అంతర్యామి సంకల్ప సాధన

అంతర్యామి

సంకల్ప సాధన
కార్యసాధనకు ఎన్నో సంకల్పిస్తాం. వాటిలో కొన్ని నెరవేరతాయి. మరికొన్ని కార్యరూపం ధరించవు.నెరవేరని సంకల్పాలు చిరాకు కలిగిస్తాయి. అందువల్ల సంకల్పసిద్ధికి అడుగు ముందుకుపడదు. అటువంటి అనుభవం పలువురికి ఎదురవుతుంటుంది. అసామాన్యులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. సంకల్పించిన కార్యం నెరవేరేవరకు విశ్రమించరు. అపజయాల్ని వారు విజయాలకు సోపానాలుగా మలచుకుంటారు.

అనుకున్న కార్యం మంచిదైనప్పుడే, ఇతరుల తోడ్పాటు లభిస్తుంది. స్వార్థప్రయోజనాల కోసం వెంపర్లాడేవారిని కార్యసాధకులనరు. వారి వల్ల సమాజానికి ఒరిగేదీ ఉండదు. ఆ కార్యజయం లోకానికి కంటకంగా మారే ప్రమాదమూ ఉంది. రామకార్యం సాధించేందుకు ఆంజనేయుడు సంకల్పించాడు. లోకహితమే హనుమ లక్ష్యం. మంచిని పరిరక్షించేందుకు మనుషులతోపాటు అనేక ప్రాణులూ తమ శక్తులు ఒడ్డటాన్ని రామాయణ మహాకావ్యం స్పష్టం చేసింది.

కపివీరుడైన హనుమంతుడి స్వామికార్య సఫలత కోసం, ఎలుగుజాతి జాంబవంతుడు పథకం వేశాడు. దానవ జాతికి చెందిన విభీషణుడు, పర్వత రూపుడైన మైనాకుడు, పక్షిరాజు జటాయువు, సముద్రుడు సహాయం అందించారు. ఓ చిట్టి ఉడుత సైతం తనవంతుగా తోడ్పడింది. రావణ చెర నుంచి త్రిలోక జనని సీతాదేవి విడుదలయ్యేలా ప్రకృతీ తపన పడింది. ఆ లోకపావనిని రామచంద్రుడి చెంతకు చేర్చిన మహత్కార్యంలో ప్రభుహితం, లోకహితం ఇమిడి ఉన్నాయి. అందుకే ముల్లోకాలూ ఆంజనేయుడి సాహస లంకాయాత్రను వేనోళ్ల కీర్తించాయి. అనుకూలత ఉన్నప్పుడు, కార్యసాధన సులభసాధ్యమవుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే, కార్యసాధకుడి శక్తిసామర్థ్యాలు లోకానికి వెల్లడవుతాయి.

అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధానికి రావణుడు ఎలా బలయ్యాడో రామాయణం తెలియజేస్తుంది. హనుమ సంకల్పదీక్ష నిరుపమానం. రాముడి పట్ల స్వామిభక్తి పరాయణతలోనూ హనుమంతుడు మేటి. అవే ఆయనకు సీతాన్వేషణ వంటి ఘనకార్యాలు చేసే శక్తిని ప్రసాదించాయి. రామాయణాన్ని కొత్త కోణంలో చూస్తే, ఎన్నో మహత్వపూర్ణ అంశాలు బోధపడతాయి. శ్రీరాముడి త్యాగశీలత ఎటువంటివారికైనా ప్రేరణ కలిగిస్తుంది. కార్యసాధనకు సంబంధించి హనుమ, సుగ్రీవుడు పెంచి పోషించిన విలువలు సాటిలేనివి. జీవితాల్లో ఎదురయ్యే పలు వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారాల్ని సామాన్యులు ఆ పాత్రల పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు.

రావణవధ వరకు కార్యసాఫల్యం దిశగా రాముడి పయనం ఏ విధంగా సాగిందో రామాయణం విశదపరుస్తుంది. కార్యం సిద్ధించిన విధానమంతటినీ ఆ పవిత్ర గ్రంథ అధ్యయనం ద్వారా యువత తెలుసుకోవాలి. రాముణ్ని పరిపూర్ణ మానవుడిగా దర్శించినప్పుడే, ఆ కథానాయకుడి పాత్ర ప్రత్యేకత అవగతమవుతుంది. ఆయన పరాక్రమం, మితభాషిత్వం, అనుచరుల పట్ల ఆప్యాయత అందరికీ ప్రస్ఫుటమవుతాయి. సీతారాముల ఉదాత్త దాంపత్యం, రామలక్ష్మణుల సోదర అనుబంధం రామాయణ పఠనంతో ఎంతగానో తేటతెల్లమవుతాయి. శత్రువును సమర్థంగా ఎదుర్కొని విజయాన్ని కైవసం చేసుకోవడంలోని ధీరత్వం గురించి, ఆ కావ్యమే లోకానికి మార్గదర్శనం చేస్తుంది.

అబ్దుల్‌ కలామ్‌ జీవితచరిత్ర కార్యసాధకులకు కరదీపిక. కృషి వల్ల ఒక సామాన్యుడు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చో నిరూపించిన గ్రంథమది. శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త, సామాజికవాది, అభ్యుదయ రైతు- ఎవరికైనా కార్యసాధన క్రమంలో ఒడుదొడుకులు, అపజయాలు ఎదురుకావచ్చు. అనుకున్న పనిని ఎప్పటికైనా పూర్తిచేయగలనన్న ప్రగాఢ విశ్వాసమే కార్యసఫలతకు పునాది!

విఖ్యాత శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ తొలిరోజుల్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.నిరాశచెందని తత్వం, అలసట ఎరుగని ఆయన ప్రయత్నమే అనేక ఉపకరణాల సృష్టికి మూలమయ్యాయి. జీవితంలో ఎంత ప్రేరణఉన్నా, ఎంతో స్వేదం చిందిస్తేనే విజ యంవరిస్తుందనడానికి ఆయన జీవితమూ ఓ ఉదాహరణ.కార్యసాధకులవిజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలియువత.జీవితంలోఎదిగే ప్రయ త్నం కొనసాగిస్తే, ప్రతి వ్యక్తీ కాగలడొక విజేత!

- గోపాలుని రఘుపతిరావు

అంతర్యామి



జ్ఞాన సాధన
విద్యార్థులు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుకోవాలని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ పలువురు అభ్యాసకులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఉదయం పూట మనసు నిర్మలంగా ఉంటుంది. చదివే అంశం పూర్తిగా మనసుకు హత్తుకుంటుంది. సూర్యోదయానికి ముందు సమయాల్లో దేవతలు సంచరిస్తారంటాయి పురాణ గాథలు. అందువల్ల, ప్రాతఃకాలంలో మనసుపెట్టి చేసే పనులన్నింటినీ ప్రార్థనతో సమానంగా భావిస్తారు. అలా చేసేవాటికి మెరుగైన ఫలితాలు లభిస్తాయంటారు. ఆ కారణంగానే, సాధకులు బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటారు.
దైనందిన జీవితంలో ఉదయానికి విశిష్టమైన స్థానం ఉంది. దాన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో, ‘ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా’ అని వేచిచూసేవారూ ఎందరో కనిపిస్తుంటారు. రోజుకు ఉదయం, సాయంకాలం ఉన్నట్లే మనసుకూ సుఖదుఃఖాలు ఉంటాయి. మనసుకు రెండు దారులు ఉండటమే దానికి కారణం. అది సరైన మార్గంలో వెళితే, వెలుగు నిండుతుంది. అదే జ్ఞాన సముపార్జన. అలా కాకుండా, మనసు అపసవ్య దిశలో పయనిస్తే చీకటి మిగులుతుంది. అంటే, అజ్ఞానంలో కూరుకుపోవడం!
అంతటా వెలుగు పంచే సూర్యుడు, ఎప్పుడూ అదే చోట ఉంటాడు. అలా అని చీకటి, వెలుగులకు తాను కారణం కాదు. భూ పరిభ్రమణం వల్ల రాత్రింబగళ్లు ఏర్పడుతున్నాయి. సూర్యుడికి భూమి అభిముఖంగా తిరుగుతున్నప్పుడు వెలుతురు వస్తుంది. దానికి వ్యతిరేక దిశలో వెళితే, చీకటి కమ్ముకుంటుంది. అవిశ్రాంతంగా చలించే మనసుకూ అంతే! అది అనుక్షణం ఆత్మజ్యోతి వైపు ప్రణమిల్లి ఉండాలి. అందుకు భిన్నంగా హద్దూపద్దూ లేని ఆలోచనలతో మనసు బయట వూరేగడం దుఃఖహేతువు. అంతులేని కోరికలతో ఆకాశానికి ఎగరడం సరికాదు. ఉన్న జీవితాన్ని యథాతథంగా స్వీకరించేలా ధైర్యసాహసాలు చేయకపోవడం, నెరవేరని కోరికలు తెచ్చే నైరాశ్యం అంతులేనివి. అవన్నీ మనసును అనేక విధాలుగా అతలాకుతలం చేస్తాయి. ఆ దుఃఖసాగరం నుంచి బయటపడేందుకు మనిషి పలురకాలుగా ఆలోచిస్తాడు. ఎలాగైనా ఆనందం పొందడానికి ప్రయత్నిస్తాడు. విముక్తి కోసం పరితపిస్తాడు. అలా మెలమెల్లగా అతడిలో తిరుగు ప్రయాణం ఆరంభమవుతుంది.
‘జీవకోటిలో మనిషి మాత్రమే- బ్రహ్మానందం పొం దాలని, మోక్షప్రాప్తి కలగాలని కోరుకుంటాడు. మిగతా జీవులు కోరుకోవు. ఎందుకు’ అని ఒక శిష్యుడు గురువును అడిగాడు. ఆయన ఇలా బదులిచ్చాడు- ‘మానవేతర జీవులకు మనుగడకు కావాల్సినంత జ్ఞానమే ఉం టుంది. అవి ఆహారం దొరికితేనే ఆకలి తీర్చుకుంటాయి. పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడతాయి. ప్రమాదాలు ఎదురైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి, అక్కడ గూళ్లు కట్టుకుంటాయి. ఆహారమూ సమకూర్చుకుంటాయి. వాటికీ అనుభవాలు, జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని జీవితావసరాలకే ఉపయోగిస్తాయి. ఇతర జీవులతో పోల్చుకోవు. గడచినవాటి గురించి దిగులు పడవు. రేపు ఏమవుతుందోనన్న భయమూ వాటికి ఉండదు. కాబట్టి, వాటికి మానసికంగా దుఃఖం కలిగే అవకాశం లేదు. ఆనందం తాలూకు అవసరమూ వాటికి రాదు. అవి ఉన్న స్థితే వాటికి ఆనందమైనా, ఆ విషయం మాత్రం వాటికి తెలియదు’. గురువు మాటల్లోని పరమార్థాన్ని శిష్యుడు అప్పుడు గ్రహించాడు.
దుఃఖం అనేది మనిషికి మానసికంగా కలిగేది. ఉపశమనం పొందడానికి, దుఃఖమూలాన్ని అతడు వెతికి పట్టుకోవాలి. అది దొరకడం అంటే, సంబంధిత సత్యం తెలియడం! అప్పుడే దుఃఖం తొలగిపోతుంది. సత్యం తెలియడం, దుఃఖం తొలగడం రెండూ వేర్వేరు ప్రక్రియలు కావు. ఆ రెండూ ఒకటే! అది ఉలితో చెక్కిన శిల శిల్పం కావడం వంటిది. శిలను ఉలితో తొలుస్తున్నప్పుడే, లోపలి శిల్పం బయటకు తొంగిచూడటం మొదలవుతుంది. అలాగే చీకటి వెళ్లిపోవడం, సూర్యుడు రావడం ఏకకాలంలో జరుగుతుంటాయి.
కళ్లు తెరిస్తే, బయటి వెలుగు కనిపిస్తుంది. కళ్లు మూస్తే లోపలి అఖండ వెలుగు అనుభూతిలోకి వస్తుంది. కనులు మూసి ధ్యానసాధన చేస్తుంటే, ‘ఆత్మజ్యోతి’ దర్శనమవుతుంది. అది ఉదయంలా మెల్లగా సమీపిస్తుంది.
- మునిమడుగుల రాజారావు

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి