************


సేవ – తెలుగు భాషా ఉత్సవాలు 29-31 ఆగుస్ట్ 2025

[తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి 

పంతులు జయంతి సందర్భంగా]

కవి పేరు    : తుమ్మ జనార్దన్ (జ్ఞాన్)

--------------------------------------------------- 

శీర్షిక : నా తెలుగు భాష

‘అ’తో మొదలైంది నా తెలుగు భాష 

‘అమ్మ’తో మొదలైంది నా మాతృభాష

నాన్న తో ఎదిగింది నా అమ్మ భాష

గురువుతో పెరిగింది నా అమృత భాష

నా వాక్కులో నిలిచింది నా అమర భాష

నన్ను పెంచి మురిసింది మురిపాల భాష

నన్ను నన్నుగా చూపింది నా ముద్దు భాష

ప్రతి గోరు ముద్దలో ఒదిగిన ప్రేమైక భాష

నన్నుద్ధరించింది నా సుమధుర తెలుగు భాష,


ఎన్ని భాషలు నేర్చిననేమి మాతృభాషకు సాటిరాదు 

భాషలన్నింటిలోనూ తెలుగుకేదీ పోటీకాదు

నా భాష నా యాస తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ

ప్రాంతానికో యాస, జిల్లా జిల్లాకో యాస 

ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా ఒక్కటే నా తెలుగు. 


నా అమ్మ నుడి తెలుగు, గోదారి సుడి తెలుగు

ప్రాణహిత ప్రాణమై, తుంగభద్రకే భవితగా

భీమా ప్రవాహమై, పెన్నా వెన్నెలై  

కృష్ణమ్మ పరుగులా, మంజీరా మమతలా 

సాగుతున్నది చూడు నా సుందర తెలుగు భాష.  


త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య కృతులు,

రామదాసు రచనలు, క్షేత్రయ్య గాత్రం నా తెలుగు

వాక్కులే గేయమై, గేయమే వాక్కుగా అలరారినది 

అద్వైతానుభూతికి ఆధారమైనది నిలిచినది 

సంగీత సాహిత్య సారధి నా తెలుగు భాష .


నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, వేమన, 

శ్రీశ్రీ, శ్రీనాథుడు, గురజాడ, తిరుపతి వేంకట కవులు, 

విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ

రాయప్రోలు సుబ్బారావు, దాశరధీ, సినారె, జాషువా,

ఎందఱో ఇంకెందరో నాటి నేటి మేటి కవులు

నచ్చి, మెచ్చి పోషించిన భాష, నా తెలుగు భాష.


రాయల ఆస్థాన రాణియై ఏలినది

దేశభాషలందు లెస్సగా వెలిగినది

రాతి శాసనమై గతము తెలిపిన భాష

కులవృత్తులకు నాడు కుబుసమైన భాష


తాళపత్రాలలో పదిలమైన భాష

ఉద్యమాలకు శంఖారవమైన భాష

కవి కోకిలల కన్తాభారణమైన భాష

ఉగాది ఉత్సవ ఉత్సాహమీ భాష.


సామాన్యులకు జ్ఞాన రూపమైన భాష

హరికథా, బుర్రకథ కాధారమైన భాష

అనంత సాహిత్య సాగరం నా భాష

దేశభక్తి యుక్తి ముక్తి సాధనం నా భాష.


యోగా అనుబంధంగా, యోగమే ప్రధానంగా 

శబ్దార్థ ప్రభోధంగా, పలుకుల ప్రవాహంగా, 

సుమధుర సంగీతంలా సాగే సెలయేరులా

పద్యం, అవధానం ప్రత్యేకతలతో భాసిల్లు భాష 

అద్భుత కళాకృతుల వ్రాత, ఇది తెలుగువారి తలరాత.


ప్రకృతి ప్రసన్న కృతిలా సాగే సుస్వర సునాదం

జనపదం నుండి జానపదమై, ఎంకి పాటైనదీ

నాట్యవిన్యాసమై, నవరసపోషనై 

గ్రామాలు, నగరాలు, దేశాలు దాటినది 

పేట నుండి అగ్రరాజ్యాలవరకు పీటమేసిన భాష. 


అందుకే నేనంటా, ఏదేశమేగినా ఎందుకాలిడినా 

మరువబోకు తెలుగు మాట, నీ వెలుగు బాట

నీ మాటలో దాగుంది తల్లి తెలుగమ్మ

నీ వారసత్వంగా అందించుమాయమ్మా.


తెలుగుకొచ్చిన తెగులు నీవు కాబోకు

అన్ని భాషలనూ ఆదరించు, మాతృ భాష నీవు మరువబోకు 

నీ భాష నీ యాస నీ తెలుగు, నీ సంస్కృతి

నీ సంస్కృతిని కాపాడి చాటుకో నీ స్వంత వ్యక్తిత్వము. 

-------------------------------------------------------------- 60 లైన్స్

 


No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular