Tuesday, February 3, 2015

ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం

ఆధ్యాత్మికం,ఆహ్లాదం,అడ్వెంచర్‌ చెర్వుగట్టు క్షేత్రం

Updated : 1/29/2015 12:24:41 PM
Views : 599

NkpChervugattuStory01


మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగానే మైకుల నుంచి శివ-పార్వతుల స్తోత్రాలు చెవులను చేరుతున్నాయి. నార్కట్‌పల్లికి సమీపంలో యల్లారెడ్డిగూడెం వద్ద అద్దంకి హైవేను దాటి ముందుకు సాగుతోంది మా ప్రయాణం. పార్వతీ సమేత జడల రామలింగేశ్వరుడు కొలువైన చెర్వుగట్టు క్షేత్రమే మా గమ్యం. శివాలయమే కావచ్చు.. కానీ ఆధ్యాత్మికతను మించిన ఆహ్లాదాన్నీ, అడ్వెంచర్‌నూ అక్కడ రుచి చూడవచ్చు.

బ్రహ్మోత్సవాల వేళ కిక్కిరిసిన జన సందోహం నడుమ గుట్ట పైకి మెట్ల మార్గంలో వెళ్లినా.. ఫీట్లు పడుతూ ఘాట్ రోడ్డులో పయనించినా.. ఆ థ్రిల్ అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఇక పైనున్నంత సేపూ కలిగే ప్రత్యేక అనుభూతి.. మూడు గుండ్ల ముచ్చట.. కోనేటి స్నానం.. కొత్తగా కట్టిన కల్యాణ మండపం.. వాటిని మించి రామలింగేశ్వరుడి దర్శనం ఇలా ప్రతిదీ వర్ణనకు కొత్తగా మాటల మూటలను చేర్చే అంశమే.

నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు.. ఇక్కడ నిత్యం జన సందోహమే.. ఇక జాతర సమయంలో అయితే.. ఇసుకేస్తే అన్న చందంగా గుట్ట నిండా జన జాతరే. స్వాగత తోరణం నుంచే జాతర సంబురం కళ్లల్లో నింపుకున్న భక్తుల సందడి కనిపిస్తున్నది. వరుసగా కొలువుదీరిన జాతర కొట్లు చెర్వుగట్టుకు పండుగ శోభను మోసుకొచ్చాయి. దుకాణాల మధ్య కాలు దూర సందు లేని రీతిలో జనం సందడి.. మొక్కు కోడెలను పట్టుకెళ్లే భక్తుల హడావిడి.. ఒక్కటేమిటి కళ్లతో ఆరగించే మనసుండాలే కానీ కంటితోపాటు చెవులకూ ఇంపైన కొత్త సందడి బోలెడంత దొరుకుతుంది అక్కడ.

చెర్వుగట్టు గుట్ట కింది గాలిగోపురం నుంచి పైకెళ్లే మెట్ల మార్గం ప్రారంభమైంది. సుమారు వెయ్యి ఉండే రాతి మెట్ల మీద పైకి వేసే ఒక్కో అడుగు.. కింద కిక్కిరిసిన జన సందోహం, దూరంగా నిలిపిన వేలాది వాహనాలు.. వాటిని దాటి చూస్తే చుట్టూ పరుచుకున్న పొలాలు, ఫ్యాక్టరీలు, స్టేట్ హైవే, అటూ ఇటుగా ఉన్న అసంపూర్ణ వెంచర్లు.. అనేకాంశాలు కళ్లకు చేరువవుతాయి. కానీ.. జాతర సమయంలో మెట్ల మార్గం నుంచి గుట్ట పైకి వెళ్లాలంటే జనం మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఊపిరి సలపని పరిస్థితులు పదులసార్లు ఎదుర్కోవాల్సిందే. ఒకే దారిలో పైకి వెళ్లే వాళ్లు.. దిగువకు వచ్చే వాళ్లు కోకొల్లలుగా కనిపిస్తున్నారక్కడ. ఆ జనసందోహాన్ని చూసి మెట్ల మార్గంలో వెళ్లేందుకు జడిసింది మా బృందం. అందుకే ఘాట్ రోడ్డు మీదుగా గుట్ట పైకి చేరుకున్నాం. వెళ్తుంటే ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతున్నా కొద్ది కవ్వించే అందాలు కోకొల్లలు.

కొత్తగా సుమారు రూ. 2 కోట్లతో ప్రారంభించుకున్న కళ్యాణ మండపం కన్నులను కట్టి పడేస్తుంటే ఆ అందాలను దాటుకుని పక్కనే ఉన్న కోనేరు వైపు పడ్డాయి మా అడుగులు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తలోకం అక్కడ స్నానమాచరిస్తూ శివ నామస్మరణతో భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. కాళ్లు కడిగి దర్శనార్థం బయల్దేరాం. వేలాదిగా బారులు తీరిన భక్తుల నడుమ రెండు గంటల ప్రయాస తర్వాత కానీ శివయ్య దర్శనం కలగలేదు.

NkpChervugattu02


గుట్ట పై నుంచి చూస్తుంటే అబ్బుర పరిచే అందాలన్నింటినీ కళ్లల్లో మూటగట్టుకుని మరింత పైపైకి వెళ్తున్నాం. మూడు గుండ్లుగా చెప్పుకునే ముచ్చటైన థ్రిల్ జర్నీ కోసం గతంలో అనుభవమున్నవాళ్లంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తల ఒక్కింటికి రూ. 10 టిక్కెట్ తీసుకుని మూడుగుండ్ల పైన కొలువైన ప్రత్యేక శివలింగం దర్శనం కోసం బయల్దేరాం. ఇరుకైన బండరాళ్ల సందుల్లోంచి.. రాతి బండల మధ్య ఏర్పరిచిన ఇనుప మెట్ల మీదుగా వెళ్లాలి. మరీ దగ్గరగా ఉండడంతో భయం.. మనసులో కాసింత ఆందోళన.. కానీ అందరూ ఉన్నారులే అన్న అభయం.. అన్నీ కలుపుకొని ముందుకు సాగాం.

రెండు గుళ్లు దాటి మూడో గుండు ఎక్కే దగ్గర మొదలైంది అసలైన ట్విస్ట్. తొలిసారిగా వచ్చిన వాళ్లు కళలో కూడా ఊహించలేదు ఆ ఇరుకైన సంధును. రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య కేవలం 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న ప్రాంతం గుండా సుమారు 5 మీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండడమే ఈ జర్నీలో అసలైన కొసమెరుపు. ఎత్తు, లావులతో అస్సలే సంబంధం లేదు. దేవుడిపై భారం మోపుతూ ఓం నమశ్శివాయ అంటూ ముందుకు సాగితే.. ఎంతటి భారీ ఆకారమైనా సులువుగా బండరాళ్లను దాటుతుంది అనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

బృందంలోని నలుగురు అతి కష్టం మీద అంగీ గుండీలు ఊడదీసుకుని మరీ ఒడ్డుకు చేరారు. మరో నలుగురు మాత్రం ప్రత్యామ్నాయ మార్గంలో మూడో గుండు పైనున్న శివలింగాన్ని దర్శించుకున్నారు. చెప్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచే దైవ దర్శనం పక్కన పెడితే.. చెర్వుగట్టు క్షేత్రంలో వేసే ప్రతీ అడుగూ ఆశ్చర్యార్థకమే. ఇప్పటికే పలుమార్లు దర్శించినా సరికొత్త అనుభూతితో.. కొత్తగా వచ్చిన వాళ్లు కొంగొత్త అనుభవంతో తిరుగుపయనమయ్యాం. మొత్తంగా పరిశీలించినపుడు.. గతంతో పోలిస్తే మెరుగుపడిన అంశాలు ఈసారి గుట్టలో అనేకానేకం ఉండడమే ప్రత్యేకాంశం.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular