భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం
పుణ్యం పొందే మార్గాలు ఎన్నో! కృత యుగంలో తపస్సు.. త్రేతా యుగంలో యజ్ఞం..ద్వాపరంలో ధర్మాచరణం.. మరి కలియుగంలో ...? స్మరణం.. సంకీర్తనం..నామ భజన ! భక్తి ఉద్యమ సారథులు ఎందరో ఆచరించిన మార్గం ఇది. అదే ఆధ్యాత్మికబాటలో మొదలైనదే భజన ఉద్యమం. శతకోటి హరేరామ నామ జప యజ్ఞంగా పల్లెపల్లెకూ విస్తరిస్తున్నది. 'నగర సంకీర్తన'గా పల్లవిస్తున్నది. రామనామ భజనలో ప్రతి ఊరునూ ఓలలాడిస్తున్నది.
అనగనగా ఓ పల్లె.. తొలి ఏకాదశి.. తొలిపొద్దు పొడవలేదింకా! ఆషాఢ మేఘాలు చిరుజల్లులు కురిపిస్తున్నాయి. రామాలయం సన్నిధికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాళాలు సరిచూసుకుంటున్నారు కొందరు. తప్పెట్లు లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకొందరు. పది నిమిషాలకు భక్తజనమంతా గుమిగూడారు. భక్తిభావంతో ముందుకు కదిలారు. అందరి నోటా ఒకటే మాట..
'హరేరామ హరేరామ రామరామ హరేహరే| హరే
కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||'
ముప్పయి రెండు అక్షరాల మోక్ష మంత్రం ఇది. వారిది పైపై పెదాల కదలిక కాదు! హృదయాంతరాల్లోంచి పెల్లుబికిన మహా మంత్రం! సామూహిక భజన!! తాళానికి తగ్గట్టుగా భజన. భజనకు తగ్గట్టుగా తాళం. అది భక్తి రాగం,
దైవ తాళం. గమకాల గమనాలు తెలియకున్నా.. రుద్ర నమకమంత కమ్మగా సాగే భజన. రామపరివారం తమ వెనకాలే కదులుతుందన్న అనుభూతికి లోనవుతూ తన్మయులై చేసే భజన! ఊరంతా కలియ తిరుగుతూ
'కలౌ తు నామ మాత్రేణ పూజయేత్ భగవాన్ హరిః' సూత్రాన్ని నిజం చేస్తూ సాగిపోయే భజన. సిద్దిపేట
జిల్లా జగదేవప్పూర్ గ్రామం నుంచి మొదలైన 'నగర సంకీర్తనం' ప్రస్తుతం చేర్యాల, మునిగడప, మర్కూకు, ఎర్రవల్లి, రాజపేట, ప్రజ్ఞాపూర్, దామరకుంట, యాదగిరిగుట్ట, చుంచనకోట, బైరాన్పల్లి ఇలా నలభై గ్రామాల్లో కొనసాగుతున్నది. ఈ ఆధ్యాత్మిక భజన యాత్రను 108 గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నారు నిర్వాహకులు.
ఎందుకీ భజన? లోక రక్షకుడైన రాముడి అనుగ్రహం కోసం. భద్రగిరి రామయ్య మనల్ని భద్రంగా చూడాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పుణ్యక్రతువు ఇది. సిద్దిపేట జిల్లా మర్కూకు మండలంలో ఉన్న పాండురంగ ఆశ్రమం వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామి దివ్య సంకల్పమే ఈ భక్తి ఉద్యమం. వందేండ్లకు పూర్వమే
తెలంగాణలో 'రామ నామ' సంకీర్తనకు విశేషప్రచారం కల్పించిన మహనీయుడు ఆయన. వారి పూర్వాశ్రమ కుమారుడు మహాత్మ అప్పాల విశ్వనాథ శర్మ 'భగవత్ సేవా సమాజం' అనే సంస్థను స్థాపించి భగవన్నామ ప్రచారం నిర్వహించారు. వారి అడుగుజాడల్లో ఈ భక్తి ఉద్యమం మళ్లీ పురుడు పోసుకున్నది. లోక కల్యాణార్థం చేపట్టిన
‘శతకోటి హరేరామ నామ జప యజ్ఞం'లో అశేషసంఖ్యలో భక్తులు భాగమవుతున్నారు. ఊరూరూ దాటుకుంటూ, వాడవాడలో ఆగుకుంటూ, మనిషి మనిషినీ కలుపుకొంటూ.. గొంతులన్నీ ఒక్కటై
'తక్కువేమి మనకురాముండొక్కడుండు వరకు' అని ధీమాగా పాడుకుంటూ హరి నామ స్మరణలో
ఓలలాడుతున్నారు.
పక్షం రోజులకు ప్రతి ఏకాదశికీ 'నగర సంకీర్తనం'. దీనికి తోడుగా నిత్యం రామనామ జపం. ఎక్కడి వారు అక్కడే, ఎప్పుడంటే అప్పుడే.. పవిత్రమైన మనసుతో 'హరేరామ.. హరేహరే’ మంత్రాన్ని పఠించడమే! సాయంత్రానికి జప
సంఖ్య వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తారు. ఇప్పటి వరకు జప సంఖ్య 30 కోట్లు పూర్తయింది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, భగవత్ అనుగ్రహంతో వచ్చే ఏడాది పూర్తయ్యేనాటికి శతకోటి నామ స్మరణ పూర్తవుతుందని పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు. 2024 పుష్యమాసంలో ఏడు రోజులపాటు జప హోమం,
పూర్ణాహుతి నిర్వహించాలని సంకల్పించారు. ఈ భజన ఉద్యమంలో అందరూ భాగస్వాములే. రమ్యమైన రామనామాన్ని మనసారా ఆలపిద్దాం. కష్టాలు తీర్చే కృష్ణ మంత్రాన్ని కమనీయంగా పలుకుదాం!
హరేరామ హరేరామ రామరామ హరేహరే ||
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||
... కణ్వస
• అందరి సహకారం
రాముడి కార్యం ఏదైనా ఘనంగానే జరుగుతుంది. 'నగర సంకీర్తనం' కూడా ఇందుకు మినహాయింపు కాదు!
జగదేవ్పూర్ నుంచి ప్రారంభమైన ఈ భక్తిఉద్యమం ఊరూరా విస్తరిస్తున్నది. వందలాది మంది పరోక్షంగా నిత్యం 16 జపమాలల హరేరామ నామస్మరణ చేస్తుండటం విశేషం. గ్రామవాసులు ఎందరో ఈ క్రతువుకు ఇతోధికంగా అండగా
నిలుస్తున్నారు. పాండురంగ ఆశ్రమం నిర్వహిస్తున్న ఈ క్రతువులో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా.
• ఆదరాసుపల్లి శ్రీధర్, జగదేవ్ పూర్
• నాదం - సాదం
దైవనామాన్ని సంకీర్తన చేసిన క్షణం నుంచే దైవానికి మరింత చేరువ
అవుతాం. భజనలో తెలియకుండానే ప్రయత్నం లేకుండానే మనసు భగవం
తుడి వశం అవుతుంది. గంటల తరబడి చేసే సాధనలో మనసును నిలుపు
చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే పాండురంగ ఆశ్రమ
వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామివారు భజన మార్గాన్ని
ఉపదేశించారు. వారి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు విశ్వనాథ శర్మ దానిని
కొనసాగించారు. ఆయన వారసులుగా ఈ భజన ఉద్యమానికి శ్రీకారం
చుట్టాం. 'నాదం- సాదం' నినాదంతో ముందుకుసాగుతున్నాం.
అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189
No comments:
Post a Comment