శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు

శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు

శివుడు, దుర్గ.. హిందూ దేవుళ్లు కాదు!
వారంతా అతీంద్రియ శక్తులు..
శివారాధన మతపరమైనది కాదు
హిందుత్వం మతం కాదు!..
హిందువులకు దైవపూజ తప్పనిసరి కాదు
పన్ను మినహాయింపుపై ఐటీ ట్రిబ్యునల్ ఆదేశం

ముంబై, మార్చి 16: శివుడు.. గణపతి.. హనుమంతుడు.. దుర్గాదేవి! వీళ్లంతా ఎవరు!? వీళ్లంతా హిందూ దేవుళ్లు, దేవతలు అని చెప్పేరు కనక!! ఈ మాటంటే ఆదాయ పన్ను శాఖ ట్రిబ్యునల్ ఒప్పుకోదు! వాళ్లు ఏ మతానికీ సంబంధించిన వారు కాదని.. ఈ విశ్వంలోని అతీంద్రియ శక్తులని ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది! వారి ఆలయాలకు విరాళం ఇచ్చినా అది 'మతపరమైన' కార్యక్రమాల కిందకు రాదని స్పష్టం చేసింది. హిందూ దేవుళ్ల ఆరాధన, ఆలయాల నిర్వహణ కోసం పెట్టే ఖర్చును మతపరమైనదిగా భావించలేమని తేల్చి చెప్పింది.

అందువల్ల... ఈ ఖర్చుకు ఆదాయ పన్ను చట్టం ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని నాగపూర్ ఆదాయ పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. అంతేకాదు... "హిందూయిజం అంటే ఒక మతమూ కాదు. వర్గమూ కాదు. అందులో వేర్వేరు వర్గాలున్నాయి. వివిధ రూపాల్లో వేర్వేరు దేవుళ్లను పూజిస్తారు. అసలు.. హిందూ జీవన శైలిని ఆచరించే వ్యక్తి దేవుడిని పూజించడం తప్పనిసరి కాదు'' అని తేల్చి చెప్పింది. నాగపూర్‌లో శివ మందిర్ దేవస్థాన్ పంచ్ కమిటీ సంస్థాన్ అనే ఓ సంస్థ ఉంది.

2008లో ఆ సంస్థ భవన నిర్వహణ, అన్నదానం, ప్రార్థనలు, టైలరింగ్‌లో శిక్షణ, యోగా శిక్షణ, ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు రూ.82,977 ఖర్చు చేసింది. ఈ ఖర్చుకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. అయితే, భవన నిర్వహణ, అన్నదానం, పండుగ ప్రార్థనలు, రోజువారీ ఖర్చులు 'మతపరమైన ఖర్చుల' కిందకు వస్తాయని, వీటికి పన్ను మినహాయింపు ఇవ్వడం కుదరదని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ తెలిపారు. సంస్థాన్ విన్నపాన్ని తోసిపుచ్చారు. సంస్థాన్ మొత్తం ఖర్చులో ఐదు శాతం కంటే అధికంగా మతపరమైన కార్యక్రమాలకు ఖర్చు చేశారని, మతేతర కార్యక్రమాలకు కేవలం రూ.6700 మాత్రమే ఖర్చు చేశారని కమిషనర్ పేర్కొన్నారు.

వీటికి పన్ను మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు. ఆయన ఆదేశాన్ని సవాల్ చేస్తూ సంస్థాన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి, నిర్దిష్ట కులం లేదా నిర్దిష్ట మతం ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థలకు పన్ను మినహాయింపు వర్తించదని ఆదాయ పన్ను చట్టం చెబుతోంది. అయితే, తమ ఆలయం నిర్దిష్టంగా ఒక్క కులం, లేదా మతానికి పరిమితం కాదని సంస్థాన్ వాదించింది. "కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ఎవరైనా మా ఆలయంలోకి రావచ్చు. విగ్రహాలను ఏర్పాటు చేయడం మతపరమైన చర్య కాదు'' అని తెలిపింది. ఈ వాదనలతో ఐటీ ట్రిబ్యునల్ కూడా ఏకీభవించింది.

"శివుడు, హనుమంతుడు, దుర్గాదేవి తదితరులను పూజించడానికి, ఆలయ నిర్వహణకు చేసిన ఖర్చులను మతపరమైనవిగా భావించలేం'' అని తీర్పు చెప్పింది. సాంకేతికంగా చూస్తే... హిందుత్వ అనేది ఒక మతం, ఒక వర్గం కాదని తెలిపింది. "ఇక్కడ 'వర్గం' అంటే, ఒకే చట్టం, ఒకే తరహా నిబంధనలకు లోబడి ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు. వీరందరికీ ఒకే రకమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఇది క్రైస్తవానికి, ఇస్లామ్‌కు వర్తిస్తుంది. కానీ, హిందూయిజానికి వర్తించదు. ఎందుకంటే, సాంకేతికంగా హిందూయిజం మతమూ కాదు. వర్గమూ కాదు'' అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. సంస్థాన్ మతపరమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని చెప్పడానికి ఆధారాలు ఏవీ లేవంటూ కమిషనర్ ఆదేశాలను తోసిపుచ్చింది.
__._,_.___

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి