Sunday, December 10, 2017

World Telugu Conference 2017 to Be Held in Hyderabad from Dec 15th


World Telugu Conference 2017 to Be Held in Hyderabad from Dec 15th


కడలి అంచులు దాటి కదిలింది తెలుగు.. ఎదల లోతులు మీటి ఎగసింది తెలుగు.. ఏ భాష చెణకైన ఏ యాస చినుకైన తనలోన కలుపుకొని తరలింది తెలుగు.. అన్న సినారె కవితా స్ఫూర్తికి అక్షర హారతులు పడుతూ.. తెలుగు సంబరాలకు భాగ్యనగరం సర్వం సిద్ధమవుతోంది. తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న తెలుగు పండుగలకు భాషాభిమానులంతా తరలివస్తున్నారు. ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ గడ్డ మీద ప్రభవించిన సాహితీ సుమాలను సుకుమారంగా స్పృశించేందుకు.. సారస్వత సంపదను పొదివిపట్టుకునేందుకు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. అన్న దాశరధి పలుకుల సాక్షిగా.. ఎంతోమంది తెలంగాణ కవిసార్వభౌములు, సాహితీ సృజనశీలురు సాహితీ ద్వారాల్లో స్వాగత సత్కారాలు అందుకోబోతున్నారు. తెలుగింట పర్వదినాలను తలపించే ఈ తెలుగు మహాసభల సందర్భంగా నేటి నుంచి ఈనాడు వెలువరిస్తున్న కథనాలు. అనాది కవితా మాగాణం కోటి తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకొన్నట్టి సరసు లోపల వసించి ప్రొద్దుప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణతల్లి కంజాతవల్లి! ఈ దాశరథి కృష్ణమాచార్య పద్యం సదాస్మరణీయం! తెలుగు సాహిత్య చరిత్రను తిరగేస్తే తెలంగాణ పుటలు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ ప్రాచీన కాలం నుంచీ తెలంగాణ గడ్డ మీద ప్రభవించిన ప్రక్రియా వైశిష్ట్యం... అనంతం! తొలి తెలుగు అలంకార గ్రంథం, ఎలుగెత్తి పాడుకునే ద్విపద, తొలి తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్షగానం, సాంఘిక చరిత్రం.. ఇలా ఎన్నింటికో ఈ గడ్డ తొలి పురుడు పోసింది. పదునుదేలిన సమర కవిత మాత్రమే కాదు.. ఎంతో విలక్షణమైన ప్రాచీన కవిత్వం ఈ నేల మీద ప్రవహించింది. కన్నడభాషలో ఆదికవి అయిన పంప మహాకవి తెలంగాణకు చెందినవాడు. ఇప్పటి వరకూ ఆదికవిగా స్థిరపడిన నన్నయ రాసిన భారతంపై పంప మహాకవి ప్రభావం ఉందన్నది పరిశోధకుల ప్రగాఢ విశ్వాసం. తొలి చాటుకవిగా, వశ్యవాక్కు గలవాడిగా, శ్రీనాధుడు ‘వచియింతు వేములవాడ భీమనభంగి ఉద్దండలీల’ అని సగర్వంగా చెప్పుకున్న వేములవాడ భీమకవి తెలంగాణాలోని వేములవాడకు చెందినవాడని జయంతి రామయ్య పంతులు, మానవల్లి రామకృష్ణ కవివంటి వారు నిరూపించారు. భీమకవి ఎన్నడో 11వ శతాబ్దం చివర్లోనే.. నాకు శాపాలు పెట్టే శక్తి ఉంది, నన్ను ఏమన్నా ఊరుకోనని కన్నెర్ర చేస్తూ.. ‘శాపాను గ్రహపటువును రాపాడెడి కవుల నెత్తిరంపంబనగా భూపాల సభల పూజ్యుడ’ అన్నాడంటే పోరుగడ్డగా తెలంగాణ ఆది నుంచీ మహమాన్వితమైనదేనని అర్థమవుతుంది. దురదృష్టం ఏమిటంటే భీమకవి రచనలు లభ్యం కాకపోవటం! లభ్యమైతే తెలంగాణ ప్రాచీన కవితా పటిమ తెలిసేది. జాను తెలుగు.. సోమన శకం! తెలంగాణ ప్రాచీన కవితా వైభవానికి నిలువుటద్దం పాల్కురికి సోమన! 12వ శతాబ్దంలో అంతకు ముందున్న మార్గ కవిత్వపు మార్గంలో పయనించకుండా ‘అనితర సాధ్యం నా మార్గం’ అంటూ దేశికవితా ప్రస్తానం చేసి ‘తెలంగాణ ఆదికవి’ అనిపించుకున్న వీరశైవ కవి సోమన. శైవేతర దూషణ అన్న అవాంఛనీయత ఒక్కటి తప్ప సాహిత్యాంశాలలో శిఖరప్రాయమైనవాడు సోమన. శ్రీకృష్ణదేవరాయల కంటే 400 సంవత్సరాల పూర్వమే తెలుగును తేలికగా చూడొద్దని హెచ్చరిస్తూ.. ‘‘తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదియగా చూడు’’డని సంస్కృత విద్వాంసుల మధ్య ఎలుగెత్తి చాటిన అచ్చమైన తెలుగు భాషాభిమాని పాల్కురికి సోమన. ‘తిన్నని సూక్తుల ద్విపద రచింతు’ అని శపథం చేసి, ద్విపద కావ్యాలు రాశాడు. సంస్కృత భూయిష్ట రచన సామాన్యులకు అందదు. కాబట్టి జానుతెనుగులో రాశాను అన్నాడు. కోకమ్మి, ముల్లోకవంద్య, దీపకంబము వంటివి స్వేచ్ఛగా వాడి ‘‘నాకు ప్రజలే ముఖ్యం కాని లాక్షణికులు కాదు’ అనే సందేశాన్ని ఆ కాలంలోనే ఇవ్వటం సోమనకే చెల్లింది. సోమన రచనలు పరిశీలిస్తే 12వ శతాబ్దాన్ని ‘‘పాల్కురికి సోమన యుగం’’గానే పేర్కొనటం సముచితం. ఎందుకంటే తొలి ద్విపద కావ్యం, తొలి శతకం, తొలి ఉదాహరణ కావ్యం’ తొలి అష్టకం, తొలి రగడరచన, తొలి అక్షరాంకగద్య.... ఇన్ని రచనలకి శ్రీకారం చుట్టినవాడు యుగకర్తే! మహబూబ్‌నగర్‌ దగ్గర్లోని వర్తమానపురం కోనవంశీయుల నివాస స్థలం. ఈ కోనవంశీయులు కాకతీయ చక్రవర్తులకు సామంతులై రాయచూర్‌ ప్రాంతాన్ని పాలించారు. ఈ వంశానికి చెందిన గోన గన్నారెడ్డి ‘రంగనాథ రామాయణం’ ద్విపదలోరాసి తొలి ద్విపద రామాయణ కవిగా నిలిచిపోయాడు. ఈ రామాయణం ఎంతగా జనంలోకి వెళ్లిందంటే బొమ్మలాటల వాళ్లు కూడా దీని ఆధారంగా పాటలు, మాటలు సమకూర్చుకొనేవారు. అంత ప్రాచుర్యం పొందిన రంగనాథ రామాయణం నిన్నమొన్నటి వరకూ అనాదరంగా పడి ఉండటం శోచనీయం. రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, పింగళి లక్ష్మీకాంతంగార్ల కృషి వల్లే ఇది సాహిత్య చరిత్రలో పాఠ్యాంశంగా స్థిరపడింది. ‘అల్లవో రఘురామ! నయనాభిరామ! ... బాపురే, రామభూపాల! లోకములనీ పాటివిలుకాడు నేర్చునే కలుగ’ అని రావణాసురుడు రాముడ్ని ప్రశంసించటం పరమ ఔచిత్యవంతంగా వుంటుంది. తెలుగులో చంపూ రామాయణం లేని లోటును భాస్కర రామాయణం పూరించింది. ‘‘సకల సుకవిజన సంస్తూయమాన యశోమూర్తి’’ అయిన భాస్కరుడు దాదాపు 1140 పద్యాలు రాస్తే రావలసినంత ప్రఖ్యాతి రాలేదు. ఎఱ్ఱన రామాయణం రాశాడని చెప్తున్నా లభ్యం కాలేదు. హుళక్కి భాస్కరుడు, మల్లికార్జునభట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు కలిసి భాస్కర రామాయణం రచించారు. పూర్తి రామాయణం లభ్యమవుతున్నా కూడా ఇది ఇటీవల ఆచార్య రవ్వా శ్రీహరి పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన తర్వాత గానీ కొంత వ్యాప్తిలోకి రాలేదు. భాస్కర రామాయణం ‘ఇతిహాస కావ్యం’గా రాయబడింది. వాల్మీకి రామాయణానికే బద్ధం కాకుండా స్వతంత్రానువాదంగా విలసిల్లిన ఈ రచన పురాణపఠన ప్రక్రియలో పేరు పొందింది. శబ్ద చమత్కారాలు, రసవత్తర సంభాషణలు, నవ్య ఉపమానాలు భాస్కర రామాయణ ప్రత్యేకతలు. రాజనింద చేసిన తొలికవిగా, భక్తితత్వాన్ని కొత్త పాఠంగా బోధించిన సహజకవిగా, కర్షక కవిగా, తెలుగు భాషాశక్తిని సంపూర్ణంగా హస్తగతం చేసుకున్న పరమభాగవతోత్తముడు బమ్మెర పోతన. వరంగల్‌ జిల్లా బమ్మెర స్వగ్రామమని చారిత్రకంగా, సాహిత్యపరంగా నిరూపితమైంది. ‘పోతనకు పునర్జన్మలేదు. అసలు పోతన మరణిస్తేగదా’’ అన్నాడు ఆరుద్ర! ‘దీనిని దెనిగించి నా జననంబున్‌ సఫలంబుచేసెద పునర్జన్మంబు లేకుండగన్‌’’ అని ఉప్పొంగిపోయి తెలుగువారికి భాగవత మకరంద మాధుర్యాన్ని అందించాడు. సంపదలు, రాజాశ్రయాలు కోరని స్వేచ్ఛాజీవి, పరమ భాగవతోత్తముడు పోతన. ఆయన ‘సత్కవుల్‌’ హాలికులైననేమి?’ అనటంలో ఆశ్చర్యంఏముంటుంది? శ్రీనాథుడికీ, పోతనకీ వ్యక్తిత్వంలో, కవిత్వంలో చాలా తేడావుంది. దీనికి ‘‘విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపఱతు’’ అని పోతన అనటమే నిదర్శనం. శ్రీనాథుని చాటువులు వ్యాప్తికెక్కితే పోతన భాగవతం అందరి హృదయాలలోకి వ్యాప్తి చెందింది. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు....’ అంటూ ఎన్నడో 15వ శతాబ్దంలో రాసింది నేటికీ పత్రికా శీర్షికల్లో కనబడుతోందంటే పోతన కవితా వ్యవసాయం మనకెంతటి మధుర ఫలాలను అందించిందో కదా! బమ్మెరపోతన తెలుగు భాషా మాధుర్యానికి ద్వారాలు తెరిచాడు!! ‘‘చింతమదిలేక మనుజులు చింతించిన కొలది చవులు చేకూర్చుచుని (చవులు = రుచులు) శ్చింతులుగా నొనరించెడు చింతకు సరిగలదె లోక చింతామణికిన్‌’’ అంటూ ‘చింత’ చమత్కారంతో ‘సింహాసన ద్వాత్రింశిక’ రాసిన కవి కొరవి గోపరాజు. ఈ కావ్యాన్ని సాంఘిక విజ్ఞాన సర్వస్వం అంటారు. అంతకు ముందు ఇటువంటి కథాకావ్యం రాలేదు. 32 బొమ్మలు చెప్పే కథలతో నవరసభరితంగా రాసిన మణిరత్నం ఇది. ఒకనాటి తెలంగాణ పలుకుబడులను భద్రపరచిన కవిగా, సురవరం ప్రతాపరెడ్డిగారి సాంఘిక చరిత్రకు మూలకవిగా గోపరాజును పేర్కొనాలి. చిన్న చిన్న మాటలతో తేనెలు కురియునట్లుగా కొత్త ఒరవడి సృష్టించిన సామాజిక కవిగా గోపరాజును ప్రశంసించాలి. ‘క్రీడాభిరామం’ తొలి వీథిరూపకంగా సుప్రసిద్ధం. శ్రీనాథుడు రాశాడా? వల్లభామాత్యుడు రాశాడా? అన్న వివాదంవుంది. అసలు రహస్యం ఏమిటంటే ఎవరు రాసినా మూలం తెలంగాణ కవిరచనే!! ఆ కవి రావిపాటి త్రిపురాంతకుడు. ఆ రచన ‘ప్రేమాభిరామం’ (సంస్కృతం). ఇందులోని ఓరుగల్లు వైభవ వర్ణన క్రీడాభిరామంలోనూ కనిపిస్తుంది. అందుకే క్రీడాభిరామం కాకతీయుల కాలం నాటి పరిస్థితుల్ని వివరించిన రచనగా స్థిరపడింది. ‘కవులలో ముందు చూపుగలవారును, వర్తమాన చరిత్రాంశములు భావి భాగ్యోదయానికి మూలకందములని భావించినవారును, సంప్రదాయమునకు ఎదురీదినవారును అగు కవిగ్రామణులు లేకపోలేదు. ఆంధ్ర వాజ్మయ చరిత్రలో అట్టివారిని వ్రేళ్ళమీద లెక్కచెప్పవచ్చును. అట్టి కొద్దిమందిలో కాసె సర్వప్ప అను కవీశ్వరుడొకడు’ అని మాడపాటి హనుమంతరావు శ్లాఘించారు. క్రీ.శ. 1600 ప్రాంతంలో చెర్వుపల్లిలో నివసించి, హన్మకొండ రాజాస్థానంలో పనిచేసిన సర్వప్ప ‘శ్రీ సిద్దేశ్వర చరిత్ర’ ద్విపద కావ్యం రాశాడు. వీరందరికీ పాల్కురికి సోమన దిశానిర్దేశకుడనిపిస్తుంది. ఈ చారిత్రక కావ్యంలో వజీర్లు, సరదార్లు, బత్తీసు, ఎల్లెము, తోకొంచు వంటి తెలంగాణ పదాలు కనిపిస్తాయి. రాజుల చరిత్రను ద్విపద కావ్యంగా మలచిన వారిలో సర్వప్ప ప్రప్రథముడు. ఇంతవరకు ఈ కావ్యంపై లోతుగా పరిశోధన జరగలేదు. తెలంగాణ తొలి రచనలకు కాణాచి అనేందుకు మరో సాక్ష్యం ‘సకలనీతి సమ్మతం’. ఇది తొలి సంకలన గ్రంథం. మడికి సింగన కృషి ఫలితం. 17 పుస్తకాల నుంచి రాజనీతి, లోకనీతి, శాస్త్ర అంశాలు మొదలైన మేలిముత్యాలను సేకరించి సంకలనం వెలువరించటం, అసలు 15వ శతాబ్దంలో అటువంటి ఆలోచన రావటమే అపూర్వం. ‘లోకోపకారముగ’ రచించానని చెప్పటంలో సమాజహితం లక్ష్యం అని తెలుస్తుంది. రాయబారికి మేధ, వాక్పటుత్వం, ప్రజ్ఞ, ఇంగితజ్ఞానం, ధైర్యం, రాజ భక్తి, వైరి ధర్మసంశోధన, విశుద్ధచరిత్ర - అనే లక్షణాలుండాలన్న పద్యం గమనిస్తే రాజకీయంగా ఎవర్ని రాయబారిగా నియమించాలో నేటికే కాదు, ఎప్పటికీ సార్వకాలిక సత్యమే. మరుగునపడ్డ మరొక కవి చరిగొండ ధర్మన్న. ‘‘చిత్రభారతం’’ కావ్యకవిగా అటుంచి- అవధాన విద్యకు ఆధ్యుడన్నది విశేషం. గంటకు అవలీలగా నూరు పద్యాలు చెప్పేవాడట! ‘శతలేఖిన్యవధాన పద్య రచనా....’ అని స్తుతి పొందటం అక్షర సత్యమే. విమర్శకులు సారంగు తమ్మయ్య రాసిన ‘వైజయంతీ విలాసం’ ప్రబంధానికి సముచిత స్థానం ఇవ్వకపోగా నీతిబాహ్యమైనదని ఆడిపోసుకున్నారు. అంతకుముందు శృంగారస ప్రవాహం గల కావ్యాలు, అంగాంగ శృంగారం దట్టించిన ప్రబంధాలు లేవా? గోల్కొండ ప్రభువును స్తుతించి కూడా, గౌరవం పొంది కూడా అతనికి అంకితం ఇవ్వకుండా తన కులదైవం శ్రీరాముడికి అంకితం ఇవ్వటంలో తమ్మయ్య వ్యక్తిత్వం, దైవభక్తి అవగతమవుతాయి. పైగా ఈ కవి గురువైన కందాళ అప్పలాచార్యులు సామాన్యుడు కాడు. విష్ణు భక్తుడు. స్త్రీ లోలత్వం తగదన్న సందేశమిచ్చే ‘వైజయంతీ విలాసం’లో తెలుగుదనం, సరళత్వం నిండుగా ఉందని నిష్కర్షగా ప్రకటించారు ఆరుద్ర. 16వ శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ప్రబంధాన్ని కూడా విమర్శకులు ఆదరించలేదు. ఈ కథ నన్నయ భారతంలోదే తప్ప స్వతంత్రమైనది కాదు. శృంగార నైషధంలో స్వర్ణహంసలా, ప్రభావతీప్రద్యుమ్నంలో శుచిముఖిలాగా, కళాపూర్ణోదయంలో చిలుకలాగా ఈ ప్రబంధంలోనూ చిలుక తపతి-సంవరణుల్ని కలుపుతుంది. మంచి కల్పనలతో వసుచరిత్రలా వుందని కందుకూరి కితాబు ఇచ్చినా గంగాధర కవికి అన్యాయం జరుగుతూనే వుంది. మహమ్మదీయ ప్రభువైన ఇబ్రహీం కుతుబ్‌షాకి తపతీసంవరణం అంకితమీయబడటం విశేషం. గోల్కొండ నవాబు తెలుగును ఆదరించాడన్నది సత్యం. అందుకే కవులు ఇబ్రహీం కుతుబ్‌షాను ‘మల్కిభరాముడు’గా కీర్తించారు. తెలంగాణ నుంచి వెలువడిన మరొక అపూర్వ కావ్యం ‘యయాతి చరిత్ర’. ఇది తొలి అచ్చ తెలుగు కావ్యం అని గుర్తుంచుకోవాలి. దీన్ని రాసిన పొన్నగంటి తెలగన పోటం చెర్వు (ఇప్పటి పటాన్‌చెరు) నివాసి. తన అచ్చతెలుగు కావ్యాన్ని ఇబ్రహీంకుతుబ్‌షా సర్దారుగా ఉన్న అమీన్‌ఖాన్‌కి అంకితమిచ్చాడు. ఏదో ఆశించి ఇవ్వలేదు. స్వయంగా అమీన్‌ఖాన్‌ ‘నీ చేయునచ్చ తెనుగు గబ్బమన్నియెడల మించి వెలయగాన మీను ఖానునకిచ్చి’ అని మరింగంటి అప్పన్న ద్వారా కబురు పంపి అంకితం తీసుకున్నాడు. అంటే గోల్కొండ పాలకులకు తెలుగన్నా, తెలుగు కవులన్నా ఎంత మక్కువ వుందో గ్రహింపవచ్చు. ఈ కావ్యంలోని కథ కూడా మహాభారతంలోదే. ఆత్మనివేదనకు పరాకాష్ఠగా రామదాసు కీర్తనలను ఆరాధిస్తూ, భజనలు చేస్తూ తెలుగుజాతి పునీతమవుతోంది. ఈ కంచర్ల గోపన్న తన భక్తి తన్వయత్వంలో ప్రజల చేత భక్తరామదాసుగా ప్రశంసించబడ్డాడు. భక్తులలో రామదాసు ధైర్యశాలి. అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడన్న దాస్యభక్తికి నిలువెత్తు సాక్ష్యం. గుళ్ళల్లో, ఉత్సవాల్లో, జానపదుల కళారూపాలలో రామదాసు కీర్తనలు ఉండవలసిందే. కాళ్ళకు గజ్జె కట్టి, చెక్కభజన చేస్తూ ‘ఓ రామ, ఓ రామ...’ అని పాడుతూ వుంటే ఇహలోకాన్ని మర్చిపోతాం. వాడుక తెలుగులో ఎంత శక్తి వుందో రామదాసు తేటతెల్లం చేశాడు. కీర్తనలతో ఆగిపోకుండా ‘దాశరథ శతకం’ రాసి కవితేజుడ్ని అని చాటాడు. మనసునిండా కరుణాపయోనిధిని పదిలపరచుకొని చదివితే చాలు- రామానుగ్రహం కలుగుతుందని హితోపదేశం చేశాడు. నల్గొండ జిల్లా వాస్తవ్యులైన మరింగంటి కవులు, పండితులు ఎన్నో రచనలు చేసి తెలంగాణలో మహావిద్వాంసులకు, వేదాంతులకు లోటులేదని చాటారు. మరింగంటి కుటుంబాలన్నీ సంప్రదాయ కవిత్వానికి ఆటపట్టులే. ఇటీవల శ్రీరంగాచార్యులు ఈ కవులపై పరిశోధనచేసి వారి ప్రతిభాపాటవాలను వెల్లడించి తెలంగాణ ప్రాశస్త్యాన్ని మరోసారి ప్రకటించారు. తెలంగాణలో యక్షగాన వాఙ్మయం ఎంతగానో విస్తృతి చెందినా పట్టించుకోలేదు. ఇటీవల ఆచార్య బాగయ్య, శ్రీకాంత్‌ కుమార్‌ కలిసి ‘తెలంగాణ యక్షగాన వాఙ్మయం’ అనే 665 పుటల బృహత్‌ గ్రంథం రాశారు. ఇంకా... ఇంకా ఎందరో తెలంగాణ ప్రాచీన కవితా సామ్రాజ్యమేనని నిరూపించినవారున్నారు. ‘‘ముంగిలి’’లో డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి మొదటగా ప్రాచీన కవిత్వంపై పుస్తకం తీసుకువచ్చారు. పాల్కురికి సోమన, పోతన... వంటి వారు సరే కానీ- ఈ వ్యాసంలో ప్రస్తావించిన మరుగునపడిన లేదా అనాదరణకు గురైన, అముద్రిత రచనల, కవులపైనా ప్రత్యేకమైన కృషి జరగాలి. యక్షగానాలపై విస్తృతంగా, ప్రామాణికంగా అధ్యయనం చేస్తే తెలంగాణ తెలుగునుడికారం వెలుగులోకి వస్తుంది. ఈ ప్రపంచ తెలంగాణ మహాసభలు ఆ దిశగా కొత్తబాటలు వేస్తాయని ఆశిద్దాం. డా।। ద్వా.నా.శాస్త్రి కవిసార్వభౌములెందరో!! బమ్మెర పోతన ‘శ్రీ కైవల్యపదంబుజేరుట’ లక్ష్యంగా వ్యాస భాగవతాన్ని తెనిగించిన సహజ పండితుడు. పోతన భాగవతం ఇంటింటి పారాయణ గ్రంథమైంది. ‘‘పలికెడిది భాగవతమట, పలికించువిభుండు రామభద్రుండట...’’ అన్న పోతన తెలుగుల పుణ్యపేటి. పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దంలోనే సామాజిక చైతన్యం రగిలించిన కవి. కృష్ణదేవరాయలకంటే ముందే తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించిన దేశికవి. ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పితామహుడు. గోన బుద్ధారెడ్డి ‘ఆదికవీశ్వరుడైన వాల్మీకి యాదరంబున పుణ్యులందరు మెచ్చ’ తొలి తెలుగు రామాయణం రాసిన ద్విపదకవి. రంగనాథ రామాయణాన్ని జనంలోకి తీసుకెళ్ళిన ప్రసిద్ధకవి. పొన్నగంటి తెలగన తెలుగుజాతికి తొలి అచ్చతెలుగు కావ్యామృతాన్ని అందించిన ప్రయోగవాది. ఇతని ‘యయాతి చరిత్ర’ దాదాపు 240 కందపద్యాల కబ్బము. లోకజ్ఞతకు, తెలుగు భాషాపటిమకు తెలగన చిహ్నపతాక. భక్త రామదాసు నేలకొండపల్లెలో జన్మించిన కంచర్ల గోపన్న ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’ అంటూ రామదాసు అయ్యాడు. భజన సంప్రదాయానికి ఆద్యుడై, పావన గోదావరీ లహరీ శీకరాల వలె దాశరథీ శతక పద్యాలు గుప్పించి రామన్నకు బంటు అయ్యాడు. శేషప్ప కవి ‘భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర’ అంటూ నరసింహ శతకం రాసిన భక్తాగ్రగణ్యుడు. భగవంతుని సేవ గొప్పవరం ఇదే భక్తియోగం- అని చాటిచెప్పి లోకరీతిని కళ్లకు కట్టించిన దొడ్డకవి శేషప్ప. మల్లినాథ సూరి సకలశాస్త్ర పారంగతుడు, సంస్కృతంలో మహామహోపాధ్యాయుడు. మెదక్‌ జిల్లాకు చెందిన వ్యాఖ్యాతృ శిరోమణి. సంస్కృతకవులకు ప్రాచుర్యం కల్పించిన అంతర్జాతీయ సుప్రసిద్ధుడు.. మన తెలుగువాడు కావటం మన అదృష్టం. చెర్విరాల బాగయ్య మెదక్‌ జిల్లా నరసాపురం తాలుకాలో 1904లో పుట్టిన చెర్విరాల బాగయ్య 14వ ఏటనే కవిత్వం చెప్పిన ప్రజ్ఞాధురీణుడు. తెలంగాణ యక్షగాన పితామహుడు. 100కు పైగా యక్షగానాలు రాసిన ‘ఒకే ఒక్కడు’గా ఖ్యాతిపొందినవాడు. బాగయ్య రాసిన ‘‘సుగ్రీవ విజయం’’ యక్షగానం లక్ష ప్రతుల అమ్ముడుపోవటం నభూతో నభవిష్యతి’. కొక్కొరోకో.. తొలి తెలుగు కోడి కూసింది! తొలి కోడి కనువిచ్చి నిలిచి మైవెంచి జలజల రెక్కలు సడలించి నీల్గి గ్రక్కున గాలార్చి కంఠంబువిచ్చి ముక్కున నీకెలు చక్కొల్పి కడుపు నిక్కించి, మెడసాచి, నిక్కి మున్సూచి కొక్కొరో కుర్రని కూయకమున్న- తెలుగు తోటలో గొంతెత్తి కూసిన తొలి కోడి ఇది! ఈ కూత ఎవరిదో తెలుసా? తెలుగు సాహిత్యాన్ని.. దివి నుంచి భువికి, రాజకోటల నుంచి మన పెరటిలోకి తీసుకువచ్చిన పాల్కురికి సోమన్నది! పురాణాలూ, ప్రబంధాలే సాహిత్య వస్తువులనీ, దేవతలూ ధరాపతులే కావ్య మన్ననలకు అర్హులని పండిత లోకం ప్రగాఢంగా విశ్వసిస్తున్న రోజుల్లో.. సాహిత్యాన్ని దేశిమార్గం పట్టించి.. కవిత్వాన్ని మన పెరటిలోకి తీసుకువచ్చి ‘కొక్కొరో కో’ అంటూ పొలికేక పెట్టాడాయన! అందుకే జలజలా రెక్కలు సడలించి.. నిక్కించి మెడ సాచి.. కొక్కొరో కుర్రని కోడి కుయ్యటంలోనూ అద్భుత సౌందర్యాన్ని తాను దర్శించటమే కాదు.. మన కళ్లకూ కట్టాడు పాల్కురికి సోమనాధుడు. ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవ చక్రవర్తి పాలిస్తున్న రోజుల్లో.. రాజధానికి పన్నెండు క్రోసుల దూరంలో ఉన్న పాల్కురికి గ్రామంలో 1240 సంవత్సరం ప్రాంతంలో జన్మించిన ఈ అమరకవి.. మన తెలుగు వారి అదృష్టం! ఆనాడే అబలలు కాదన్న అచ్చమాంబ భండారు అచ్చమాంబ- 1910 కన్నా ముందే తెలుగులో కథలు రాసినట్టు ప్రచారంలో ఉన్న రచయిత్రి. ఈమె కొమర్రాజు లక్ష్మణరావు సోదరి. ఈమె రాసిన పుస్తకమే ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’. 1947లో బెజవాడ అభ్యుదయ ప్రెస్‌ వారు దీనిని అచ్చువేశారు. స్త్రీ రత్నాల జీవితాలు, సాహస ఔదార్యాలు, భాషా సాహిత్యాలకు, సమాజానికి చేసిన సేవలు ఇందులో ఉన్నాయి. స్త్రీలు అబలలు కాదని ప్రకటించే పుస్తకమిది. ‘ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాస్సురక్షితాః’ - ఏ స్త్రీలు తమ ఆత్మను తామే కాపాడుకుంటారో, వారే సురక్షితురాండ్రు- అనే నినాదం లోపలి పుటలో కనిపిస్తుంది. నాలుగు సంవత్సరాలు ఎన్నో పుస్తకాలు చదివి, పెద్దల నుంచి సమాచారం సేకరించి మొదటి భాగం తీసుకువచ్చారు. రెండో భాగంలో వైదిక స్త్రీల చరిత్ర, పౌరాణిక స్త్రీల చరిత్రను రాయాలని ప్రణాళిక వేసుకున్నారు. ‘‘శ్రేష్ఠమైన కులములందు పుట్టి విద్య లేకుండిన ఏమి లాభము? నీచ కులమునందు పుట్టినను విద్యావంతులైన వారు అందరికీ పూజ్యులు’’ అంటూ స్త్రీ జనోద్ధరణ భావాలతో అనాడే ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ రాయడం విశేషం. గుండెల్లో కత్తులు నూరిన కవితా పాదాలు! కన్నూమిన్నూ కానని నియంతల పీచమణిచేందుకు కడు సామాన్యుడు సైతం ఓ కత్తుల వంతెన కడతాడు. పడిన బాధలు లోలోపల రక్తం మరిగిస్తుంటే శక్తికి మించిన సాహసానికి సైతం సిద్ధమైపోతాడు. రజాకార్ల ఘాతుకాలకు పడరాని పాట్లు పడి జీవచ్ఛవాల్లా కకావికలమైపోతున్న సామాన్యుడి గుండెలో ప్రతీకార జ్వాలలను రగిలించేందుకు ప్రజా కవి కాళోజీ రాసిన ఈ కవిత.. పదం పదం పేలిపోయింది. నిప్పు కణికలా రగిలిపోతూ జన సంద్రాన్ని కదిలించి ఉవ్వెత్తున ఉద్యమ పథం పట్టించింది. నాటి దురాగత దుర్ఘడియలకే కాదు.. నియంతలు బుసలు కొట్టిన ప్రతిసారీ ‘కాలంబు రాగానె కాటేసి తీరాలె’ అంటూ ఈ అద్భుత కవితా పాదాలు చరిత్ర పుటల్లో పైకి వస్తూనే ఉంటాయి. కడు సామాన్యులను సైతం కదిలిస్తూనే ఉంటాయి. సాహిత్యానికి ఇంతకు మించిన సార్థక్యం మరేముంటుంది! మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరచిపోకుండగ గురుతుంచుకోవాలె కసి ఆరిపోకుండ బుసకొట్టుచుండాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె ‘సత్యమ్మహింస’యని సంకోచపడరాదు ‘దయము ధర్మం’బనుచు తడుముకోపనిలేదు ‘శాంతి’యని చాటినను శాంతింపగారాదు ‘క్షమ’యంచు వేడినను క్షమియింపగారాదు ‘చాణుక్యనీతి’ నాచరణలో పెట్టాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె కొంగులాగిన వ్రేళ్లు కొలిమిలో పెట్టాలె కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె తన్నిన కాళ్లను ‘డాకలి’గ వాడాలె కండకండగ కోసి కాకులకు వెయ్యాలె కాలంబు రాగానె కాటేసి తీరాలె! మదిమదినీ కదిలించే విశ్వంభర గానం ‘‘ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.. అంటూ విశ్వంభర గానాన్ని ఆరంభించిన సి.నారాయణరెడ్డి మనిషిలోని మూల ధాతువులను తట్టి లేపుతూ.. మనశ్శక్తులను ఉత్తేజితం చేసే అద్భుత ప్రయత్నం చేశారు. మానవుడే నాయకుడిగా వచన కవితలో ఒక సమగ్ర కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ విశ్వమానవేతిహాసం.. సినారెకు జ్ఞానపీఠాన్ని తెచ్చిపెట్టటమే కాదు.. మనకు అనుదిన పాఠాలూ నేర్పిస్తుంది. ఊరుకోదు... అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే. వసంతోదయం ఊరుకోదు పరిమళాలను పారించనిదే. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతు ముట్టనిదే. ప్రతిఘటించే మనస్సు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే. - సినారె(విశ్వంభర)

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular