అంతర్యామి-పారాయణం-మహోన్నతం
అంతర్యామి పారాయణం రా మాయణం, భారతం, భాగవతం, భగవద్గీత- ఇలా ఏదో ఒక గ్రంథ భాగాన్ని కొందరు రోజూ పఠిస్తుంటారు. తమ భక్తిశ్రద్ధలు అనుసరించి లేదా పెద్దల సూచన పాటించి వాటిని చదువుతుంటారు. వాటితో పాటు సహస్ర నామాలు, స్తోత్రాలు, చాలీసాలు ఎన్నింటినో పఠిస్తుండటం పరిపాటి. స్త్రీ పురుష భేదాలకు, బాలలు వృద్ధులు అనే తేడాలకు తావు లేకుండా అందరూ కలిసి పారాయణం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దినచర్యలో భాగంగా ఇళ్లలో, ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో నియమ నిష్ఠలతో పఠించడమే వారికి ఆనందదాయకం. ‘ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఏళ్లతరబడి పారాయణ చేస్తే సరిపోతుందా’ అని ప్రశ్నించేవారున్నారు. ఎటువంటి మానవ ప్రయత్నమూ చేయకుండా, అన్నీ దేవుడే చూసుకుంటాడంటూ పఠిస్తూ కూర్చోవడం సరైనదేనా అని వారు అడుగుతుంటారు. పురాణాల్ని పారాయణం చేయడంవల్ల మానసిక శాంతి కలుగుతుందని అనుభవజ్ఞుల మాట. ఆ గ్రంథాల పఠనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. చక్కని భాష వస్తుంది. పౌరాణిక, ఇతిహాస కథలు కంఠస్థమవుతాయి. ఉమ్మడి పారాయణం ఐక్యభావాలకు మూలమవుతుంది. సృష్టిలోని శాశ్వత సత్యాల్ని తరచుగా గుర్తుచేసుకోవడానికి పారాయణ...