Friday, August 15, 2025

Gazal Gana Vibhavari by #Dattatraya_Jogavajjula

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం -kcr-full-speech-on-15-august-2022#namasthe_telangana15AUG2025

  

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం

 

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం

వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేకాకుండా 1 కోటి 20 లక్షల జెండాలను ప్రభుత్వమే మన తెలంగాణ కార్మికుల చేతులతోనే తయారు చేయించి ఇంటింటికీ ఉచితంగా అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు ప్రతి స్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణశోభితమై మెరిసి మురిసి పోతున్నది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహానీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం మనందరి బాధ్యత. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, ఆదర్శాలనీ, విలువలనీ నేటితరానికి సవివరంగా తెలియజేయాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజుల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సమున్నతంగా నిర్వహిస్తున్నది. ఆగస్టు 8వ తేదీన ఉత్సవాల ఉద్ఘాటనను ఉత్తేజపూరితంగా జరుపుకున్నాం. ఈనెల 22వ తేదీవరకు దేశభక్తిని చాటే అనేక కార్యక్రమాలను రాష్ట్రమంతటా జరుపుకుంటున్నాం.

1857 సిపాయీల తిరుగుబాటు సందర్భంలో వీరోచితంగా పోరాడిన ఝాన్సీలక్ష్మీబాయి మొదలుకొని వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలర్పించి స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు.
స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు.

భారత స్వాతంత్ర్య సముపార్జన కోసం దేశమంతటా జరిగిన పోరాటంలో మన తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను నిర్వహించారు. తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, భారత కోకిల సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైన వారు సాహసోపేతంగా చేసిన పోరాటం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రజల పిలుపు మేరకు హైదరాబాద్ ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్ గా అభివర్ణించారు. అది మనకు గర్వకారణం.
జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నాం.

స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించిన తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించి, నేడు దేశానికే దిక్సూచిగా మారి దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రతీ రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నది. నేడు దేశ నిర్మాణంలో అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్న బలీయమైన ఆర్థికశక్తిగా మన తెలంగాణ రూపొందింది. సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటలపాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది. ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ.

12.01 శాతం ఉత్పత్తిరంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. ఐటి రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ. “తెలంగాణకు హరితహారం” పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందింది. రాష్ట్రం అవతరించిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ. 62 వేల కోట్ల రూపాయలుండగా, 2021 నాటికి 1 లక్షా 84 వేల కోట్ల రూపాయలకు పెంచుకోగలిగాం. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్ర రాబడి మూడు రెట్లు పెరిగింది. నేడు దేశంలోనే బలమైన ఆర్థిక సంపత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.
గత ఏడేండ్లుగా రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయం (ఎస్.ఓ.టి.ఆర్) లో 11.5 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఆషామాషీగానో, అయాచితంగానో ఈ పెరుగుదల రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాటించిన పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ, అడుగడుగునా ప్రదర్శించిన పారదర్శకత, అవినీతిరహిత పరిపాలన వల్లనే రాష్ట్ర ఆదాయ వనరుల్లో అనూహ్యమైన పెరుగుదల సాధ్యమైంది.

2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీ.ఎస్.డి.పి. 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, 2021-22 నాటికి 11 లక్షల 48 వేల 115 కోట్ల రూపాయలకు చేరింది. అంటే గత ఏడేండ్లలో రాష్ట్ర జి.ఎస్.డి.పి 127 శాతం పెరిగింది. అదే సమయంలో దేశ జి.డి.పి 90 శాతం మాత్రమే పెరిగింది. తెలంగాణ వృద్ధి రేటు భారతదేశ వృద్ధిరేటుకంటే 27 శాతం అధికంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల నిదర్శనం. తలసరి ఆదాయం అనేది సగటు మనిషి ఆర్థిక ప్రగతికి సిసలైన గీటురాయి. 2013-14 లో సుమారు 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల 2021-22 నాటికి 2 లక్షల 75 వేల రూపాయలకు పెరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం 1 లక్ష 50 వేల రూపాయలకంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 84 శాతం అధికంగా ఉండటం మనందరం గర్వించాల్సిన విషయం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఇది శుభపరిణామం.

గత ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయం దాని అనుబంధ రంగాల పరిమాణం రెండున్నర రెట్లు పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక రంగం రెండు రెట్లు, సేవా రంగం 2.2 రెట్లు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతంకన్నా రెట్టింపు స్థాయిలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైంది. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందింది.

దీనికి కొనసాగింపుగా నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తున్నాను.

75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వెలుతురు ప్రసరించింది. కానీ, ఆ తర్వాత గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు. దేశంలో దళితవర్గం పట్ల సామాజిక వివక్ష, అణచివేత నేటికీ కొనసాగుతున్నది. ఫలితంగా దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే మిగిలిపోయాయి. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన ‘‘దళితబంధు’’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో దళితబంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. యావత్ దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, వచ్చిన పనిని లబ్దిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ని కూడా ఏర్పాటు చేసింది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టడానికి ఈ నిధి దోహద పడుతుంది.

దళితులు వ్యాపార రంగంలోనూ పైకి ఎదగాలనే సంకల్పంతో, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలలో దళితులకు పదిశాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. గత ఏడాది దళితబంధు పథకం ద్వారా దాదాపు 40 వేల కుటుంబాలకు లబ్ది చేకూరింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున, 1,70,700 కుటుంబాలకు అందివ్వడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది బడ్జెట్లో దళితబంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది. తద్వారా మొత్తం 2 లక్షల కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

కల్యాణలక్ష్మి – షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 లక్షల 24 వేల 684 మంది ఆడపిల్లల పెండ్లిళ్ళకు 1 లక్షా 116 రూపాయల చొప్పున 9 వేల 716 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణదే.
సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ గ్రామీణ ప్రజల జీవిక దెబ్బతినిపోయింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. గ్రామీణ వృత్తులను ప్రోత్సహించడం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గొల్ల – కుర్మల సంక్షేమం కోసం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేస్తున్నది. దీంతో గొల్ల – కుర్మల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. గొర్రెల పెంపకంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నేడు రాష్ట్రంలో గొల్ల-కుర్మలు కలిగి ఉన్న గొర్రెల సంఖ్య 1 కోటి 91 లక్షలు. దీంతో మాంసోత్పత్తి పెరిగి రాష్ట్రంలో పింక్ రెవెల్యూషన్ చోటు చేసుకుంది. మత్స్యకారులకు లబ్ది చేకూర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాల్లో చేప పిల్లలను వదలటంతో బ్లూ రెవల్యూషన్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల 782 కోట్ల మత్స్య సంపద సృష్టించబడింది. గౌడ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం చెట్ల పన్నును బకాయిలతో సహా రద్దు చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించింది. దోభీ ఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. వివిధ వృత్తులకు ప్రేరణనిస్తూ ఆయా వర్గాల వారి ఆదాయం గణనీయంగా పెరిగేందుకు దోహదపడుతున్నది.

స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంలో జాతీయ చేనేత దినోత్సవం నాటి నుండీ నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిన అద్భుతం. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విద్యుత్తు రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైంది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ప్రథమస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది.

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాదిమంది బిడ్డలు ఫ్లోరైడ్ నిండిన నీళ్లుతాగడం వల్ల బొక్కలు వంకరబోయి నరకయాతన పడ్డారు. ఈ బాధల నుంచి విముక్తిని డిమాండ్ చేస్తూ ఉద్యమకాలంలో ‘‘నల్లగొండ నగారా’’ పేరుతో కార్యక్రమం తీసుకొని స్వయంగా నేనే పోరాడాను. నల్లగొండ బిడ్డల దు:ఖాన్ని వివరిస్తూ ‘‘చూడు చూడు నల్లగొండ.. గుండెమీద ఫ్లోరైడు బండ’’ అనే పాటను కూడా రాశాను.
ఒకనాడు గుక్కెడు నీళ్ళ కోసం మైళ్ళు నడిచి పడరాని పాట్లు పడ్డ తెలంగాణ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నది. మిషన్ భగీరథతో 100 శాతం ఆవాసాలకూ మంచినీరందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడింది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయ స్థిరీకరణను సాధించడం ద్వారా తెలంగాణ భారతదేశ వ్యవసాయరంగంలోనే అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించిందని చెప్పడానికి గర్విస్తున్నాను. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చింది. బంకించంద్రుడు వందేమాతర గీతంలో పేర్కొన్న సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలాం.. అన్న భావనను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసి చూపించింది. సమైక్య రాష్ట్రంలో కరువు, కాటకాలతో బీడుపడిన, పాడుబడిన స్థితి నుంచి బయటపడడమే కాకుండా నేడు మన రాష్ట్రం ‘సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణ’ గా ఆవిర్భవించింది. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా, ఏ ముఖ్యమంత్రి కలలోనైనా ఊహించని విధంగా రైతురుణ మాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతుబంధు, రైతుబీమా పథకాలు వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటు ఒకటారెండా అనేక అద్భుతమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చింది. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. 2014-15 లో తెలంగాణ మొత్తం సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల ఎకరాలైతే, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో నెలకొల్పిన ఉత్తేజం వల్ల 2020-21 నాటికి 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది.

75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 57 వేల 880 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చారిత్రాత్మక రైతుబంధు పథకం విశ్వవేదిక మీద సైతం ప్రశంసలందుకున్నది. ఐక్యరాజ్య సమితి రైతుబంధు పథకాన్ని అత్యుత్తమ పథకంగా కొనియాడింది. తెలంగాణ రైతులకు ఎనలేని ధీమా ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా. 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో రైతులతో పాటు వారి కుటుంబాల సంక్షేమాన్ని, భద్రతను సైతం ఆలోచించిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు. దఫ్తర్ కు పోవాల్సిన పనిలేదు. అరగుంట భూమి ఉన్న రైతుకు కూడా 5 లక్షల రూపాయల బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. రైతు మీద పైసా భారం వేయకుండా ప్రీమియం మొత్తం 100 శాతం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. గతంలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులు దరఖాస్తు పట్టుకొని, ఆఫీసుల చుట్టూ తిరిగి కన్నీళ్ళు పెట్టుకున్నా కనికరించిన వారు లేరు. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమాను అమల్లోకి తెచ్చిన తర్వాత మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల వ్యవధిలోనే 5 లక్షల రూపాయల బీమా మొత్తం అందజేయబడుతున్నది. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 84 వేల 945 మంది రైతు కుటుంబాలకు 4 వేల 247 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించింది. మానవీయమైన పరిపాలనకు నిజమైన నిదర్శనంగా నిలిచింది.

తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం 1 కోటికి పైగా ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. సాగునీటి రంగ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత భారీ ఆయకట్టును సృష్టించిడం మునుపెన్నడూ జరగని అద్భుతం. 2014 లో తెలంగాణలో 68 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే, ప్రభుత్వం కల్పించిన వివిధ సౌకర్యాల వల్ల నేడు సుమారు 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతున్నది. పంజాబ్ తర్వాత దేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. 11.6 శాతం వ్యవసాయ వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మన జి.ఎస్.డి.పి లో 18.6 శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతున్నదని సగర్వంగా ప్రకటిస్తున్నాను.

బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమితమైన ప్రాధాన్యతనిచ్చింది. దేశంలో అత్యధికంగా గురుకులాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ. గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన పేదవర్గాల పిల్లలు ఈ గురుకులాల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభా పాటవాలను చాటుకుంటున్నారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు “మన ఊరు – మన బడి” అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది. రాష్ట్రంలో కొత్తగా మహిళా మరియు అటవీ విశ్వ విద్యాలయాలను నెలకొల్పబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీలలోని 5 వేల 111 అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయించింది.

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా మనం గొప్ప పురోగతిని సాధించాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాలుగా తయారయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక సంస్థలు పట్టుబట్టి, జట్టుకట్టి చేసిన ప్రయత్నంతో గ్రామాలు పరిశుభ్రతతో, పచ్చదనంతో, సకల మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయి. నేడు మన పల్లెల్లో తోవకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతున్నాయి. సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నేడు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరును కలిగి ఉంది. డంపుయార్డు, వైకుంఠధామం వంటి చక్కని మౌలిక వసతులు సమకూరాయి. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. మన పల్లెల ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు. పల్లెలను ఇంత అపురూపంగా తీర్చిదిద్దిన సర్పంచులకు, అదే విధంగా పట్టణాల్లోనూ పరిశుభ్రతను, పచ్చదనాన్ని మెరుగుపరిచిన మున్సిపల్ ఛైర్మన్ లకు, అధికారులు అనధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. అటవీ సంపద హరించుకుపోయింది. ఆకుపచ్చదనం కరువైపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ మహా ప్రయత్నం తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రారంభించాం. హరితహారం ద్వారా చేసిన కృషి అద్భుతమైన ఫలితాలను సాధించింది. అడవుల పునరుద్ధరణ నిరంతరం జరుగుతుండటంతో సుందరవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏ మూలన చూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది.
వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. దేశంలో అత్యుత్తమమైన వైద్య సేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉంది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులను సంపూర్ణంగా మెరుగు పరిచింది. ప్రజలకు అవసరమైన అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లోని అన్ని బెడ్స్ నూ ఆక్సిజన్ బెడ్స్ గా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56 వేల ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
హైదరాబాద్ నగరవాసులతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవిధంగా నగరం నలుచెరగులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు అదనంగా మరో 2000 పడకలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో రెండు వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నది.

హైదరాబాద్ నగరంలోని పేదల ఆవాసాలలో నెలకొల్పిన బస్తీ దవాఖానాలు చక్కని సేవలు అందిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలు ఏర్పాటవుతున్నాయి. కెసిఆర్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల అమలు వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో మన రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 2014 లో 30 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 52 శాతానికి పెరిగింది. ప్రసూతి మరణాల రేటు 2014 లో ప్రతి లక్ష ప్రసవాలకు 92 గా ఉండేది. 2021 నాటికి అది 56 కు తగ్గింది. అదేవిధంగా ప్రతి వెయ్యి జననాల్లో శిశు మరణాల రేటు 2014లో 39 గా ఉండేది. 2021 నాటికి అది 21 కి తగ్గింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో మానవీయమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు సైతం ఇక నుంచి ఆసరా పింఛన్ అందజేయబడుతుంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1 లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటున్నాం. ఉద్యోగాలు తెలంగాణ అభ్యర్థులకే 95 శాతం దక్కేవిధంగా లోకల్ కేడర్ వ్యవస్థను రూపొందించుకున్నాం. దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించగలిగాం.

తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతి బింబిస్తూ బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నది. అన్ని మతాలకూ సమాన గౌరవం అందజేస్తున్నది.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఈ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడించింది. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షల సిసి కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్ నుండి వీక్షించవచ్చు. ఈ సెంటర్లో ఏర్పాటైన మల్టీ ఏజన్సీస్ ఆపరేషన్స్ ప్లాట్ ఫాం ద్వారా అన్ని శాఖల ప్రతినిధులు ఒకేసారి కూర్చొని కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించవచ్చు.
ప్రకృతి ఉత్పాతాలు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సెంటర్ సమాచార సమన్వయానికి, సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు అద్భుతంగా ఉపయోగ పడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి.ఎస్. ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన ఫలితాలను సాధించింది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సులభతరంగా అనుమతులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కావటంతో తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడేలతో పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలకు దిగే దుస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కార్మికులకు ఉపాధి పెరిగింది. సుస్థిర ప్రభుత్వం, పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16 లక్షల 50 వేల ఉద్యోగాల కల్పన జరిగింది.

ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ఐటి రంగ ఉద్యోగాల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1 లక్ష 55 వేల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగింది. 2014లో ఐటి ఎగుమతుల విలువ కేవలం రూ. 57,258 కోట్లు మాత్రమే. 2021 సంవత్సరంలో తెలంగాణ ఐ.టి రంగ ఎగుమతుల విలువ లక్షా 83 వేల 569 కోట్లకు చేరుకుందంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం ఐటి రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 శాతం ఉండగా, తెలంగాణ వృద్ధిరేటు 26.14 శాతం. ఇది తెలంగాణ ఐటి రంగంలో సాధించిన గొప్ప ప్రగతికి నిదర్శనం. ఇటీవలనే ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రారంభించిన టి-హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. మన తర్వాత ఫ్రాన్స్ దేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలోనే అతి ఎక్కువ ఆఫీస్ స్పేస్ ను కల్పిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర అప్పుల మొత్తం 2 లక్షల 25 వేల 450 కోట్ల రూపాయలు. 2014 లో తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75 వేల 577 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1 లక్షా 49 వేల 873 కోట్ల రూపాయలు. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది.

జి.ఎస్.డి.పి లో రుణ నిష్పత్తి పరిశీలిస్తే .. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జి.ఎస్.డి.పి లో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర రాష్ర్టాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలి. కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ర్టాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి కొడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నది. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. రాష్ట్రాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితిలో తీసుకొనే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది.

సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ.. ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. India is union of states అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈవిధంగానే రుద్దాలని చూసింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది. రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణా రహిత హింసను ప్రయోగించటమే కాకుండా, వారిని దేశ ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టింది. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.

పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు “ఉచితాలు” అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు.
జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలూ, ప్రాంతాలు, భాషలూ, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయి.

“భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నది. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి రేపాలనీ, శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనీ, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలనీ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మేధావి లోకం, యువకులు, విద్యార్థులు, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడింది. ఈ ఎనిమిదేళ్లుగానే కోలుకొని కడుపునిండా తింటూ, కంటినిండా నిద్ర పోతున్నది. ప్రశాంతంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్నీ విస్మరించకుండా సకలజనులనూ విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాలి. ఈ గురుతర బాధ్యత నేడు ముఖ్యమంత్రిగా నాపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగాజమునా తెహజీబ్ ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని తెలియజేస్తున్నాను.

‘‘ఎచట మనస్సు నిర్భయంగా ఉండగలదో,
ఎచట మనిషి ఆత్మ విశ్వాసంతో తలఎత్తుకు తిరుగగలడో,
ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకమూ ఉండదో,
ఎచట లోకం ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో,
ఎచట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ
కార్యాచరణతో ముందుకు సాగిపోతుందో
అటువంటి స్వేఛ్చాధామమైన భూతల స్వర్గంలో
తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు !’’

అని విశ్వకవి రవీంద్రుడు భగవంతునికి చేసిన ప్రార్థనలోని ఉదాత్త విలువలను మనం మళ్ళీ మళ్ళీ మననం చేసుకుందాం. భారతదేశ సహజీవన సౌభ్రాతృత్వ విలువల పరిరక్షణ కోసం.. మనం మరొక్కసారి ప్రతినబూనుదాం. స్వాతంత్య్ర ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇటీవల జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో 61 పతకాలను సాధించిన భారత క్రీడాకారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. యావత్ తెలంగాణ ప్రజలకు మరోసారి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

జై హింద్ ! జై తెలంగాణ ! !

Wednesday, August 13, 2025

NAMASTHE TELANGANA 14AUG2025

NAMASTHE TELANGANA NEWS CLIPS

PDF LINK: https://drive.google.com/file/d/1tIKp2--PCOvCVJw3L859Kvl1svbiYdsD/view?usp=drive_link https://archive.org/details/kcr_20250814

NAA BAALYAMAA || SRI S PBALASUBRAHMANYAM || KALAGA KRISHNA MOHANA || MOHAN MELODY ||

kalaga’s mohan melody YOUTUBE CHANNEL LINK: https://www.youtube.com/@mohanmelody5874 Lyric : Dr. Voleti Parvateesam Music : Kalaga Krishna Mohan 💢 Sung By : Vineel, Arun Koundinya, Satya Sivakumar Ravuri Madhavi, Himabindu Krishnan, Harini Ivaturi 💢 Orchestra : ------------- Keyboard : N.C.Praveen Flute : Nandula Srinivas Sitar : Rajkumar Santoor : Srinivas [Chennai] Mandolin : Lokesh [Chennai] Violins : [Chennai] Sampath, Imam, Sabastian, Balu, Sastry, Ramana, Vinay, Babji, Gopi, Narasimhan Tabla : Thatikonda Mohan Pads : Sivaram Reddy 💢 Recorded At : Aalaya Studio, Chennai Sound Engineer : Ayyappa PVR Studio, Hyderabad Sound Engineer : S. Nagavaraprakash Voice Mixing : Moksha Studio, Hyderabad Sound Engineer : Raju 💢 Audio Mixing & Mastering : S. Nagavaraprakash 💢 Video Editing : Suman Dadipogu 💢 Creative Visualisation : Kalaga Krishna Mohan 💢 ©2025 : kalaga's mohanmelody ===== LYRIC ===== అమ్మ నుదుటి తిలకంలా వెలుగుతున్న ధరణి తల్లితనం మొలిపించే మమతల మాగాణి సమభావం సంతరించు సౌభాగ్యపు కరణి కీర్తికాంతులొలికించును ఘన భారత జనని అమ్మ నుదుటి తిలకంలా వెలుగుతున్న ధరణి కాశ్మీరం కేరళ మహరాష్ట్రా బెంగాలు విడివిడిగా ఉంటాయా జలనిధిలో తరంగాలు మమేకమని పలుకుతాయి గగనంలో విహంగాలు మనమంతా సోదరులను మధురభావ అభంగాలు కన్నడమొక కస్తూరి తమిళమేమొ నాదఝరి తెలుగు భాష కలకండ హిందీయే ఎదనిండా మాతృకలా భాసించును అమరభాష పాలకుండ పలుకులన్ని మాలికలే ప్రియభారతి మెడనిండా పరిమళాలు వెదజల్లే పూలతోపు యీ నేల సంస్కృతి సంకేతంలా చిరునగవుల విరిబాల సుమదళాలు ఎన్నైనా సురభిళమది ఒక్కటే విశ్వమంత వింటున్నది యీ దేశం ముచ్చటే ### amma nuduti thilakamlaa .. veluguthunna dharaNI thallithanam molipinCHE .. mamathala maagaaNI samabhaavam santharinchu .. soubhaagyapu karaNI keerthikaanthulolikinchunu .. GHAna BHAAratha janani kaasmeeram KEraLA .. maharaashtraa BEngaalu … viDiviDigaa untaayaa .. jalanidhilo tharangaalu … maMEkamai palukuthaayi .. gaganamlo vihangaalu … manamanthaa sodarulanu .. madhurabhaava aBHANgaalu … kannaDAmoka kasthoori .. thamiLAMEmo naadajhari … TElugu bhaasha kalakanDA .. hindeeYE EdaninDAA … maathrukalaa bhaasinchunu .. amara bhaasha paalakunDA … palukulanni maalikaLE .. priyabhaarathi MEDAninDAA … parimaLAAlu vedajaLLE .. poola thopu ee NEla … samskruthi sanKEthamlaa .. chirunagavula viribaala … sumadaLAAlu YEnnainaa .. surabhiLAmadi okkaTE … viswamantha vintunnadi .. ee DEsam muchchaTE …

Saturday, August 9, 2025

NAMASTHE TELANGANA 10AUG2025

#must_watch#videos#everyone#latest_news#yedavalli_sudarshan_reddy

Temples @Upparapalli - దేవాలయాలు - ఉప్పరపల్లి (చెన్నారావుపేట .మం . వరంగల్ )#yedavalli_sudarshan_reddy

 

Links: https://archive.org/details/@sudarshan_reddy330/lists/45/temples---upparapalli

 

దేవాలయాలు - ఉప్పరపల్లి (చెన్నారావుపేట .మం . వరంగల్ )

ఉప్పరపల్లి గ్రామ భక్తులు, గ్రామ పెద్దల మరియు దాతల సహకారము తో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మరియు 

శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం - దాతలు శ్రీ &శ్రీమతి బొబ్బాల మల్లారెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యుల 

సహకారముతో  మరియు గ్రామంలోని భక్తులు - దాతల సహకారముతో    నిర్మించుకొని నిత్య ఆరాధనలు మరియు పండుగలు, పర్వదినములలో  ఆలయ కమిటీ వారు భక్తులకు విశేషమైన సేవలు అందించుచున్నారు ప్రస్తుతము నాగదేవత ఆలయము నిర్మాణ దశలో వున్నది. 

1. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం - ఉప్పరపల్లి 

2. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం - ఉప్పరపల్లి

#yedavalli_sudarshan_reddy


Friday, August 1, 2025

నమస్తే తెలంగాణ….. విద్యార్థి… నీ హక్కులేవీ? సల్వాజి మాధవరావ్ - 93916 73807

 

నమస్తే తెలంగాణ…..

విద్యార్థి… నీ హక్కులేవీ?

సల్వాజి మాధవరావ్  -  93916 73807

తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది.

1969 నాటి తొలి దశ  ఉద్యమం నుంచి 2009లో  మలి దశ ఉద్యమం దాకా……

ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్దులే. కానీ, ఈ రోజు అదే విద్యార్థి లోకం నిర్లక్ష్యం, నిరాశ, నిస్పృహ, నిరుద్యోగం

మధ్య కొట్టుమిట్టాడుతున్నది. 2023 లో నిరుద్యోగులకు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువత భవిష్యత్తును గాలికొదిలేసింది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల చావులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయి. పాముకాట్లు, ఫుడ్ పాయిజన్, నీటి కొరత, 

శానిటైజేషన్ పై నిర్లక్ష్యం గురుకుల విద్యార్థుల జీవితాలను హరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద విద్యార్థుల కుటుంబాలు లక్షల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. గురుకులాల బోధనలో నాణ్యత లోపం కనిపిస్తున్నది. ఒకవైపు జాతీయ స్థాయిలో పోటీ పెరుగుతుంటే, మన విద్యా విధానం మాత్రం పాత పద్ధతుల్లోనే సాగుతూ వెనకబడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండా 

పోయింది. అబద్దపు హామీలతోనే మభ్యపెడుతూ, సమయానుకూలంగా వాగ్దానాలను వాయిదా వేస్తూ వస్తున్నది. ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు అటకెక్కాయి. ఈ నేప థ్యంలో బీఅర్ఎస్వీ విద్యార్థి హక్కుల కోసం పోరాటానికి సిద్ధమైంది.

ఇది కొత్తగా మేలుకోవాల్సిన సమయం. మన భవిష్యత్తు మన చేతు

ల్లోనే ఉంది. విద్యారంగంలో సమర్థవంతమైన మార్పు కోసం,

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల, ఫీజు రీయింబర్స్మెంట్ నిబంధనల సవరణ, రెసిడెన్షియల్ విద్యాలయాల పునరుద్ధరణ, నిరుద్యోగ భృతి

వంటి హామీల అమలు కోసం పోరాటం చేయాలి.

ఓ విద్యార్థి మేలుకో! నీవు నిద్రపోతే, నీ కలలను వేరే వారు

దోచేస్తారు. నీవు మౌనంగా ఉంటే, నీ హక్కులు మట్టిలో కలిసి

పోతాయి. నీవు గళమెత్తితే భవిష్యత్తు మారుతుంది. నీవు |

పోరాటానికి సిద్ధమైతే పాలకులు జవాబుదారీగా మారుతారు.

రాష్ట్రంలో విద్యార్థుల హక్కుల కోసం బీఅర్ఎస్ విద్యార్థి విభాగం

(బీఆర్ఎస్వీ) ముందుకువస్తున్నది. ఒక సంఘటిత విద్యార్థి శక్తిగా

మారాల్సిన అవసరం ఉంది. ఉద్యమాల చరిత్ర కలిగిన తెలంగాణ

భూమిలో మరోసారి విద్యార్థి గళం మార్మోగాలి.

ఓ తెలంగాణ విద్యార్థి! నీ గళాన్ని వినిపించు! నీ న్యాయం కోసం నువ్వే పోరాడాలి! సంకేతాలు స్పష్టంగా ఇవ్వు.

'మా హక్కులు మా చేతుల్లోకి రావాలి' 'మేం చదివితేనే తెలంగాణ వెలుగుతుంది' ఓ విద్యార్థి నీ హక్కులకై మేలుకో!

తెలంగాణ సాధనకు ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఒక

ప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఆందోళనలు.

తెలంగాణ ఏర్పాటుకు వేదికయ్యాయి. 1969లో మొదలైన ఉద్యమం.

నుంచి 2014లో రాష్ట్ర స్థాపన వరకు విద్యార్థి సంఘాలే గొంతెత్తి నిన

దించాయి. అలాంటి పునాది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు

విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం జరుగు

తున్నది. గ్రూప్-1, డీఎస్సీ, టీసీ పీఎస్సీ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో

తెలియని పరిస్థితి. వచ్చినా పరీక్షల రద్దు, అవకతవకల సమస్యలు

ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యలో నాణ్యత

లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లు లేరు. ఫీజు reimbursement ఆలస్యమవుతున్నది. నిరుద్యోగ యువత నిరాశతో 

ఆత్మహత్యలు చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రభావంతో

విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తూ, సామాన్య విద్యార్థికి విద్యను అంద

కుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వీ అవసరం ఎంతో

ఉన్నది. ఈ సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయి.

బీఆర్ఎస్వీ విద్యార్థి వాణిగా మారాలి. ఉద్యమ గళంగా మారాలి.

ఇప్పుడు ఉన్న విద్యార్థి సంఘాలు బలహీనంగా మారిన నేపథ్యంలో

కేవలం జెండా కోసం కాదు, పోరాట విలువల కోసం ఒక శక్తిగా

మారాలి. బీఆర్ఎస్వీ అదీ ఆకాంక్షతో పనిచేయాలి. తెలంగాణ ఆత్మ

గౌరవాన్ని కాపాడే విద్యావ్యవస్థ కోసం పోరాడాలి.

ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచే విధానాలు రాష్ట్రంలో పెరు

గుతున్నాయి. హిందీని ప్రవేశపెట్టాలనుకోవడం, జాతీయ ప్రవేశ పరీ

క్షల్లో స్థానిక విద్యార్థులకు అన్యాయం, కేంద్ర బోర్డుల పెత్తనం నేప

థ్యంలో తెలంగాణ స్ఫూర్తికి అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దే.

ఉద్యమ వేదికగా మారాలి. యూనివర్సిటీ, డిగ్రీ, ఇంటర్ స్థాయిలో

విద్యార్ధి సమస్యలపై చట్టపరంగా పోరాడాలి. క్యాంపస్ లెవెల్ నుంచి

జిల్లాల వరకు స్టూడెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగ నోటి

ఫికేషన్ల కోసం నిరంతరం పోరాడాలి. సామాజిక న్యాయం, బీసీ,

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యా హక్కుల కోసం నిలబడాలి.



NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular