*గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి, పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే 'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజ భరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం. నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు, జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి కదా! అసలేమి లేదు. * *నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం, పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే ల...