క్రోధమును జయించు పద్ధతి.- శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు. పూర్వకాలమున ఒకానొక సాయంసమయమున కృష్ణుడు, బలరాముడు, సాత్యకి ముగ్గురును కలిపి వాహ్యాళికై ఊరుబయటకు వెళ్లిరి. సుందరమైన ఉద్యానవనమును దాటి వారొక భీకరారణ్యమున ప్రవేశించిరి. వారు దానిలో కొంతదూరము పయనమగుటయే తడువుగా సూర్యాస్తమయము కాసాగెను. ప్రకాశము పూర్తిగా అంతరించి నలుదెసలు అంధకారము వ్యాపించెను. అపుడు వారు మువ్వురును గా ... ఢారణ్యములో చిక్కుకొనిపోయిరి. ముందుకు పోవుటకుగాని, వెనుకకు వచ్చుటకుగాని అవకాశము లేకుండెను. అపుడు వారందరు ఆ అరణ్యములోనే ఒకానొకచొట ఆరాత్రియంతయు గడిపివేయుటకు నిశ్చయించుకొనిరి. దట్టమగు అరణ్యమగుటచేతను, భయంకర మృగములు వసించుతావగుట చేతను రాత్రికాలమున ముగ్గురును పరుండి నిదురపోవుట భావ్యము కాదని తలంచి వారిలోవారు ఒక కట్టుబాటు చేసికొనిరి. ఒకొక్కరు కొద్దిసేపు మేలుకొనునట్లును, తక్కిన ఇద్దరు నిదురపోవునట్లును నిర్ణయించుకొనిరి. మేలుకొనుటలో మొట్టమొదటి వంతు సాత్యకికి వచ్చెను. అనగా సాత్యకి మేలుకొనుటయు, కృష్ణబలరాములు నిద్రపోవుటయు సంభవించెను. కృష్ణ బలరాములకు నిద్రాభంగము కలుగకుండు నిమిత్తమై సాత్యకి నలువైపులా తిరిగి ప...