భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం పుణ్యం పొందే మార్గాలు ఎన్నో! కృత యుగంలో తపస్సు.. త్రేతా యుగంలో యజ్ఞం..ద్వాపరంలో ధర్మాచరణం.. మరి కలియుగంలో ...? స్మరణం.. సంకీర్తనం..నామ భజన ! భక్తి ఉద్యమ సారథులు ఎందరో ఆచరించిన మార్గం ఇది. అదే ఆధ్యాత్మికబాటలో మొదలైనదే భజన ఉద్యమం. శతకోటి హరేరామ నామ జప యజ్ఞంగా పల్లెపల్లెకూ విస్తరిస్తున్నది. 'నగర సంకీర్తన'గా పల్లవిస్తున్నది. రామనామ భజనలో ప్రతి ఊరునూ ఓలలాడిస్తున్నది. అనగనగా ఓ పల్లె.. తొలి ఏకాదశి.. తొలిపొద్దు పొడవలేదింకా! ఆషాఢ మేఘాలు చిరుజల్లులు కురిపిస్తున్నాయి. రామాలయం సన్నిధికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాళాలు సరిచూసుకుంటున్నారు కొందరు. తప్పెట్లు లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకొందరు. పది నిమిషాలకు భక్తజనమంతా గుమిగూడారు. భక్తిభావంతో ముందుకు కదిలారు. అందరి నోటా ఒకటే మాట.. 'హరేరామ హరేరామ రామరామ హరేహరే| హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||' ముప్పయి రెండు అక్షరాల మోక్ష మంత్రం ఇది. వారిది పైపై పెదాల కదలిక కాదు! హృదయాంతరాల్లోంచి పెల్లుబికిన మహా మంత్రం! సామూహిక భజన!! తాళానికి తగ్గట్టుగా భజన. భజనకు తగ్గట్టుగా తాళం. అది భక్తి...