Wednesday, November 29, 2017

అంతర్యామి-పారాయణం-మహోన్నతం

అంతర్యామి

పారాయణం
రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత- ఇలా ఏదో ఒక గ్రంథ భాగాన్ని కొందరు రోజూ పఠిస్తుంటారు. తమ భక్తిశ్రద్ధలు అనుసరించి లేదా పెద్దల సూచన పాటించి వాటిని చదువుతుంటారు. వాటితో పాటు సహస్ర నామాలు, స్తోత్రాలు, చాలీసాలు ఎన్నింటినో పఠిస్తుండటం పరిపాటి. స్త్రీ పురుష భేదాలకు, బాలలు వృద్ధులు అనే తేడాలకు తావు లేకుండా అందరూ కలిసి పారాయణం చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. దినచర్యలో భాగంగా ఇళ్లలో, ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్రదేశాల్లో నియమ నిష్ఠలతో పఠించడమే వారికి ఆనందదాయకం.
‘ఆధ్యాత్మిక గ్రంథాల్ని ఏళ్లతరబడి పారాయణ చేస్తే సరిపోతుందా’ అని ప్రశ్నించేవారున్నారు. ఎటువంటి మానవ ప్రయత్నమూ చేయకుండా, అన్నీ దేవుడే చూసుకుంటాడంటూ పఠిస్తూ కూర్చోవడం సరైనదేనా అని వారు అడుగుతుంటారు. పురాణాల్ని పారాయణం చేయడంవల్ల మానసిక శాంతి కలుగుతుందని అనుభవజ్ఞుల మాట. ఆ గ్రంథాల పఠనం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. చక్కని భాష వస్తుంది. పౌరాణిక, ఇతిహాస కథలు కంఠస్థమవుతాయి. ఉమ్మడి పారాయణం ఐక్యభావాలకు మూలమవుతుంది.
సృష్టిలోని శాశ్వత సత్యాల్ని తరచుగా గుర్తుచేసుకోవడానికి పారాయణమే దోహదకారి. పండిత పామరులకు, సాధువులు సాధకులకు, సర్వులకూ ప్రయోజనకరం. అది ఒక నిరంతర సాధన. మనసును భగవంతుడి వైపు మళ్లిస్తుంది. ధ్యానం, యజ్ఞం, అర్చన, జపం, యోగం- అన్నీ సాధనకు ఉపయోగపడతాయి.
ఏ పనినైనా చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, చూసి సంతోషించేవాడు- అందరూ ఫలితం రీత్యా భాగస్థులవుతారు. అవి లౌకిక, అలౌకిక ఫలితాలని రెండు విధాలుగా ఉంటాయి. భగవద్గీత, సహస్ర నామ పారాయణం వంటివి అమృత తుల్యాలు. అందుకే వాటిని గీతామృతం, నామామృతం అని పిలుస్తారు. ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. దాన్ని రావణాసురుడితో యుద్ధానికి దిగేముందు రాముడు పఠించడమే ఉత్తమ ఫలితమిచ్చిందంటారు.
స్తోత్రాల్ని ఆత్మవిశ్వాసంతో పఠించాలి. భగవద్గీతను రోజూ భక్తితో పారాయణ చేయడం, జీవితంలో ప్రశాంతతకు కారణమవుతుంది. భాగవతాన్ని మించిన మానసిక ఔషధం లేదంటారు విజ్ఞులు. భాగవతం అంటే- కేవలం కృష్ణుడి కథలు కావు. మహాభక్తుల చరిత్రలెన్నో అందులో ఉన్నాయి. వాటిని పఠించడం స్ఫూర్తిదాయకం.
ఆరాధ్య దైవాలకు ఉన్నంత శక్తి మహాభక్తులకూ ఉంటుంది. ఆంజనేయుడు రామభక్తుడు. ‘మీ అభిమతాలు నేనూ తీరుస్తాను’ అని రామభక్తులతో ఆయన పలు సందర్భాల్లో అంటాడు. ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు వంటి భక్తుల చరితలు ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అందుకే అవి నిత్యపారాయణ గ్రంథాలుగా నిలిచి ఉన్నాయి. పారాయణం చేసే భారతీయుల్లో, అందులోనూ తెలుగువారిలో అనేక ప్రగాఢ విశ్వాసాలున్నాయి. రుక్మిణీ కల్యాణం, శ్రీకృష్ణ జనన ఘట్టం, అంబరీష ఉపాఖ్యానం, విరాటపర్వ పారాయణాలే వీటికి ఉదాహరణలు. రామాయణంలోని సుందర కాండ, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర స్తోత్రం, విష్ణు-పార్వతీదేవి సహస్ర నామాలు, శివ పంచాక్షరి-నారాయణ మంత్రం పఠనాలూ భక్తుల నమ్మకాలకు ప్రతీకలు.
నరమూర్తిని కీర్తించే బదులు హరిమూర్తిని స్తుతించడం ఎంతో మేలు అంటారు. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరంలో అర్చన కారణంగా భక్తులు కృతకృత్యులయ్యారు. కలియుగంలో నామ సంకీర్తనమూ అదే ఫలితమిస్తుందని విశ్వాసం. భగవంతుడి నామస్మరణతో మానవుడు భవసాగరం దాటగలడన్నదే పురాణగాథల సారాంశం!
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావుఅంతర్యామి మహోన్నతం ‘ఆ ప్రఫుల్ల సుందర వదనం... మబ్బు దొంతరల్లో మిరుమిట్లు గొలిపే మెరుపు తీగ’ అంటూ అరబ్బీ కవి హజ్లీ రాసిన కవిత- ప్రవక్త మొహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లమ్‌కు చక్కగా సరిపోతుందని హజ్రత ఆయెషా (రజి॥) అభివర్ణించారు. ప్రవక్త రూపురేఖల గురించి స్పష్టమైన పటం కాని, దృశ్యం కాని మన ముందు లేదు. ఎలాంటి చిత్రమూ రేఖామాత్రంగానైనా ఎవరి వద్దా లేదు. స్వయంగా ప్రవక్త (స.అ.వ.) ప్రజల్ని చిత్రపటాల నుంచి దూరంగా ఉంచారు. ఏ కల్పనా చిత్రాలూ ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించలేకపోయాయి. అసాధారణ వ్యక్తిత్వం కలిగినవారు నవ నాగరికత నిర్మాతలు. వారి ప్రత్యేకమైన ఆలోచనలు ప్రపంచంలో ప్రభావవంతమైన పరిణామాలకు కారణమవుతాయి. అటువంటి సాటిలేని ఆధ్యాత్మిక విప్లవ సారథి, కారుణ్య కిరణమైన ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) సుందర విగ్రహం- ఆయన సందేశ సరళి, సాధించిన మహోన్నత విజయాల అద్దంలో మనకు కనిపిస్తుంది. ప్రవక్త సహచరులు ఆయన ముఖ వర్చస్సు, శరీర కాంతి, మాటతీరును వర్ణించారు. ముఖారవిందాన్ని అభివర్ణించి తరవాతి తరాలవారి కోసం భద్రపరచారు. మొహమ్మద్‌ (స.అ.వ.) వాక్చాతుర్యం, వివేచన, వినయం, సహనశీలత వంటి గుణగణాలతో గాంభీర్యంగా ప్రకాశించేవారు. ‘దైవభీతి మాత్రమే ముఖాల్ని ప్రకాశవంతం చేస్తుంది’ అని మొహమ్మద్‌ (స.అ.వ.) ప్రకటించారు. దైవ విశ్వాసులు మహాతేజస్సు కలిగి ఉండటం సహజమే. ఆయన ఆభరణాలకు అలంకరణలకు దూరంగా దైవదాసుడిగా వస్త్రధారణ చేసేవారు. సువాసనల్ని ఇష్టపడుతూ, ఎవరైనా ఆ ద్రవ్యాల్ని కానుకగా ఇస్తే సంతోషంగా స్వీకరించేవారు. ప్రవక్త తన జీవితాంతం అర్ధరాత్రి తరవాత లేచి ‘వుజూ’ చేసుకొనేవారు. ‘తహజ్జుద్‌’ నమాజు చేసేవారు. దివ్య ఖుర్‌ఆన్‌ను పఠించేవారు. ఒక్కోసారి ఆయన ప్రార్థనల్లోనే నిలబడినప్పుడు, కాళ్లు వాచిపోయేవి. ‘మీరు ఇంతగా శరీరాన్ని కష్టపెట్టాలా, అల్లాహ్‌ మీకు క్షమాభిక్ష హామీ ఇచ్చాడు కదా’ అని సహచరులు అడిగినప్పుడు ‘నేను కృతజ్ఞుడినైన దాసుడిగా ఉండవద్దా’ అనేవారు. మెత్తటి పడకపై నిద్రిస్తే ప్రార్థనకు లేవలేనని భావించి, నారతాళ్లు పేనిన మంచాలపై పడుకొనేవారు. ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించలేని వ్యక్తి, వారినుంచి వాటిని ఆశించరాదని చెబుతుండేవారు. దుఃఖసమయాల్లో ‘మాకు అల్లాహ్‌ చాలు. ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు’ అని ప్రవక్త పలికేవారు. సున్నిత మనస్కులైన ఆయన కఠిన పరిస్థితుల్లో మొక్కవోని సహనాన్ని, చిత్తాన్ని ప్రదర్శించేవారు. ఇది గొప్పవారికి మాత్రమే సాధ్యం. ప్రవక్త (స.అ.వ.)కు కవిత్వం పట్ల అభిరుచి ఉండేది. భిన్నశైలిలో ఆయన కవిత్వం సాగేది. యుద్ధరంగంలోనూ కవితాత్మకంగా మాట్లాడేవారు. శత్రువులపై కరవాలం కంటే కవిత్వం చాలా ప్రభావం చూపుతుందనేవారు. హజ్రత ఆయెషా (రజి) ప్రస్తావించిన ప్రకారం- ఆయన నడవడి, పద్ధతి అంతా దివ్య ఖుర్‌ఆన్‌. అల్లాహ్‌ అనుగ్రహ విధానాల్ని పాటించడమే కర్తవ్యంగా భావించేవారు. హిజ్రీ శకం 11వ సంవత్సరం సఫర్‌ మాసంలో ప్రవక్త ఆరోగ్యం క్షీణించింది. ‘అన్ని వ్యవహారాల్నీ దేవుడి ఆదేశంతో నిర్వహిస్తుంటారు. ఏదైనా ఆలస్యం జరిగినా తొందర పడవద్దు. ఈ లోకంలో ఎవరూ శాశ్వతంగా జీవించి ఉండటం జరగదు. నేను మీకన్నా ముందు వెళుతున్నాను. మీరు కూడా వచ్చి నాతో కలుస్తారు. మనం స్వర్గలోకంలోని కౌసర్‌ సరస్సు వద్ద కలుద్దాం’ అంటూ సహచరులకు అంతిమ సందేశమిచ్చారు. ఆ మాసంలోని 12వ రోజున అల్లాహ్‌ సాన్నిహిత్యానికి తరలివెళ్లారు. తీవ్రమైన వేధింపుల్ని భరించిన వ్యక్తి ఆయన. అన్నివిధాలైన కష్టనష్టాల్నీ ఎదుర్కొన్నారు. వివిధ తెగల మధ్య అంతర్గత పాలన వ్యవస్థను పటిష్ఠపరచిన మహోన్నతుడు. ఆయన సాధించిన ఘనకార్యాలు అనేకం. ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించలేదు. మానవాళిని సురక్షితమైన ఇస్లాం రుజుమార్గాన నడిపే ప్రయత్నంలో సమస్తాన్నీ త్యాగం చేశారు. ఆ మహాపురుషుడికి ఏ పరిహారం చెల్లించినా సరిపోదు. మొహమ్మద్‌ ప్రవక్త (స.అ.వ.) ఆత్మపై కారుణ్యాన్ని వర్షించాలని అల్లాహ్‌ను ప్రార్థిద్దాం. ఆమీన్‌. - షేక్‌ బషీరున్నీసా బేగం

No comments: