Thursday, February 26, 2015

మంచి మేలు తలపెట్టాలి

మంచి మేలు తలపెట్టాలి
Posted On:2/26/2015 1:49:27 AM
సూర్యోదయంతో మొదలైన రోజు చంద్రోదయంతో ముగుస్తూ అనేక అనుభవాలనూ, జ్ఞాపకాలనూ జీవితఖాతాలో చేరుస్తుంది. గొప్పగా బతకాలి, ఏదో చేయాలి అనే తపన ప్రతీ ఒక్కరిలో గంభీరమై నిగూఢమై ఉంటుంది. కానీ జీవన పోరాటంలో సమయం అలా గడిచిపోతూ మంచి ఆలోచనలకు తావివ్వదు. మనిషి తలుచుకుంటే ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు. అనుకోకుండానే మహాత్ములు చేసిన మంచి అనేదే దానికి ఆలంబన.
నిసర్గాదారామే తరుకుల సమారోపసుకృతీ
కృతీ మాలాకారో బకులమపి కుత్రాపి నిదధే
ఇదం కో జానీతే యదహ మిహ కోణాంతరగతో
జగజ్జాలం కర్తా కుసుమభర సౌరభ్యభరితమ్ ॥
అందమైన ఉద్యానవనంలో మొక్కలు నాటే మంచిపనిని చేస్తుండే తోటమాలి అలవాటుగా ఓ మూలన పొగడచెట్టును కూడా నాటుతాడు. అనుకోకుండా ఒక చోటులో పాతిన ఆ చెట్టు తన పుష్పాల పరిమళంలో పరిసర ప్రాంతమంతా పరిమళభరితం చేస్తుందని అతననుకోలేదు. ప్రపంచం చాలా అందమైన అద్భుతం. అందులో భగవంతుడు చేసిన మంచి అపారం. దానిని అందిపుచ్చుకొని సుహృదాలోచనతో జీవించడమే మన బాధ్యత. ఎవరో ఎక్కడో చేసిన మంచికి ఫలాన్ని మనం అనుభవిస్తూ కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాన్ని మనస్ఫూర్తిగా మనస్సులోనే సమర్పించుకోగలం. మరి ప్రతిఫలాన్ని అందజేయలేమా! మనసుంటే మార్గముంటుంది. మనం చేసిన మంచి నేడు అనుభవించకపోవచ్చు. భావితరాలు దాని ఫలాన్ని అనుభవిస్తే చేసిన దానికి సార్థకత చేకూరినట్లే.

అనేక కట్టడాలు శ్రమకోర్చి, వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన మహా మహులు నేడు లేరు. కానీ వారి జ్ఞాపకాలుగా చరిత్రకు వన్నె తెచ్చిన నిర్మాణాలు కోకొల్లలు. సంప్రదాయాలను మొదలుపెట్టిన పూర్వీకులు నేటి సమాజానికి మార్గదర్శకులు. వాటిని పాటించడమే కర్తవ్యం. మంచిని పంచిన వారెన్నడూ మేమిది చేశామని చెప్పుకోలేదు. వారు చేసినదే తరతరాలూ అనుభవిస్తూ వచ్చాయి. భగవంతుడు ప్రతీచోటా ప్రత్యక్షంగా మనకు సాయపడలేడు. సర్వాంతర్యామియైన ఆయన ఏదో రూపంలో వచ్చి తన సహకారాన్నందిస్తూనే ఉంటాడు. మంచి అంటే లోకాలను ఉద్ధరించడమని కాదు. ముసలితనంలో చేతికర్ర సహాయంతో నడుస్తున్న వ్యక్తి చేతిలోని కర్రజారితే, దారిన పోయే పసిపిల్లాడు ఏ సంబంధం లేకుండా అందించడం కన్నా మించిన మంచేముంటుంది? లాభనష్టాలకతీతమైన సుహృద్భావన, ఆలోచన, మంచితనం, మనసా వాచా కర్మణా మనిషి చేయగల మహత్కార్యం. మంచిని పంచగల ఔన్నత్యం.

No comments: