Wednesday, November 1, 2017

అంతర్యామి_ ప్రార్థన


అంతర్యామి ప్రార్థన ప్రార్థన అనేది శ్వాస తీసుకోవడం వంటిది. అది ఆగితే, ఆధ్యాత్మికంగా బతుకు ఉండదు. మానవ ప్రార్థన దైవ సంబంధంగా ఉంటే, అదొక అపురూప బంధం. ఆ అనుబంధం బలపడినప్పుడు శక్తి, ప్రేమ, కరుణ, మంచితనంతో జీవించడం సాధ్యపడుతుంది. అంతరంగాన్ని శుభ్రపరచుకోవడం మనిషికి తేలికవుతుంది. దైవప్రార్థన అంటే, కోరికల చిట్టాను ఆయన ముందు ఉంచడం కాదు. భగవంతుడితో శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రక్రియ- ప్రార్థన. స్వార్థం, గర్వం వంటి వ్యతిరేక భావనలు కలిగి ఉండి, ఎందరు ఎన్ని ప్రార్థనలు చేసినా- నిష్ప్రయోజకం. సద్గుణాలు అలవరచుకోనంతవరకు, ఏ వ్యక్తీ శక్తిమంతుడు కాలేడు. మహానుభావుల ప్రార్థనలు ఫలప్రదం కావడానికి, వారి గుణసంపదే మూలకారణం. నిస్వార్థమైన ప్రార్థనలో ప్రధానంగా భగవన్నామ స్మరణ ఉంటుంది. తోటివారికి తోడ్పాటు అందించే లక్షణమూ నెలకొంటుంది. ఆ తరవాతే భక్తుడికి కావాల్సినవి చోటుచేసుకుంటాయి. అదీ అతడి తృప్తి కోసం! ప్రార్థనకు సైతం ధర్మశాస్త్రమే ఆధారం. మనిషి ఒంటరివాడు కాదన్న ధైర్యమిచ్చేది ప్రార్థనే. అది ఈత వంటిది. అభ్యాసం వల్ల అలవడుతుంది. కొందరు అన్ని పద్ధతుల్నీ అభ్యసించి, ప్రతిభ కనబరుస్తారు. అలా అని, ఆశించిన ఫలితం దక్కలేదంటూ ఎవరూ తొలి ప్రయత్నాలతోనే ఈత నుంచి నిష్క్రమించకూడదు. అందరికీ అవసరమైనది క్రమశిక్షణ. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక శిక్షణ. దానికి ఆత్మనిగ్రహం అవసరమవుతుంది. దేహాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ప్రార్థన ద్వారా భగవత్‌ సేవకు ఉపయోగించాలి. అందుకు వాక్సుద్ధి, ధ్యానం దోహదపడతాయి. సామూహిక, వ్యక్తిగత ప్రార్థనల మధ్య సమతౌల్యమంటూ ఉండాలి. ఉమ్మడిగా చేసే ప్రార్థనల వల్ల అహం, స్వార్థం వంటివి దూరమవుతాయి. మనిషిలో ఎదుగుదల సాధ్యమవుతుంది. పవిత్ర గ్రంథాల పఠనం అతడికి ఎంతో మేలు చేస్తుంది. తోటివారి పట్ల ఆదరభావాన్ని కలిగిస్తుంది. ప్రార్థనలో నిమగ్నమైన వ్యక్తి మనసునిండా సద్భావనలు వెల్లివిరుస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలతో పవిత్రత చోటుచేసుకుంటుంది. ‘భగవంతుడు సర్వాంతర్యామి’ అంటాయి పురాణాలు. భక్తుడు ప్రార్థన చేసే చోటు ఓ పవిత్ర నిలయం. అతడికి భాషతో నిమిత్తం లేదు. భావమే ప్రధానం. మౌనంగానూ దైవప్రార్థన చేయవచ్చు. ‘ఎవరు ఏ ప్రార్థన చేసినా అది హృదయపూర్వకంగా ఉండాలి’ అని మహాత్మాగాంధీ అనేవారు. వ్యక్తి ఆలోచనలో స్వచ్ఛత, మాటల్లోని నిజాయతీ- అతడు చేసే ప్రార్థనలో ప్రతిఫలిస్తాయి. భక్తుడు పెదవుల కదలికల కంటే, హృదయ స్పందనతోనే భగవంతుడికి దగ్గర కావాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడే, అది సాధ్యపడుతుంది. ‘మనిషి బాధల్లో ఉన్నప్పుడే భగవంతుణ్ని ప్రార్థిస్తాడు. సంతోష సమయంలో దైవం గుర్తుకు రాడు. అన్నివేళల్లో గుర్తుచేసుకోగలిగితే, కష్టం అనే మాటే ఉండదు’ అని భక్త కబీరు ఉద్బోధించారు. ప్రార్థన వల్ల కష్టాలన్నీ అంతరిస్తాయని ఎవరూ అనరు. వాటిని ధైర్యంగా ఎదుర్కోగల శక్తి మాత్రం, మనిషికి ప్రార్థన వల్ల లభిస్తుంది. అనుకోని పరిస్థితి లేదా సహనానికి పరీక్ష ఎదురైనప్పుడు, ప్రార్థనే అతడి పాలిట సంజీవనిలా పనిచేస్తుంది. ఆశావహ దృక్పథం కలిగించి, మానసికంగా కుంగిపోకుండా చేసి, వ్యక్తిని నిలబెడుతుంది. ఎన్ని కష్టనష్టాలు చుట్టుముట్టినా చలించని తత్వాన్ని ప్రార్థనే ప్రసాదిస్తుంది. గాయాలు మాన్పగల అద్భుత శక్తి ప్రార్థనకే ఉంది. ప్రశాంతమైన మనసు వల్ల, ప్రార్థించేవారితో పాటు చుట్టుపక్కల ఉన్నవారిలోనూ పవిత్ర భావాలు వెల్లివిరుస్తాయి. ఆలోచనల ప్రభావం మనిషి మీద ఎంతో ఉంటుంది. అతడు శాంతి కోసం ప్రార్థిస్తే, వాతావరణంలోనూ అదే గోచరిస్తుంది. సదాలోచన చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతారు. ఆలోచనలో అంత శక్తి దాగి ఉంది. అదే శక్తి అతడి ప్రార్థనలోనూ వ్యక్తమవుతుంటుంది! - మంత్రవాది మహేశ్వర్‌

No comments: