Friday, May 29, 2020

వివేకానంద వాణి


వివేకానంద వాణి



మన దేశం యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, పాశ్చాత్య ప్రజలకు పంచిపెట్టడానికి, భారత దేశం యొక్క వాస్తవ స్వరూపాన్ని, ప్రపంచానికి వివరించడానికి శ్రీ వివేకానంద స్వామి 1893వ సంవత్సరంలో కన్యాకుమారి దగ్గర ధర్మదీక్ష స్వీకరించి, అమెరికా దేశానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ చికాగో నగరంలో జరిగిన, విశ్వమత మహాసభలో పాల్గొని, అమెరికా అంతటా తిరిగి, ధర్మప్రచారం చేశారు. అది జరిగి ఈ 1993వ సంవత్సరానికి నూరేళ్ళయ్యింది. ఆ ధర్మయాత్ర శతజయంతి సందర్భాన రాజమహేంద్రవరంలోని 'శ్రీరామకృష్ణ మఠం' వారు ఆంధ్ర ప్రజాభ్యుదయాన్ని ఆశించి, వివేకానంద స్వామి వారి బోధనలను ఈ వివేకానంద వాణి రూపంలో, వెలువరిస్తున్నారు.

సోదరులారా!
నేను చెప్పబోయే ఉపదేశాలను మీరు సావధానంగా వినండి. మననం చేసుకోండి. వాటికి కార్యరూపం కల్పించి, చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టండి. పదిమందిలో ప్రచారం చేయండి. నా ఉపదేశాలు సత్ఫలితాలను ఇచ్చాయనీ, లోకమంతటికీ ఋజువు చేయవలసిన బాధ్యత మీది.

ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్యవరాన్‌ నిబోధత!

శ్రీ రామకృష్ణ పరమహంస పేరు వినని వారు  ఎవ్వరూ భారత దేశంలో వుండరు. వారి మహిమ ఖండాంతరాలకు కూడా వ్యాపించింది. నా వాక్కులలో ఏమాత్రం సత్యం వున్నా, ఆధ్యాత్మిక ప్రకాశం వున్నా, అది నా గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసాదమే! దోషాలు మాత్రం నావి.

వర్తమాన ప్రపంచానికి శ్రీ రామకృష్ణులు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా? దేవాలయాలను, మసీదులను, చర్చీలను లక్ష్యపెట్టవద్దు. మత సంప్రదాయాలను, సిద్ధాంతాలను లెక్కచేయవద్దు. ప్రతీ మనిషిలోనూ ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై వుంటుంది. దానిని పెంపొందించుకున్నవాడే శక్తి వంతుడు ధన్యుడు. అన్ని మతాలలోనూ, అన్ని ధర్మాలలోనూ ఎంతో కొంత మంచి వుండక తప్పదు. అందువలన దేనినీ, ఎవ్వరినీ తూలనాడకూడదు.

మతం అంటే సంప్రదాయాలు, సంకీర్తనలు కాదని... మతం అంటే 'ఆత్మ సాక్షాత్కారం' అనీ ఆచరణ రూపంలో ఋజువు చేయండి. అనుభవించగలిగిన వాడే ఆత్మశక్తిని తెలుసుకోగలరు. దానిని సిద్ధింపజేసుకున్నవారే ఇతరులకు బోధించగలరు. అలాంటి వారే మానవజాతికి వెలుగుబాట చూపగల దివ్యజ్యోతులు. ఇదీ వారి సందేశం.

ఇలాంటి మహనీయులు ప్రభవించిన దేశం ఔన్నత్యాన్ని అందుకుంటుంది. లేని దేశాలు అథః పతితం అవుతాయి. అందుకే 'ఆత్మసాక్షాత్కారం చేసికో!' అని మా గురువుల ఆదేశం. నీతోటి వారికోసం త్యాగం చేయమనీ, వట్టి మాటలతో కాక, చేతలతో ఆ ఆదర్శాన్ని నిరూపించమనీ వారి ఉద్బోధ. ఆ స్థితిని చేరుకున్నవారికి, ప్రపంచ మతాలన్నిటి మధ్య సామరస్యమే కానీ, వైరస్యం లేదనే నిజం బోధ పడుతుంది. మానవజాతి సముద్ధరణకు ఆ పరిజ్ఞానమే మార్గం. తక్కిన మత బోధకులందరూ, తమ తమ పేరులతో కొత్త కొత్త మతాలను సృష్టించుకున్నారు. కానీ, శ్రీ రామకృష్ణ పరమహంస ఆ పని చేయలేదు. అన్ని మతాల మధ్య అంతర్గతంగా వుండే సమైక్యభావాన్ని విశదీకరించడమే వారి ఆశయం. నేటి మతాలన్నీ ఒకే ఒక సత్యమైన, నిత్యమైన మూలమతంలో అంతర్భాగాలే అన్నది వారి సందేశం.

భగవంతుడు ఎక్కడో వున్నాడని వెతుకులాడడం వెర్రితనం. ఆలయాలలో, మందిరాలలో దేవులాడడం అజ్ఞానం. ఆ దేవుడు నిజానికి నీలోనే వున్నాడు. తెలుసుకోగలిగితే నీవే ఆ భగవంతుడివి! ప్రకృతి నీపై కప్పిన సన్నటి ముసుగును మంచి తలపులతో, మంచి చేతలతో తొలగించుకుని, నిన్ను నీవు దర్శించుకో! భగవంతుడు ప్రతి వ్యక్తిలోనూ వున్నాడని అప్పుడు మీకే అర్థమౌతుంది. భగవంతుడిని సేవించడం అంటే, ఆ భగవంతుడి బిడ్డల్ని, భగవత్ స్వరూపులైన నీ తోటివారిని సేవించటమే అనీ, అప్పుడు నీవే గ్రహించగలుగుతావు. భగవంతుడిని పూజించటానికి ఎన్నెన్నో రూపాల్నీ, ప్రతిమల్నీ సృష్టించుకునే నీవు, సజీవ మానవ రూపంలో వున్న భగవదంశను గుర్తించ లేకపోతున్నావు. గుళ్ళు, గోపురాలలో కాదు, మావన దేహంలో వున్న భగవంతుడ్ని దర్శించు. నీ తోటి మనిషే నీ ఆరాధ్య దైవం.

విగ్రహ రూపంలో భగవంతుడ్ని పూజించేవాడు అల్పజ్ఞాని. దరిద్రులలో, దుర్భరులలో, బాధితులలో భగవంతుడిని సేవించేవాడు మహాజ్ఞాని. అంతేకాదు అందరిలోనూ, అన్నిటిలోనూ భగవంతుడిని చూడగలిగిన నాడు, నీవు దేనిని త్యజించనక్కరలేదు. సన్యాసివై అడవులపాలు కానక్కరలేదు. అయినవారిలో, తోటివారిలో, సర్వజీవరాశిలో, సర్వసృష్టిలో, సుఖంలో, దుఃఖంలో, జననంలో, మరణంలో... సర్వత్రా నువ్వు భగవంతుడిని చూడగలుగుతావు. ఇదే మన వేదాంత సారం. హిందూమత సారం.
         
          మన పురాణాలు, శాస్త్రాలు, చరిత్ర, సాహిత్యం... అన్నీ ప్రజల్ని భయపెడుతున్నాయి. "నీవు నరకానికి పోతావు, నరకానికి పోతావు" - అని ఘోష పెడుతున్నాయి. దాని వల్లనే ఈ జాతికి నరనరానా అలసత్వము, నిర్లక్ష్యము పేరుకు పోయాయి. ఇక మనం ఈ వైఖరిని మార్చుకోవాలి. వేద వేదాంత సారమేమిటో, సరళమైన భాషలో ప్రజలకి తెలియజెప్పాలి. చదువు, నీతి, సత్ప్రవర్తన సంతరించుకుని... ఛండాలుడు కూడా యథార్థ బ్రాహ్మణునిగా రూపొందటానికి అవకాశం కల్పించాలి. పిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను ఆ మార్గంలో ఉత్తేజ పరచాలి. శారీరకంగాను, మానసికంగాను ఈ జాతి శక్తి వంతం కావడానికి కృషి చేయాలి.
          మరొక్క విషయం కూడా గుర్తుంచుకోండి. పాశ్చాత్యుల భౌతిక బలం, హిందువుల ఆధ్యా్త్మిక బలం ఈ రెండిటి సమ్మేళనంతో ఏర్పడే ఆదర్శ సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి యత్నించాలి. బాహ్య ప్రకృతిని జయించే శక్తిని పాశ్చాత్యుల నుండి భారతీయులు, అంతః ప్రకృతిని జయించే శక్తిని భారతీయుల నుండీ పాశ్చాత్యులు నేర్చుకోవాలి. అప్పుడే అంతర్గత బహిర్గత శక్తుల్ని జయించగల్గిన ఏకైక, ఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది.
          మిత్రులారా! స్థిమితంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించండి! అంతరంగంలోనికి దృష్టి సారించండి. మన బ్రతుకులకి ప్రయోజనమేమి? మన జీవితాలకు పరమార్థం వుందా? అల్పము, దీనము అయిన ఈ నర జీవితాన్ని వ్యర్థంగా గడిపివేయడమేనా? అని ప్రశ్నించుకోండి.
          ఒక ఉత్తమ ఆదార్శాన్ని పెట్టుకుని, దాని కోసం జీవితాన్ని అర్పించటం నిజమైన ఘనకార్యం. అదే బ్రతుకులకు చరితార్థం. భారతదేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తి నిర్వహించవలసిన కర్తవ్యం అదే! ఇంతకాలం మనం సోకమయిమైన జీవితాలను గడిపాము. ఇక దుఃఖించి ప్రయోజనము లేదు. లేచి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పురుషులం అనిపించుకోవాలి. మనల్ని పురుషుల్ని చేసే విద్యలు, సిద్ధాంతాలే మనకు ఇప్పుడు అవసరం.
          శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని దుర్బలుల్ని చేసే ఏ విద్యనైనా సరే నిర్దాక్షిణ్యంగా, విషప్రాయంగా తోసి పుచ్చాలి. భయరాహిత్యమే మోక్షమార్గమన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈనాడు మనకు కావలసింది బలం. కండ బలం, బుద్ధి బలం, ఆత్మ బలం - ఇవి మూడూ కావాలి. ఇనుప నాడులు, ఉక్కు కండరాలు కావాలి.
          క్లైబ్యం మాస్మగమః పార్థ, నైతత్వై యుపపద్యతే
          క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా, ఉత్తిష్ఠ పరంతపా!
అన్న గీతా వాక్యాన్ని గుర్తుంచుకోండి.
----
          ఎవరు ఏ ఘనకార్యాన్ని సాధించాలన్నా, మూడు విషయాలు ముఖ్యం. అందులో మొదటిది భూతదయ. అనగా సానుభూతి. అనగా ప్రేమ. 'ఆత్మవత్‌ సర్వభూతాని' అని ఉపనిషద్వాక్యం. జగద్రహస్యాలన్నిటికీ ప్రేమే సింహద్వారం వంటిది. దానికి దుస్సాధ్యమూ లేదు, పరాజయమూ లేదు. అందుకే ముందుగా మనం పరుల పట్ల సానుభూతిని అలవరచుకోవాలి. లక్షల కొలదీ జనం పశుప్రాయులుగా జీవిస్తున్నారే అని దుఃఖించాలి. లక్షల కొలదీ ప్రజలు తిండికి లేక మలమల మాడి పోతున్నారే అని పరితపించాలి. అది మొదటిది.
          ఇక రెండవది. సంకల్ప శక్తి. పర్వతాల వంటి ఆటంకాలు ఎదురైనా, వాటిని దాటి వెళ్ళగలగాలి. ఆ ప్రయాణంలో సకల ప్రపంచమూ మిమ్మల్ని ఎదిరించవచ్చు. అయినవారే విరోధులు కావచ్చు. సకలైశ్వర్యాలు సమసిపోవచ్చు. అయినా సరే, జంక కుండా ధర్మాన్నే అంటిపెట్టుకుని నిలబడగలగాలి. దానినే స్థిర చిత్తం అంటారు.
          మూడవది త్యాగ శక్తి. ఈ మూడూ మీలో వుంటే, మీరు సాధించలేనిది లేదు. మీరు ఏ పర్వత గుహలలో నివశించినా, మీ సంకల్పాలు రాతి గోడల్ని భేదించుకుని, శతాబ్దాల కాల *ఎవరికల్ని ఛేదించుకుని, లోకమంతటా స్పందిస్తాయి. అందరి మనసులను ప్రభావితం చేస్తాయి.
          సీతా మహాసాధ్వి జన్మించిన ఈ భారతావనిలో స్త్రీ కి వున్న ప్రాశస్థ్యం మరి ఏ దేశంలోనూ లేదని నా నమ్మకం. మన *వేదోక్త ధర్మాలు, విధులు ఇతరులందరికీ ఆదర్శప్రాయమైనవని నా అభిప్రాయం. అయితే ఈనాడు భారతీయ స్త్రీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటున్న యథార్థాన్ని మాత్రం కాదనలేం. కానీ, విద్య ద్వారా పరిష్కరించుకోలేని సమస్య వాటిలో ఒక్కటి కూడా లేదని నేను చెప్పగలను. విద్య అంటే ఏమిటి? చిలుక పలుకులు వల్లించేది విద్య కాదు. బుద్ధి బలాన్ని, ధర్మ చింతనను పెంపొందించేది విద్య. ఆ విద్యకు మతం ప్రాతిపదిక కావాలి. ఆ విధమైన శిక్షణలో పెరిగిన స్త్రీలు ఈనాడు దేశానికి అవసరం. సంఘమిత్ర, లీల, అహల్యాబాయి, మీరాబాయి మొదలైన స్త్రీ రత్నాల అడుగుజాడల్లో నడవగలిగిన నిర్భయులు అవసరం. స్త్రీల మాతలు, ధర్మమూర్తులూ అవసరం. కానీ, మన సమాజంలో స్త్రీ ని మనం ఏ విధంగా చూస్తున్నాము? వారికి ఎటువంటి స్థానాన్ని కల్పించాము? స్మృతులు, శాస్త్రాలు సృష్టించి, కఠోర నియమాలను విధించి, వారిని కేవలం బిడ్డల్ని కనే యంత్రాలుగా తయారు చేశాము. జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీల పట్ల మనం అవలంబించవలసిన వైఖరి ఇదేనా?
          స్త్రీ.... మాయా రూపిణీ అనీ, స్త్రీలు జ్ఞానార్జనకు అర్హులు కారనీ కొందరు వాదిస్తారు. అలా అనీ ఏ ధర్మశాస్త్రంలో వుందో, వారిని చెప్పమనండి? పురోహిత బ్రాహ్మణ వర్గం తమ ఆధిక్యత నిలుపుకోవటం కోసం, వేదాలు చదివే అధికారం ఇతర కులాలకు లేదు అని నిషేధించి, వారితో పాటు స్త్రీలను కూడా వెలిపెట్టారు. అంతేకానీ, అది శాస్త్ర విహితమూ కాదు, ధర్మ సమ్మతమూ కాదు. మైత్రేయీ, గార్గీ మొదలైన స్త్రీలు ఇతర ఋషులతో పాటు సరిబంతిలో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు జరిపినట్లు మన వేదాలే చెబుతున్నాయి కదా! ఆనాడు స్త్రీలకున్న ఉన్నత స్థానం, విద్యార్హత ఈనాడు ఎందుకు వుండకూడదు? అసలు స్త్రీని గౌరవించనీ, గౌరవించలేని ఏ దేశమూ చరిత్రలో బాగుపడలేదు, ఇక ముందు కూడా బాగుపడదు. మన దేశం ఇలా పతనం కావడానికి కూడా కారణం అదే! "స్త్రీలు పూజింపబడే తావు, దేవతలకు ప్రీతి పాత్రమైనది" - అని మనుస్మృతి చెబుతున్నది. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండనొల్లదు' - అనే నానుడి కూడా మీరు వినే వుంటారు. అసలు స్త్రీ స్వరూపిణీ అయిన పరాశక్తి దయలేనిదే, త్రిమూర్తుల కూడా ఏ పని చేయడానికైనా అశక్తులు. 
          "శైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే!" - అటువంటి జగన్మాత అంశలో అవతరించిన వారు స్త్రీలు. వారిని పూజించుకోవడం మన ధర్మం.
----
          ఆత్మ విశ్వాసం కోల్పోయిన వ్యక్తి కానీ, జాతి కానీ పతనం కాక తప్పదు. భగవంతునిలో నమ్మకం లేని వాణ్ణి నాస్తికుడు అని అంటారు. కానీ, నా దృష్టిలో తనలో తనకు నమ్మకం లేనివాడే అంటే, ఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు. ఉపనిషత్తులు పదే పదే చెప్పే మాట ఒక్కటే! అభయ్‌! నిర్భయుడవు కమ్ము! అని. 
          ఇతరులకు ఉపకారం చేయడమే మన ధర్మం. ప్రపంచానికి మేలుచేయడమే మన కర్తవ్యం. పాప పుణ్యాలు అనేవి, మన మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి వుంటాయి. ఉదాహరణకు నిప్పు తీసుకోండి. అది మంచిదా? చెడ్డదా? చలికాచుకున్నప్పుడు మంచిదనుకుంటాము, చెయ్యి కాలినప్పుడు చెడ్డదనుకుంటాము. అలాగే ప్రపంచంలో మంచి చెడులు స్వతః సిద్ధాలు కావు. మన స్వభావాన్ని బట్టి, మన ఆలోచనలు, చేతలను బట్టి ఏర్పడతాయి. ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు కూడా 'మనము వాళ్ళను ఉద్ధరిస్తున్నాము' అనే భావంతో చేయకూడదు. నిజానికి ఇతరులకు మేలు చేయడం ద్వారా మనకి మనమే మేలు చేసుకుంటున్నాము. ఒక సత్కార్యం యొక్క ఫలితాన్ని పొందేది ఇచ్చేవాడే కానీ, పుచ్చుకునే వాడు కాదు.
          సూర్యుడు సముద్ర జలాన్ని ఆవిరి రూపంలో స్వీకరించి, తిరిగి వర్షరూపంలో ఇచ్చివేస్తున్నట్లుగా మనం చేసే మంచి పనులు, మనల్ని సర్వదా కాపాడుతాయి.
---
           విద్య యొక్క ఏకైక లక్ష్యం వ్యక్తి నిర్మాణం. మనిషిలో అంతర్గతంగా వున్న పరిపూర్ణత్వాన్ని వెలుపలకు తెచ్చే సాధనమే విద్య. అదే నిజమైన శిక్షణ. జ్ఞానం లేక ఎఱుక లేక తెలివి అనేది మనిషికి పుట్టుకతోనే వచ్చే శక్తి. అయితే అది అతని లోపల అణిగి వుంటుంది. అంతర్గతంగా వున్న జ్ఞానాన్ని, బహిర్గతం చేసుకోవడానికి ఉపకరించేది విద్య. చిన్న విత్తులోనుంచి పుట్టిన మర్రిచెట్టు మహావృక్షం అయినట్లుగా, మనిషిలో నిక్షిప్తమై వున్న జ్ఞానము గురు మూలంగా పెరిగి, పెద్దదై విశ్వాన్నే ఆవరిస్తుంది.   
---
          పేద ప్రజలు దేశానికి వెన్నెముక వంటి వారు. ఎండనకా, వాననకా నిరంతరమూ కష్టించి, ఆహారాన్ని పండించి, అందరినీ పోషించే ఆ కష్ట జీవులు లేకపోతే దేశమే లేదు. వారు ఒక్కరోజు పనిచేయడం మానివేస్తే, పెద్ద పెద్ద పట్టణాలలో, నగరాలలో జన జీవనం స్తంభించి పోతుంది. అలాంటి వారికి మనం ఏం చేయగలుగుతున్నాము? వారి దౌర్భాగ్యాన్ని మార్చడానికి లేశమైనా ప్రయత్నిస్తున్నామా? వారికి కూడూ గుడ్డా సమకూర్చగలుగుతున్నామా? పైపెచ్చు లోకంపోకడలు తెలియని కొందరు అమాయకులను, పగలూ రాత్రీ ఒళ్ళు విరుచుకున్నా, పట్టెడు అన్నానికి నోచుకోని నిర్భాగ్యులను... 'నన్ను ముట్టుకోకు, నన్ను ముట్టుకోకు' అని తరిమి కొడుతున్నాము. అస్పృశ్యులని పేరు పెట్టి వెలివేస్తున్నాము. ఇది ఎంత అమానుషమో ఆలోచించారా? ఈ దురాచారాన్ని తుడిచిపెట్టాలి. ఈ అస్పృశ్యతా బంధాల్ని తెంచి వెయ్యాలి. ఆ దయనీయ దీన జనావళిని శ్రీ రామకృష్ణుని పేరు చెప్పి, చేరదీసి మన సోదరులుగా స్వీకరించాలి. వారి కళ్ళు తెరిపించి, చైతన్యవంతుల్ని చేయాలి. దేహాలు వేరు కానీ, వారిలోనూ మనలోనూ వున్న ఆత్మ ఒక్కటే!

శరీరంలో ఒక్క అవయవం దెబ్బతిన్నా, మిగితా అవయవాలన్నీ కుంటుబడుతాయి. ఈ సత్యాన్ని అగ్ర వర్ణాలు గ్రహించక పోబట్టే దేశంలో పలు ప్రాంతాలలో, ఈ అస్పృశ్యులు అనబడేవారు క్రైస్తవ మతం స్వీకరిస్తున్నారు. వారందుకు పాల్పడుతున్నది ఆకలి మంట చల్లార్చుకోవడానికి కాదు. అగ్రవర్ణ హిందువుల కర్కశత్వాన్ని భరించలేక. కనుక ఈ దీన జన సముద్ధరణ జరిగితేనే గానీ, జగన్మాత ప్రసన్నురాలు కాదూ అనీ, ప్రతి ఒక్కరూ విస్పష్టంగా గ్రహించాలి. జీవారాధనే శివారాధన! ఈ పవిత్ర సత్యాన్ని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకోగలిగితే, మీరూ మీ జీవితాలూ ధన్యమౌతాయి.

-----------

ఆది శంకరుల దృష్టిలో జ్ఞానము - కర్మము పరస్పర విరోధ ప్రవృత్తులని కొందరు భావిస్తారు. అది పూర్తిగా నిజంగా కాదు. జ్ఞానమే మోక్షానికి స్వతంత్రమైన సాధనమని, జ్ఞాన సిద్ధి కలిగిన వానికి కర్మతో నిమిత్తం లేదని - శంకరులు చెప్పిన మాట యథార్థమే! అయితే, కర్మానుష్ఠానము వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుందని, అంతఃకరణ శుద్ధి లేనిదే, జ్ఞాన సిద్ధి కలగదనీ, ఆ విధంగా కర్మ.... జ్ఞానోత్పత్తికి కారణమౌతుందని కూడా శంకరులు అంగీకరించారు. కనుక సూక్ష్మ దృష్టితో చూస్తే, జ్ఞాన కర్మముల మధ్య వైరుధ్యము లేదు.
జీవన్ముక్తులైన కొద్దిమంది మానవుల సంగతి వదిలివేస్తే, సాధారణ మానవులెవ్వరూ 'కర్మ' అనగా పని చేయకుండా ఉండలేరు. మనిషిది కర్మ స్వభావం. అది ప్రకృతి సిద్ధమైనది. కనుక సత్కర్మలని ఆచరిస్తూ, జ్ఞానోదయానికి మార్గం సుగమం చేసుకోవడం వివేకుల లక్షణం. కేవలం వేదాంత గ్రంథాలు పఠించినంత మాత్రాన ప్రయోజనమేమిటి? విశుద్ధమైన అద్వైత తత్త్వాన్ని, మన జీవితాలలో ఆకళింపు చేసుకోవాలి. దాని మహత్వాన్ని నిరూపించాలి. ఆది శంకరులు తన అద్వైత తత్త్వాన్ని అడవులలో, కొండలలో విడిచి వెళ్ళారు. దానిని అక్కడి నుండి తరలించి, జనమధ్యంలో ప్రతిష్ఠించి, ప్రచారం చేయడానికే నేను వచ్చాను. ఆ అద్వైత గర్జన ప్రతీ వ్యక్తి హృదయంలోనూ ప్రతి ధ్వనించాలి. ఆ మహాకార్యంలో మీరందరూ నాకు తోడుపడండి. భాగస్వాములు కండీ!
-----
ఏ ఉద్యమం చేపట్టాలన్నా, ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎంతో కాలంగా మన హృదయాలలో ఓర్వ లేని తనం గాఢంగా నాటుకు పోయింది. ఒకరిని చూస్తే, ఒకరికి అసూయ. ఆధిక్యం అనేది అతనికే ఎందుకుండాలి? నాకెందుకు వుండకూడదు? అన్న ఈర్ష్య! ఇది చాలా క్షుద్ర భావం. దీనిని ముందుగా మనం వదిలించుకోవాలి. ప్రతీ వ్యక్తీ నాయకత్వం వహించాలి అనుకునేవారే కానీ, విధేయులుగా నడుచుకుంటూ సహకరించడానికి సిద్ధపడేవాడు అరుదు.
పూర్వకాలంలో ఈ 'విధేయత'ను నేర్పడానికే, బ్రహ్మచర్య ధర్మం వుండేది. అది ఇప్పుడు కనిపించదు.

మిత్రులారా!
మొట్టమొదట విధేయత నేర్చుకోండి. నాయకత్వం దానంతట అదే వస్తుంది. మొట్టమొదట సేవకులుగా వుండటం నేర్చుకోండి, ఆ తరువాత స్వామిగా వుండే అర్హత లభిస్తుంది.
ఓర్వలేని తనాన్ని వదిలించుకోవటం ఒక్కటే ఇందుకు మార్గం. మన పూర్వులు అద్భుత కావ్యాలు ఎన్నో చేశారు. ఆ ఘనకార్యాలు గురించి, మనం ఈనాడు వారి పట్ల భక్తి ప్రపత్తులతో గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే రేపటి తరాల వారు కూడా వెనక్కి తిరిగి చూసి, మనల్ని గురించి అంతే గర్వంగా చెప్పుకోగలగాలి. అందుకు అనువుగా మనం ప్రవర్తించాలి. ఈర్ష్యాసూయలతో మగ్గిపోతే ముందుతరాలు మనల్ని క్షమించవు.
----
అన్ని కోరికలనూ అరికట్టేది భక్తి. ప్రతిఫలాపేక్ష లేనిది భక్తి. 'మనసా వాచా కర్మణా ఆ భగవానుడినే స్మరిస్తూ, ఒక్క క్షణమైనా ఆ స్మరణ మానుకోలేని పారవశ్య స్థితే భక్తి' అని నారద మహర్షి వర్ణించారు. దేవునిపై భక్తి కూడా ఒక రకమైన పిచ్చి అని మా గురుదేవులు అనేవారు. అది మనిషికి మేలు చేసే పిచ్చి. ఏసుక్రీస్తు, బుద్ధుడు, రామకృష్ణ పరమహంస మొదలైన అవతార పురుషులు మనలో ఈ భక్తి భావాన్ని ప్రకోపింప చేయగలిగిన సమర్థులు. ఒక్క చూపుతో, ఒక్క స్పర్శతో.... మనలో ఆ పరమానుభూతిని సృష్టించగల దివ్యశక్తి వాళ్ళది. అదే గురుమహిమ.
-----
నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే వుంది. నిన్ను తీర్చి దిద్దుకోగల శక్తి నీలోనే వుంది. నేటి మన సుఖ దుఃఖాలకు పూర్వజన్మ పరిపాకమే కారణమని మనం నమ్మితే, ఈనాడు మనం చేసే కర్మలపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి వుంటుందనేది సత్యమే కదా! అందుకే "మన జీవితాలకు మనమే బాధ్యులం".
సాధారణంగా మన బాధలన్నింటికీ దేవుడో, దెయ్యమో కారణమనుకోవటం పరిపాటి అయిపోయింది. విధిని నిందించటం అలవాటైపోయింది. కానీ, ఏ విత్తు నాటితే, ఆ చెట్టే మొలిచినట్లుగా.... మనం ఎలాంటి పనులు చేస్తామో, అలాంటి ఫలితాలనే అనుభవిస్తాము. అంటే, మన విధిని మనమే నిర్ణయించుకుంటాము. ఇక ఇతరులను నిందించటం ఎందుకు?
గాలి బాగా వీస్తున్నప్పుడు తెర చాపలెత్తిన పడవులు ముందుకు దూసుకుపోతాయి. తెరచాపలు దించుకున్న పడవలు ఎక్కడివి అక్కడే వుండిపోతాయి. అది ఎవరి తప్పు? వీచే గాలి తప్పా? ఆ గాలిని సృష్టించిన దేవుని తప్పా? కనుక పురుష ప్రయత్నం ముఖ్యం. దాని నుండే, మనలో నుండే, మన భవిష్యత్తును తీర్చి దిద్దుకోగలిగిన శక్తి, ఆవిర్భవిస్తుంది. చెడుతలపులు, చెడు చేతలు, క్రూర మృగాల్లాగా మనని మ్రింగి వేస్తాయి. మంచి తలపులు, మంచి చేతలు... దేవతలై మనల్ని కాపాడుతాయి. మన వేదాంతం బోధించేది ఇదే!
          ఈ జీవితం ఒక సత్యం. ఆ జీవిత మార్గం కంటక మయం కావచ్చు. అప్పుడు నీలో నిబిడీకృతమై యున్న ఆత్మశక్తిని మేలుకొల్పు. దాని సాయంతో నిష్కంటకంగా పయనం సాగించు.
---
నిజమైన సన్యాసికి మత ప్రమేయం లేదు. అతడు అన్ని మతాల సారాన్ని జీర్ణించుకున్న జీవన్ముక్తుడు. తాత్విక సిద్ధాంతాలకు అతీతుడైన సిద్ధుడు. అందుకే సన్యాసి అయిన వాడు గృహస్థులతో కానీ, ధనవంతులతో కానీ సంబంధం పెట్టుకోకూడదు. పేదవారి సేవకే తన శక్తి యుక్తుల్ని వినియోగించాలి. మన దేశంలో సన్యాసులు తరచూ శ్రీమంతుల నాశ్రయించి, వారి ప్రాపు కోరడం వల్లనే సన్యాస ధర్మం చెడిపోతున్నది. ఒక వెలయాలు ధనవంతుల కోసం ఆరాటపడితే అర్థం వుంది కానీ, ఐహిక వాసనలన్నీ త్యజించిన సన్యాసికి ధనవంతులతో పని ఏమిటి? కాంతా కనకాలకు దూరంగా వుండవలసినవాడు... వాటికి దగ్గర కావడం ఎంత అపచారం?

మా గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస కాంతా కనకాలతో లేశమైనా ప్రమేయం లేనివారితోనే మాట్లాడాలని అభిలషించేవారు. అలాంటి వారితోనే తనకు సంబంధం కల్పించమనీ, జగన్మాతను ప్రార్థించేవారు. ఐహిక బుద్ధి కలవారిని ముట్టుకోవడానికి కూడా నిరాకరించేవారు. "ఆత్మ విముక్తి", "లోకకళ్యాణము" - ఇవి రెండే సన్యాసాశ్రమ పరమార్థాలు.

ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ! - అందుకు అనుసరించ వలసిన విధులలో కాంతా కనక విసర్జన ముఖ్యమైనది. ఆ నియమ పాలనం కోసం పూర్వకాలంలో సన్యాసులు భిక్షా విధి పాటించేవారు. ప్రతి దినమూ వారికి భిక్ష పెట్టటము గృహస్థ ధర్మంగా వుండేది.  కానీ, వర్తమాన సమాజంలో, మారిపోయిన పరిస్థితులలో ఈ మాధుకర జీవనము సాధ్యమూ కాదు, సముచితమూ కాదు. కనుక సన్యాసులు కూడా, తమ కనీస అవసరాలకు కావల్సిన ఏర్పాట్లు చేసుకోవడం ఈనాడు ధర్మ విరుద్ధం కాదు. అయితే, వారు తమ శక్తిని, సమయాన్ని అంతా సన్యాసాశ్రమ పరమార్థాల కోసమే వినియోగించటం న్యాయం.
-----
ఈనాడు మన దేశంలో ఎటు చూచినా మద్రాస్‌, బొంబాయి, పంజాబ్‌, బెంగాల్‌... ఏ ప్రాంతాన్ని పరికించినా కల్లా, కపటము, సోమరితనము... తాండవమాడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, మేధావులు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. పరాయి భాషలో, పరాయి భావాలతో బుర్రలు నింపుకుని, ఏవేవో డిగ్రీలు సంపాదించుకుని, మేము మేధావులము అని విర్రవీగే వారందరూ ఒక్కసారి ఆగి ఆలోచించండి! మీ చదువులన్నీ దేనికి? గుమస్తా ఉద్యోగాల కోసమా? మీకు ఈ దేశం సంగతి పట్టదా? రత్న గర్భా అని పేరు పొందిన ఈ భారతదేశం ఈనాడు పట్టెడు మెతుకులకోసం పరితపించి పోతుంటే, మీలో చలనం కలగదా? ఈ క్షుదార్తిని తీర్చలేని మీ చదువులు దేనికి?

రండి! మనుషులు మధ్యకు రండి! మతిని పెళ్ళగించండి. మీ చదువులతో, మీ పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంతో, కొత్త సాధనాలు కనిపెట్టి, కొత్త పద్ధతులతో ఆహారం పండించండి. ప్రజల ఆకలి బాధ తీర్చండి. మీ పురాణాలను, ధర్మశాస్త్రాలను గంగలో పారవేయండి. కూటికీ, బట్టకు కరువైన ప్రజలు ధర్మ పన్నాలు వింటారా? ముందు వారికి ఆకలి తీరే మార్గం చూపించండి. ఆ తరువాత ధర్మబోధన చేయండి. ముందు మీ ఆత్మశక్తిని మేల్కొల్పండి. ఆ శక్తితో ప్రజల భౌతికావసరాలు తీరే వెరవు చూపించి, ఆ పైన వారిలో ధర్మవికాసం కల్పించండి. అదే మీ కర్తవ్యం! ఆ కృషి ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభం కావాలి. ఈ దేశం తిరిగి కోలుకుంటుంది. ఆ శుభ సమయం ఆసన్నమయ్యింది. శ్రీ రామకృష్ణ పరమహంస అవతరణతో, ఈ కర్మభూమిపై అరుణోదయమైంది. అనతి కాలంలోనే మధ్యాహ్న సూర్యప్రభలతో ఈ దేశం దేదీప్యమానం కాక తప్పదు.
------
ప్రకృతికి తల ఒగ్గటం కాదు. దాన్ని జయించటమే మానవ జన్మకు సార్థక్యం.

మనిషిలో శక్తికి మూలం పరోపకారము, పవిత్రత. మృగత్వం నుండి మానవత్వానికి, మానవత్వం నుండి దైవత్వానికి నడిపించేదే మతం.

భగవంతునిలోని సగుణ భావమే సృష్టి.

నిజాన్ని వెయ్యి విధాలుగా నిర్వచించవచ్చు. అందులో ప్రతి విధమూ నిజమే అవుతుంది.

నీపై నీకు నమ్మకం కుదరనంతకాలం, దేవునిపై నమ్మకం కుదరదు.

సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు. కానీ, సత్యాన్ని మాత్రము దేనికోసమూ వదులుకోకూడదు.

పాప పుణ్యాలనేవి లేవు. ఉన్నది అవిద్య. అంటే అజ్ఞానం మాత్రమే!

అద్వైత తత్త్వాన్ని అర్థం చేసుకుంటే అవిద్య నశిస్తుంది.

ధనికులకు దాసోహం అయిన క్షణం నుంచి మతం మలినమైపోతుంది. దుఃఖం అనే కిరీటం ధరించి సౌఖ్యం మనిషి ముందు నిలుస్తుంది. అందుకే సౌఖ్యాన్ని కోరేవాడు, దుఃఖాన్ని కూడా భరించాలి.

-----

ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేదే మతం. అది వాద ప్రతివాదాలకు, సిద్ధాంతాలకు కట్టుబడేది కాదు. ఈ పరమ సత్యాన్ని విభిన్న మతాలు.... విభిన్న మార్గాల ద్వారా ప్రతిపాదిస్తాయి. విభిన్న వ్యక్తులు.... విభిన్న కోణాల నుండి దర్శిస్తారు. ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి - అన్నది మన వేదవాక్యం.

అయితే, సముద్రంలో ఆటుపోటు వచ్చినట్లుగా, ఒక జాతి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆటుపోటు అనేవి వస్తాయి. ఆ విధంగా మతక్షయం కలిగే సమయాలలో ధర్మ సంరక్షణార్థం మహాప్రవక్తలు, అవతార పురుషులు ఉద్భవించి, జాతిని లోకాన్ని కాపాడుతారు. కనుక అలాంటి వారి అందరి ఉపదేశాలూ మనకు అనుసరణీయాలే! ఆ మహోపదేశాలలో అగ్రగణ్యమైనది గీతోపదేశము. అందులో శ్రీకృష్ణ భగవానుని బోధనలు అన్నింటిలోకి శిరోధార్యమైనది ఆయన చెప్పిన నిష్కామ కర్మ. అంటే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మను ఆచరించడం.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి, సంగం త్యక్త్వా కరోతి యః,
లిప్యతేనస పాపేన పద్మపత్ర మివాంభస!
ఎవడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణంగా కర్మను ఆచరిస్తాడో, తామరాకు మీద నీరు అంటని విధంగా, అతణ్ణి ఏ పాపమూ అంటుకోదు. కనుక మనం రాత్రి పగులు నిర్విరామంగా పనిచేస్తూ వుండాలి. స్వార్థ రహితంగా చేస్తూ వుండాలి. ఫలితాన్ని ఆశించుకుండా చేస్తూ వుండాలి. అప్పుడే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది.

ఎవడు నిరంతర కర్మాచరణ నడుమ స్థిర శాంతిని పొందగలడో, ఎవడు నిరంతర శాంతి నడుమ అవిశ్రాంత కర్మాచరణము కొనసాగించగలడో, అతడే యోగి - అని భగవద్గీత చెబుతున్నది.

శ్రీకృష్ణుడు చెప్పిన మరొక గొప్ప యోగం నిస్సంగత్వం. అంటే మమకారాన్ని వదులుకోవటం. నా భార్యా, నా బిడ్డలు అని శరీర ధారుల పట్ల మమకారాన్ని పెంచుకుంటే, వారు శాశ్వతులు కారు గనుక దాని వలన లభించేది దుఃఖమే!

అలా కాకుండా ఆ శరీర ధారుల లోపల వుండే భగవదంశలను గుర్తించి, దానిపై మమకారం నిలుపుకుంటే, అది శాశ్వతమైనది కాబట్టి, ఏ దుఃఖమూ అంటదు, మోక్షం ప్రాప్తిస్తుంది. అదే రహస్యము. అనగా నశ్వరమైన దేహం పట్ల నిస్సంగత్వమూ, నిత్యమైన ఆత్మ పట్ల సంగత్వమూ పెంచుకోమనీ - గీతావాక్యం.

అందుకే హిందువులు ఏ పని చేసినా... కృష్ణార్పణం, భగవదర్పణం అనడం అలవాటయ్యింది.  

ఇక బుద్ధ భగవానుడు ఏమన్నాడో ఆలకించండి. స్వార్థాన్ని సమూలంగా పెరికి వేయి. పెళ్ళాం, బిడ్డలు, ప్రాపంచిక సౌఖ్యాలు అన్నిటినీ త్యజించు. పరిపూర్ణమైన స్వార్థ రాహిత్యమే నీ ధ్యేయం. - అన్నది బౌద్ధ ధర్మం.

స్వార్థం మనిషిని బానిసను చేస్తుంది. పశువుగా మారుస్తుంది. అన్ని అనర్థాలకూ మూలమైన స్వార్థాన్ని అనగా కోరికలను త్యజించాలి అని బుద్ధభగవానుడు ఉపదేశించాడు.

ఇక ఏసుక్రీస్తు, దేవుని రాజ్యం అందుబాటులో వున్నది, సిద్ధం కా! - అని ఆయన పిలుపు. ఆ అద్భుత సంఘటన ఏ నిమిషాన్నైనా జరుగవచ్చు. అందుకే క్రీస్తు మహాశయుని గంభీరమైన పిలుపుకి తలవొగ్గి ముందుకు సాగాలి.

అదే విధంగా మహమ్మద్‌ ప్రవక్త కూడా 'మానవులందరూ సోదరులే' అన్న సమతా ధర్మాన్ని బోధించాడు. వీరందరూ విభిన్న మతాల ద్వారా ఒకే సత్యాన్ని ప్రబోధించిన మహాపురుషులు. అయితే మానవ సమాజంలో వ్యత్యాసాలకు, ఘర్షణలకు, పీడనకు మతమే కారణమని కొందరు వాదిస్తున్నారు. అది ఎంత మాత్రమూ యథార్థము కాదు. అది మతంలో వున్న దోషం కాదు. మత పరమార్థాన్ని సరిగా అర్థం చేసుకోలేని, ఆచరణలో పెట్టలేని మన లోపం. సమాజ లోపం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చేయవలసింది మతనింద కాదు. స్వచ్ఛమైన మత బోధనలను ప్రజలలో ప్రచారం చేయడమే!

ఈ దేశంలో రాజకీయ, సాంఘిక సిద్ధాంతాల్ని ప్రచారం చేసే ముందు, మన వేదాలలో ఉపనిషత్తులలో వున్న ధార్మిక సత్యాలను బయటపెట్టి, పల్లె పల్లెనా, వాడవాడనా ప్రజానీకానికి వినిపించాలి. కుల, వర్ణ, లింగ భేదం లేకుండా కార్మిక, కర్షక, వర్తక, పాలక వర్గాలందరిలో సర్వ జనావళిలో ఈ ధర్మప్రచారం సాగించాలి. అదే నా ఆశయం. అదే నేను ఆశించే విశ్వజనీన మతం.

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా

ఓం శాంతిః శాంతిః శాంతిః









NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular