"భగవన్నాను స్మరణ శక్తి"
"భగవన్నాను స్మరణ శక్తి"
ముక్తి మార్గంలో పయనించాలని కోరిక వుండీ ఆచరించే
విధానం తెలియక కొందరు సందిగ్ధస్థితిలో వుంటారు.
యజ్ఞాలు, వ్రతాలు, జపాలు, తపాలు వంటి విషయాలు ఆచరించే స్థోమత, అర్థంచేసుకునే శక్తి లేని వారు తాము
భగవంతుని చేరలేమా అని 'చింత పడాల్సిన పనే లేదు.
ఏ రీతిన భగవంతుని ప్రార్ధించారనేది అనవసరం. ఎంతగొప్ప నైవేద్యం విగ్రహం ముందుంచారన్నది పట్టించుకోడు ఆ భగవంతుడు. ఆయన చూపేదల్లా భక్తుని భక్తి మాత్రమే. అటువంటి సామాన్య భక్తులకు ముక్తి ప్రసాదించేందుకే భగవంతుని గుణగణాలను వర్ణించే నామాలను మునిపుంగవులు తయారుచేశారు.
ప్రతి రోజు క్రమం తప్పక భగవంతుని గుణగణాలనను
భక్తితో స్మరిస్తేచాలు. కోరిన కోరికలు తీరుతాయి.
భారతంలో ద్రౌపది తపాలను ఆచరించినట్టు, వ్రతదీక్షలు
చేసినట్టు ఎక్కడా లేదు. కాని ఆమె మనసులో భగవంతుడు
నెలకొనివున్నాడు. అందుకే నిండు సభలో వస్త్రాపహరణం
చేస్తున్నప్పుడు గొంతెత్తి కృష్ణుని పిలవగానే ఆ పరమాత్ముడు
ఆమె మానాన్ని రక్షించేందుకు హుటాహుటిన వస్తాడు. నన్ను ఎటువంటి పరిస్థితిలోనైనా ఆదుకునేవాడు
భగవంతుడే అనే నమ్మకం భక్తునికి ఏర్పడాలి అందుకోసం ఆయన నామస్మరణ చాలు.
* ఉత్తమ పురుష లక్షణం *
మనుషుల మనస్తత్వం వేరు వేరుగా వుంటుంది..
మంచి పనికి ఏమాత్రం సందేహించక తమంతట తాముగా
సహాయం అందించేవారు మొదటి రకం . మరోరకం మనుషుల మనసులో ఇతరులకు సహాయం అందించాలని వుంటుంది. కాని, అవతలి వారు అర్దిస్తేనే కాని వీరు రంగంలోకి దిగరు. తమ చేతిలో శక్తి వుండి కూడా ఇతరులకు అందించేందుకు ముందుకు రానివారు మూడోరకం. అయితే అందరిలోకి అధములు సహాయం చేస్తామని మాట ఇచ్చి అవతలి వారు వచ్చినపుడు వెనక్కి తగ్గేవారు. ఒకసారి మాట ఇచ్చి వెనక్కి తగ్గడమనేది నీచుల లక్షణం. ఎంతటి కష్టాలు పదైనా ఇచ్చినమాటను
నిలబెట్టు కోవడం ఉత్తముల లక్షణం
Comments