Sunday, July 30, 2023
20. భగవద్ధ్యానమే ధ్యేయం
20. భగవద్ధ్యానమే ధ్యేయం
శిష్యుడు : శ్రీరామకృష్ణ గురుదేవులు ఇంకా సజీవులై
ఉన్నారనే భావిస్తున్నారా స్వామీ?
స్వామి : నీకేం మతిపోయిందా? లేకపోవడం
ఏమిటి? ఆయన ప్రత్యక్షంగా లేకుంటే ఇల్లు వాకిలీ
వదలిపెట్టి మాకీ సన్న్యాసి బ్రతుకు ఎందుకు? ఆయన
ఉన్నారు. హృదయపూర్వకంగా ఆయన్ను ప్రార్థించు.
ఆయనను దర్శించాలని, ఆయన గురించి తెలుసుకోవాలని
వేడుకో. నీ సమస్త సందేహాలు నివృత్తిచేసి తన
నిజస్వరూపాన్ని నీకు చూపుతారు.
శిష్యుడు : అంటే, ఆయన ప్రత్యక్షమై మీకు దర్శనం
ఇస్తారా, స్వామీ?
స్వామి : ఇస్తారు. అదే ఆయన దయ, నా భాగ్యం.
ఆయన దయ అంటూ ఉంటే ఎవరైనా ఆయన్ను
దర్శించుకోవాలని ఉందో, ఎందరికి ఆయనంటే | ఇష్టమో
భగత్సాక్షాత్కారం పొందడమంటే మాటలు కాదు.
శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సామరస్యం
చెంది వికాసం పొందకుంటే, ధర్మం, పారమార్థిక జీవితం
అసంభవం. అందుకు వలసినది శ్రద్ధ, అఖండ శ్రద్ధ,
శ్రద్ధావంతుడవైతేనే భగవద్దర్శన మహాభాగ్యం లభిస్తుంది.
శ్రద్ధ జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.
శ్రద్ధ కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు.
భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా
సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు
నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి.
సంసారం పట్ల వైరాగ్యం జనించనిదే శ్రద్ధాభక్తులు
వికసించవు. వైరాగ్యం కలగాలి, భగవంతునిపై ధ్యాస
నిలవాలి. అహంకారం వర్ణించడమే వైరాగ్యం.
శిష్యుడు : స్వామీ! నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు
నా మనస్సు పరిపరి రీతుల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది.
ఈ చాంచల్యాన్ని అరికట్టడం ఎలా స్వామీ?
స్వామి : ప్రారంభంలో ఆ విధంగానే ఉంటుంది.
గంగానదికి ఆటుపోట్లు ఉన్నట్లే మొదటి దశలో సాధకుని
పారమార్థిక మనోభావాలకూ ఆటుపోట్లు ఉంటాయి. కాని
సాధన కొనసాగిస్తూ ఉంటే క్రమంగా ఇటువంటి
ఒడుదుడుకులు ఎదురవకుండా నిరంతరం మనస్సు
భగవంతుని వైపే పయనిస్తుంది.
కాబట్టి నీ చిత్తచాంచల్యాన్ని అరికట్టడానికి శ్రద్ధతో
ప్రయత్నం చేయాలి. ఆ కిటుకు చెబుతా విను:
ఆసనం మీద కూర్చోగానే ధ్యానం ప్రారంభించవద్దు.
బాహ్య వ్యవహారాల నుండి మనస్సును మరలించి
ఇష్టదేవతా పావన చరణాలపై నిలిపి మానసికంగా
జపధ్యానాలు అనుష్ఠించు. ఇలా కొంతకాలం సాగిస్తే
మనస్సే పరిభ్రమించడం స్వయంగా మానేస్తుంది.
జపమార్గం గమ్యాన్ని చేరడానికి సులువైన విధానం.
నిరంతర జప సాధనతో మనస్సు ప్రశాంతమవుతుంది;
కించిత్తు కూడ చంచలం చెందక నిశ్చలమై భగవద్ధ్యానంలో
లయిస్తుంది. కనుక సక్రమంగా జపం చేయడం, దానితో
పాటు ఇష్టదేవతా ధ్యానం చేస్తూ ఉండమనే నా హితబోధ.
జపధ్యానాల మేళవింపుతో సత్వరమే విజయం
ఒనగూరుతుంది.
అచంచల దీక్షతో సదా సాధనలు కొనసాగించు.
సాధన చేయని రోజు అంటూ ఏదీ ఉండకూడదు. ఇష్టం
ఉన్నా, లేకున్నా ఏమరుపాటులేక ఈ క్రమంతో కనీసం
మూడేళ్ళపాటు సాధన కొనసాగిస్తే, నీలో భగవద్భక్తి
పెంపొందుతుంది. విశేషమైన భగవత్ సాన్నిధ్యమూ
ప్రాప్తిస్తుందని నొక్కివక్కాణిస్తున్నాను. అంతేకాదు, అప్పుడు
నీ మనస్సుకు భగవత్ స్వరూపం తప్ప మరేదీ కనబడదు.
దేనిమీదా ధ్యాసపోదు. అట్టి స్థితిలో సాధకుడు ఆధ్యాత్మిక
జీవితం ఒసగే ఆనందాన్ని చవిచూడ గలుగుతాడు.
భక్తి లేనిదే ఏకాంతవాసం కుదరదు; ఆధ్యాత్మిక
సాధనలు కొనసాగవు. ఏకాంతంలో ఉన్నప్పుడు భ్రమ
ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
అందుకోసమే ఒకే విధానం, ఒకే రకమైన
మనోధోరణులున్న ఇద్దరు కలిసి జీవించాలి. అలాంటప్పుడు
ఉభయులలో ఎవరికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, కాలుజారే
ప్రమాదం తలెత్తినా పరస్పర సహాయ సహకారాలు
అందుతాయి. ఇద్దరే కలిసి ఉండాలి, అంతకంటె
ఎక్కువమంది ఉంటే పర్యవసానం గందరగోళమే. అందరూ
ఒక చోట చేరితే లోకాభిరామాయణంలో దిగవచ్చు. ఆ
వ్యర్థప్రసంగాలు ఉదాత్త ప్రవృత్తుల్ని, ఉన్నత ఆశయాలను
వమ్ముచేయడమేగాక భగవంతుణ్ణి విస్మరింప దారితీస్తాయి.
తీవ్రసాధనలు అనుష్ఠిస్తూ ఉన్నప్పుడు ఆహారాన్ని
కనిష్ఠ పరిమాణానికి తగ్గించాలి. కడుపార భుజిస్తే
జపధ్యానాలు కుదరవు. నీకున్న శక్తిసామర్థ్యాలలో అధిక
భాగం జీర్ణప్రక్రియలోనే వ్యయం కావడమే ఇందుకు
కారణం. మనస్సు కలవరపాటు చెందుతుంది. అందుకే
మితనిద్ర, మితాహారం గురించి భగవద్గీత అంతగా నొక్కి
వక్కాణిస్తున్నది.
"మితిమీరి తినేవాడికి, అమితంగా ఉపవాసాలు
ఆచరించేవాడికి యోగం లభించదు. మితిమీరి నిద్రించే
వాడికి, అర్థంలేని జాగరణ చేసేవాడికి కూడ యోగం
సాధ్యం కాదు.””1
పవిత్రమైన ఈ మఠంలో సాధన నిమిత్తం ఎన్ని
సదుపాయాలు కల్పించబడి ఉన్నవో గమనించు. అన్న
వస్త్రాదుల గురించి మీరెలాంటి తాపత్రయం
చెందనక్కర్లేదు. సర్వమూ సంసిద్ధమే. ఇక్కడే ఉంటూ
జపధ్యానపరాయణుడవై మనస్ఫూర్తిగా సాధనచేస్తూ
***************************************************
1. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః |
న చాతి స్వప్న శీలస్య జాగ్రతోనైవ చార్జున. ॥
- గీత 6.16
*************************************************
జీవితాన్ని గడుపు నాయనా! ఊరకే దేశద్రిమ్మరిలా
జీవించడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు.
ఇటూ అటూ పరిభ్రమిస్తూ ఉన్నంతమాత్రాన
ఋషివో మహాత్ముడవో కాగలననుకొంటున్నావా?
పొరపాటు. ద్రిమ్మరివైనంత మాత్రం చేత ఋషివయ్యేవా?
నిరంతర సాధన లేకుండా పారమార్థిక అనుభూతి
లభించదు. కేవల పటాటోపంతో దేన్నీ సాధించలేవు. ఆ
భగవదేచ్ఛ నీలో ఉండి ధ్యానపరాయణుడవు కావాలి,
భగవత్ చింతనలో సంలీనమైపోవాలి సుమా!
21. సదా నామజపమే శరణ్యం
ఇంద్రియాలకు సంచాలనకర్తయైన మనస్సును
మొట్టమొదట నియంత్రించాలి. ఆ తదుపరి మనస్సు బుద్ధిని
ఆత్మలో లయింప చేయాలి. సాధుసాంగత్యం
నెరపినప్పుడుగాని కామక్రోధాదులు తొలగిపోవు. అవి
వైదొలగినట్లు అనిపించినా, సూక్ష్మరూపంలో ఉండనే
ఉంటాయి. సమాధి స్థితిని పొందినప్పుడే ఆ సూక్ష్మం
కూడ తొలగిపోవడం సంభవిస్తుంది. కనుక బాహ్యస్మృతిలో
ఉన్నప్పుడు సదా మెలకువతో మసలుకోవాలి సుమా!
భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మజ్ఞానం, పరమార్థం
మిథ్య కాదు, యథార్థం. కేవలం జనాన్ని నైతికవర్తనులను
చేయడానికీ, సాంఘికపరమైన కట్టుబాట్ల కోసమూ ఈ
తత్త్వాలు నిర్దేశింపబడలేదు. నిజంగా దేవుడు ఉన్నాడు.
భగవంతుడు నిత్యసత్యస్వరూపుడు. ఆయనను మనం
దర్శించగలం. ఎప్పుడు? మనోనిగ్రహం సంతరించుకొని,
ప్రశాంతచిత్తుడవై సుఖదుఃఖాదులనే ద్వంద్వాలను
సమానదృష్టితో చూడగలిగినప్పుడు. అందుకై వేకువ
జామున, మధ్యాహ్న సమయాన, సంధ్యాసమయాన,
నడిరేయి సమయంలో నియమనిష్ఠలతో ధ్యానం
చేస్తూండాలి. అదే ధ్యానానికి సముచిత వేళలు. ఒక
లక్ష్యం మీద నీ మనస్సును కేంద్రీకరించి, స్థిరచిత్తుడవై
ఎలాంటి పరిస్థితులు తలెత్తినా నిష్ఠగా నీ సాధనలు
అనుష్ఠిస్తూ ఉండాలి.
అనునిత్యం గీతలో ఒక అధ్యాయం పారాయణ
చేయాలి. పనికిమాలిన తలంపులతో, తాపత్రయాలతో
ఆందోళన చెందినప్పుడు గీత పారాయణ చేస్తే శాంతి
చేకూరుతుంది, మనస్సు స్థిమితపడుతుంది. అనుభవ
పూర్వకంగా చెబుతున్న మాట ఇది.
ప్రతి రోజు ఆత్మవిచారణకై కొంత సమయం
వినియోగించు. నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకో:
"ఈ లోకానికి నేనెందుకు వచ్చాను? నేను ఏ
విధంగా జీవితం గడుపుతున్నాను? నిజంగా నాకు
భగవంతునితో అవసరం ఉందా? ఆ భగవంతుని
దివ్యదర్శనానికై నిజంగా ప్రయత్నిస్తున్నానా?” ఇలా ఆత్మ
పరిశీలన చేసుకోవాలి.
ఎందుకంటే మనస్సు మనిషిని మోసం చేస్తూ
ఉంటుంది. మనస్సుకు లోబడి మనిషి జీవించరాదు,
అధీనుడు కారాదు; అందుకు మారుగా తానే దాన్ని
లోబరచుకోవాలి, దానిని తాను శాసించగలగాలి. నువ్వు
సత్యనిష్ఠను విడువరాదు. నీ హృదయం నిర్మలమై ఉండాలి.
నిర్మలత్వం సంతరించుకొనేకొద్దీ నీ మనస్సు భగవంతుని
వైపే మొగ్గుతూ ఉంటుంది. దీన్ని నువ్వు గమనించవచ్చు.
నీ మనస్సు నిన్ను అలవోకగా మోసగించి ఏ రీతిలో
లోబరచుకొంటుందో కూడ నువ్వు గుర్తించగలుగుతావు.
నీ ఇంద్రియాలే నీకు శత్రువులు. అయినా నువ్వు
వాటిని నియంత్రించ గలిగితే, అవి నీకు నేస్తాలవుతాయి.
మరో విధంగా చెప్పాలంటే మనస్సే నీకు శత్రువు,
మిత్రుడూను.'
*************************************************
1. ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥
- గీత 6.5
మానవుడు ఆత్మవలననే (ఆత్మను) తనను ఉద్ధరించుకోవాలి.
కనుక ఆత్మను బలహీన మొనర్చుకోరాదు. ఎందుకంటె ఈ ఆత్మకు
ఆత్మే బంధువు, ఆత్మే శత్రువు.
బన్దురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితం ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥
- గీత 6.6
***************************************************
జపధ్యాన సాధనలలో నిమగ్నుడవవు. మనస్సు
స్థూలమై ఉన్నందున స్థూల విషయాలనే పట్టుకుని
ప్రాకులాడుతూ ఉంటుంది. కాని జపధ్యానాలు అనుష్ఠించిన
కొద్దీ మనస్సు సూక్ష్మమై సూక్ష్మతత్త్వాలను గ్రహించ
గలుగుతుంది.
సాధనలను కొనసాగిస్తూనే ఉండాలి. శారీరక
పరంగా చేసే తపంకూడ కొద్దోగొప్పో మేలే
ఒనగూరుస్తుంది.
అమావాస్య, ఏకాదశి తిథులలో ఒంటిపూట
మాత్రమే భుజించాలి. వ్యర్థప్రసంగాలతో కాలక్షేపం
చేయరాదు. సదా భగవంతుని మదిలో తలచుకోవాలి.
నువ్వు తింటున్నా, కూర్చున్నా, లేచినా, పడుకొన్నా
ఎల్లవేళలా ఏ పనిచేస్తూన్న భగవద్ధ్యానం మానరాదు. ********************************************************
(సవివేకమైన) ఆత్మ యొక్క తోడ్పాటుతో దేహేంద్రియ
సంఘాతాన్ని లోబరచుకొన్న వ్యక్తికి ఈ ఆత్మ బంధువు. కాని
లోబరచుకోని వ్యక్తికి ఈ ఆత్మే శత్రువై (బాహ్య) శత్రువులా వర్తిస్తుంది.
లోకము లన్నియున్ గడియలోన జయించిన వా డవింద్రియా
నీకముఁ జిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుఁజేయు నీ
భీకర శత్రు లార్యురఁబ్రభిన్నులఁ జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లేఁడొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!
- శ్రీమదాంధ్ర భాగవతం, ప్రహ్లాదచరిత్ర - 7.267
**********************************************************
ఈ రీతిగా సాధన చేసినట్లయితే, ధ్యానానికి నువ్వు కూర్చోగానే
నీ మనస్సు నీ ధ్యాస భగవంతునిపై లీనమౌతాయి.
మనస్సు ధ్యానంలో మగ్నం కాగానే నీ హృదయం ఆనంద
సరోవరమైపోతుంది.
వ్యర్ధప్రసంగాలలోను, అనవసర వ్యవహారాలలోను
నీ కాలాన్ని వృథా చేసుకోకు. అక్కరలేని మాటలు నీ
శక్తిసామర్ధ్యాలను దుర్వినియోగపరుస్తాయి. కనుక 'అప్రస్తుత
ప్రసంగాన్ని విడిచిపెట్టు' అని ఉపనిషత్తు' బోధిస్తోంది.
ధ్యానం నిమిత్తమే నీ కాలాన్ని వినియోగించు.
'మనస్సును నాకు అర్పించు. నా భక్తుడవవు, నన్ను
పూజించు, నాకు ప్రణమిల్లు' అని గీతాచార్యుని వాక్కు
“నీ మనోశక్తిని ఎన్నడూ దుర్వినియోగపరచకు”
అనేవారు శ్రీరామకృష్ణులు. నిరంతరం భగవంతుని
స్మరించమని అది హెచ్చరిక.
లౌకికుడు తన ధ్యాసనంతా ధనం మీద పెట్టి అదెక్కడ
ఖర్చయిపోతుందోనని ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. కాని
మనస్సును ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో అతగాడు
గ్రహించడు.
******************************************************
1. ఆత్మాన మన్యోవాచో విముంచథ - ముండకోపనిషత్తు
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు.
- గీత, 9-34
******************************************************
భగవత్సాక్షాత్కారానికి సతతం భగవత్స్మరణ చేయడం
కంటె సులభమైనది, మహత్తరమైనది, అనువైనది మరొక
సాధన లేదు.
అటువంటి సాధనే కుండలినీ శక్తిని మేల్కొల్పుతుంది.
అప్పుడు ఒకదాని వెంట ఒకటిగా మాయావరణాలు
తొలగిపోతాయి. నూతన దృష్టి ఏర్పడుతుంది. ఎంతటి
అపురూప నిధి నీలో దాగుకొని ఉందో అప్పటికి నీకు
తెలుస్తుంది. నీలోని దివ్యత్వం వికసిస్తుంది.
శ్రీరామకృష్ణులను ప్రార్థించు, ఆయన ఇంకా
ఉన్నారు సుమా! మనసారా ప్రార్థిస్తే ఆయనే నీకు
దారిచూపుతారు. 'నేను మీవాణ్ణి, మీరు నా వారు' అంటూ
ఆయనలో నీ మనస్సు లయం చేయి.
సామాన్యంగా మనస్సు నదిలా పల్లం వైపుకే
పయనించడం కద్దు; అంటే అధోగతిపాలవుతుంది. కామినీ
కాంచనాల, పేరుప్రతిష్ఠల కోసం పరుగులు పెడుతూ
ఉంటుంది. ఆ మనోగమనాన్ని మార్చాలి. మనస్సును
ఉన్నత దిశకు మరలించాలి, భగవంతుని కేసి త్రిప్పాలి.
శ్రీరామకృష్ణుల మనస్సు సదాసర్వవేళల ఇంద్రియాతీతమైన
భూమిలో సంచరించేది. విశేషప్రయత్నం మీదగాని ఆయన
మనస్సు సాధారణ బాహ్యజగత్తుకి దిగివచ్చేది కాదు.
జపం, జపం, జపం. ఏ పనిలో ఉన్నప్పటికీ సతతం
జపం చేస్తూనే ఉండాలి. ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా
భగవన్నామమనే చక్రం ఆగక పరిభ్రమిస్తూనే ఉండాలి.
అదే సాధన. దానితోనే సమస్త తాపత్రయాలు అణగిపోతాయి.
భగవన్నామాన్ని ఆశ్రయించి ఎందరు పాపాత్ములు
పావనులయ్యారో, విముక్తులయ్యారో, దివ్యత్వం
సంతరించుకొన్నారో తెలుసు కదా!
కనుక భగవంతునికి, భగవన్నామానికి ఉన్న
మహిమను ప్రగాఢంగా విశ్వసించు. భగవంతునికి
ఉన్నంత శక్తి ఆ నామానికి కూడ ఉన్నదని గ్రహించు.
భక్తుని మనస్సే భగవంతుని నివాసస్థానమని గుర్తించు.
మనస్ఫూర్తిగా భగవంతుని, "దయతో నాకు
శ్రద్ధాభక్తులు అనుగ్రహించు” అని ప్రార్థించు. నీ
మనోవాక్కులు రెండూ ఏకమై ఉండాలి.
సమస్తాన్ని భగవత్స్వరూపంగా గాంచాలి. సకల
జీవరాసుల్లోను పరమాత్మనే చూడగలగాలి. సర్వత్రా ఆ
సర్వేశ్వరుని చూడగలగాలి. 'తృణాదపి సునీచేన' అన్నట్లు
గడ్డిపోచకంటే కూడ వినమ్రత్వం సంతరించుకోవాలి.
భగవత్కథలనే వినాలి. భగవంతుని కీర్తించాలి,
భగవన్నామాన్నే జపించాలి. భగవద్గుణగానాదులు లేని
చోటు నిశ్మశానం వంటిదిగా ఎంచి విడిచిపెట్టాలి.
భగవంతుడు సర్వులకూ ఆప్తుడు, అత్యంతాప్తుడు.
ఆయన నీకెందుకు దర్శనం ఇవ్వడు? నీ హృదయం విప్పి
ఆయన్ను వేడుకో. ఆయనే నీకు సరియైన మార్గం
చూపుతాడు, ఆ దారిలో నిన్ను నడిపిస్తాడు. భగవన్నామం
కంటే, ఆయన ధ్యానం కంటె మనలను పవిత్రులను చేసే
మార్గం మరేది లేదు. భగవంతుడు మనవాడు. సులభంగా
మనకు దర్శనం ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు
ఉన్నాయి.
దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం.
ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు
భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై
స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు.
దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు
ఆనందంతో మురిసిపోతాడు. 1*
*******************************************
*1. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై
యొక్కఁడు నేడుచు నొక్కచోట...
విష్ణుఁడింతియ కాని వేరొండు లేదని
యొత్తిలి నగుచుండు నొక్కచోట...
ఆయన
- శ్రీమద్భాగవతం, ప్రహ్లాదచరిత్ర 7.124
**********************************************
జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు.
అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు,
జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు.
జ్ఞానమార్గం అనుసరించినా, భక్తిమార్గం
అనుసరించినా అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానజ్యోతి, ఆపరంజ్యోతి
వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగుకు ఆవలనున్న
దేమిటో, మరి ఆ పరమాత్మునికే ఎరుక. అది, ఇది అని
ఉన్నదున్నట్లుగా చెప్పగలవారెవరూ!
22. మంత్రోపదేశం ఆవశ్యకమా?
శిష్యుడు : స్వామీ! మంత్రోపదేశం పుచ్చుకోవడం
నిజంగా అవసరమంటారా?
స్వామి : అవసరమే. మంత్రోపదేశం లేక మంత్రదీక్ష
పుచ్చుకోవడం ఆవశ్యకమే. మంత్ర సహాయం ఉన్నప్పుడే
మనస్సును ఇష్టదేవతపై లగ్నం చేయడం
సులభతరమౌతుంది. మంత్ర సహాయం లేనప్పుడు
మనస్సుకు ఏకాగ్రత కుదురదు. అప్పుడు మనస్సు
భగవద్భావం నుండి మరో భావానికి పరుగుపెడుతుంది.
పరిపూర్ణ చిత్త ఏకాగ్రత అలవడనిదే ఆధ్యాత్మిక జీవితంలో
ఏదీ సాధించలేము. కనుక ఈ విషయంలో గురువు
సహాయం ఎంతో అవసరమని గుర్తుంచుకోవాలి.
తన మనస్తత్వానికి అనుగుణంగా ఇష్టదేవతను
ఎంచుకొనే విషయంలో శిష్యునికి గురువు సహాయం
ఉండాలి. అంతేకాదు, అనుకూలమైన మంత్రం
ఉపదేశించాలి.
గురువు మాటపై అచంచల విశ్వాసం నిలిపి శిష్యుడు
అనునిత్యం నియమపూర్వకంగా మంత్రజపం చేస్తూ,
మంత్రార్థాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే అతడికి
మనశ్శాంతి లభిస్తుంది.
బ్రహ్మమార్గం దుర్గమమైనది. మనిషి ఎంతటి
ధీమంతుడైనా, చతురుడైనా కూడ బ్రహ్మజ్ఞానియైన గురువు
చేయూత లభించనిదే పురోగమించలేడు; పైగా పెడదారిన
పడే ప్రమాదం కూడ ఉంది.
జపధ్యానాదుల నిర్ణీత క్రమం
ఆధ్యాత్మిక జీవిత ప్రారంభదశలో జపధ్యానాదుల
నిమిత్తం ఒక నిర్ణీతక్రమాన్ని ఏర్పరచుకోవడం చాలా
మంచిది.
జపధ్యాన పారాయణాదులకు ప్రతిరోజు కొంత
సమయాన్ని కేటాయించడం అవసరం. మనస్సు
సుముఖంగా ఉన్నా, లేకున్నా ఈ నిర్ణీత క్రమాన్ని
యథావిధిగా కొనసాగించడం ఎంతో ముఖ్యం. అప్పుడే
కుదురుగా అభ్యాసం చేయడం సాధ్యమౌతుంది.
బహుశా నీకిప్పుడు ధ్యానం. అంతగా రుచించక
పోవచ్చు, ఆనందదాయకం కాకపోవచ్చు. కాని
అలవాటయ్యాక ధ్యానించకుంటే తోచదు సరికదా, ఏదో
బాధ, లోటు అనిపిస్తుంది. ఆ స్థితికి నువ్వు చేరుకోగలిగితే,
నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తున్నట్లు అది
సూచిస్తుంది. ఆకలి వేసినా, నిద్రపట్టకపోయినా ఎవరికైనా
బాధ, వ్యధ ఉంటుంది కదా! భగవత్ప్రప్తి కలుగలేదే అని,
అదే విధంగా వ్యధ చెందితే, పరితపిస్తే అది నీకెంతో
చేరువవుతుంది. ఆ అమృతమయుని అనుగ్రహం ఆశించి
అమరుడవు కాగోరు నాయనా! అప్పుడు ఇక ఎక్కడున్నా,
ఏం చేస్తూన్నా ఏ బాధా ఉండదు.
పరుసవేదిని తాకించి ఇనుమును బంగారంగా
మార్చివేసిన పిదప ఆ బంగారాన్ని నేలలో పాతిపెట్టినా,
పెట్టెలో ఉంచినా ఒక్కటే; అది చెక్కుచెదరదు. అది
ఎన్నటికీ మెరుగు చెడని మేలిమి బంగారంగానే
ఉండిపోతుంది.
“అద్వైత జ్ఞానాన్ని నీ కొంగున ముడివేసుకొని
స్వేచ్ఛగా తిరుగు” అని చెప్పేవారు శ్రీరామకృష్ణులు. అంటే
భక్తిజ్ఞానాలను సంతరించుకొన్న తరువాత,
బ్రహ్మసాక్షాత్కారం పొందాక నువ్వు ఎలా జీవించినా, ఏం
చేసినా సక్రమంగానే చేస్తావని గురుదేవుల అభిప్రాయం.
ఆ స్థితిని చేరుకొన్న వ్యక్తి ఎన్నటికీ జీవితంలో తప్పటడుగు
వెయ్యడని అంతరార్థం.
పారమార్థిక జీవితానికి ఎన్నో ఆటంకాలు,
అడ్డంకులు. కనుక వాటిని తొలగించమని భగవంతుని
వేడుకోవడం ముఖ్యం. భగవత్కృప నిమిత్తం నువ్వు ఎంతో
తహతహలాడాలి.
మనిషి మనస్సును ఈ జన్మకు, గత జన్మకు
సంబంధించిన పాపపుణ్య వాసనలెన్నో కమ్ముకొని
ఉంటాయి. వాటితో పెనగులాడిన కొద్దీ, అవి మరింత
బలీయమై, బిగుసుకుంటాయి. ఈ జన్మలోనే తన జీవిత
ధ్యేయాన్ని మరువక, విడువక సదా ప్రయత్నిస్తూ సాధన
కొనసాగించగలవాడే ఈ భవసాగరాన్ని దాటి,
తరించగలడని గుర్తుంచుకో.
ప్రతి వ్యక్తిలోను రెండు ప్రవాహాలు పారుతూ
ఉంటాయి. ఒకటి భగవంతుని వైపుగా, రెండవది
సంసారం వైపుగా. వాటిని భావనాస్రవంతులంటారు. ఒక
భావవాహిని నిన్ను త్యాగవైరాగ్య మార్గంలో భగవత్సన్నిధికి
తీసుకుపోతుంది. రెండవది ప్రాపంచిక భోగాల కేసి
లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ రెండింటిలో ఏది
వాంఛనీయమో ఎంచుకోవలసిన బాధ్యత మనదే.
దైవత్వాన్ని నిరూపించుకోవడమా, పశుప్రాయంగా
జీవించడమా? ఎంపిక చేసుకోవాలి.
సాంసారిక విషయాలు మోహ జనకాలు. నిగనిగ
లాడుతూ, కళకళ్ళాడుతూ తమ పైమెరుగులతో మనిషి
ఎదుట గోచరించి, మనస్సును ఆకట్టుకొంటాయి. అప్పుడు
అంతకంటె యోగ్యమైన, మహత్తరమైన ఆనందం ఇచ్చే
విషయం ఏదైనా ఉంటుందా అనే ఆలోచనే
మృగ్యమవుతుంది. ఉత్తమ పురుషార్థం గురించి వినవచ్చు.
అయినా ఏం లాభం? భగవద్దర్శనం గాని, విషయోపభోగ
ఆనందంగాని పొందగలమనే ఆధారం ఏం ఉందని తనలో
తాను మథనపడుతూ ఉంటాడు; మనస్సుతో ఘర్షణ
పడుతూ ఉంటాడు. నేటి సుఖాలను రేపటి ముక్తికోసం
బలిపెట్టడం అతడికి అర్థరహితంగా తోస్తుంది. ఇలా
తలపోసి ఎటూ తేల్చుకోలేక మరింతగా సంసార
దావానలంలో చిక్కుకుంటాడు; తాపత్రయాలతో
కుమిలిపోయి, జవసత్వాలు ఉడిగిపోయి, పడుచుతనపు
బింకం అంతా చప్పగా చల్లారి, నిరాశాహతుడై
మూఢత్వానికి చింతిస్తూ, మనశ్శాంతికోసం అప్పుడు
పరితపించడం మొదలుపెడతాడు. పూర్తిగా బానిసై
పోవడం వల్ల తన స్థితి నానాటికీ దిగజారడమేగాని, తాను
ఆశించిన మనశ్శాంతి లభించదు. ఇక ఆ జన్మ అలా
కడతేరవలసిందే...
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Jo Jo Mukunda - Mrs. Vedavathi Prabhakar http://www.mediafire.com/?5m6jd5ozm62vw http://www.4shared.com/folder/zhdKH1_w/Jo_Jo_Mukunda...
-
కృష్ణం వందే జగద్గురుం | శ్రీ కృష్ణం వందే జగద్గురుం || శ్రీనివాస హరి కృష్ణ కృష్ణ ! శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ | శ్రితజనపాలక కృష్ణ కృష్ణ | శ్రీప...
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
No comments:
Post a Comment