Monday, February 16, 2015

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?
Courtesy: Praveen Goud goudp68@yahoo.com
గీతాజయంతి నాడు దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా భగవద్గీతను గురించి మారుమ్రోగి పోతూంటుంది. ఇన్ని పత్రికలు, 24గంటలూ పనిచేసే శతాధిక T.V.చానెళ్ళూ వచ్చాక, విషయబాహుళ్యం బాగా పెరిగింది.
ఏది ఎంతవరకు గ్రహించాలో, ఎట్లా ఉపయోగించుకోవాలో (ఆచరణలో పెట్టుకోవాలో) దిక్కుతోచనంత విశాల విషయ ప్రసారమే ఈనాటి అసలు సమస్య !
ఉదాహరణకు: గణితశాస్త్రమనేది, 1వ తరగతి విద్యార్థినుండి Ph.D.స్థాయి, ఆపైన Original Scientist (Mathematician)స్థాయి వరకు అందరికీ ఉపయోగపడేదే. అలాగని, 3వ తరగతి చదివే మన పిల్లలకు పేపర్లు, T.V.లలో చూపించే విచిత్ర, కాలక్షేప, ఆసక్తికర Maths Prograammes అన్నీ పనికి రావు గదా !
అదేవిధంగా భగవద్గీతా శాస్త్రం కూడా. మన పిల్లలకు ( ఆధ్యాత్మికంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న పెద్దలు కూడా పిల్లలతో సమానమే – వారుకూడ అధ్యాత్మికతా ప్రారంభ బాలశిక్ష నేర్చుకోవాల్సిందే కాబట్టి ) మొదటిమెట్టుగా ఉపయోగపడే గీతాంశాలను గూర్చి స్థూలంగా చర్చించుకుందాం !
౧. భారతీయుల ప్రతిగృహంలోనూ ఉండవలసిన గ్రంథం భగవద్గీత ! “ఎవరు చదువుతారులే” అనే మీమాంసకు తావు ఇవ్వకుండా, ఆ పుస్తకం కొనటం, ఇంట్లో రోజూ కంటబడేచోట ఉంచటంకూడ, మన జాతీయ, సాంస్కృతిక స్వాభిమానానికి (Self-Respect)కి మొట్టమొదటి చిహ్నం అనే స్పృహను పెంచుకోవాలి.
౨. గీతలో 17వ అధ్యాయం (శ్రద్ధాత్రయ విభాగ యోగః) బాలశిక్షకు ప్రారంభం. మానవులను గుణాలనుబట్టి ఉత్తమ – మధ్యమ – అధమ అనే మూడు రకాలుగా విభజించి చూపాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు అని తెలిపాడు జగద్గురు వ్యాసమహర్షి !
౩. అవి సాత్త్విక, రాజసిక, తామసిక గుణాలు. అందరిలోనూ కూడా మూడు గుణాలూ కలిసే ఉంటాయి – వేరు వేరు పాళ్ళలో.
౪. ఏయే గుణాలు కలవారు ఏయే పనులను ఏయే దృక్పథంతో ఏయే విధంగా చేస్తారో ఈ 17వ అధ్యాయంలో చెప్పబడింది. పనులు చేసేటప్పుడు – మన దృక్పథం (Outlook), ఉద్దేశము (Motive), పద్ధతి (Method)లను బట్టి, మన స్థాయి (సత్త్వ, రజస్, తమస్సులలో) ఎక్కడ ఉందో మనమే తెలుసుకోగల Ready Reckoner ఇది !
౫. భారతీయుల సంస్కృతికి ముఖ్యాంశాలైన ఐదింటిని గూర్చి ఈ విభాగం చేశారు. 1.దేవపూజ, 2.ఆహారం, 3.యజ్ఞం (=సరియైన మేఘాలను సృష్టించటంద్వారా ప్రకృతి శక్తుల సంతులనం), 4.తపస్సు (=ఏకాగ్ర మనస్సుతో అభీష్ట విషయ నిరంతర పరిశోధన); 5.దానం ( ఐచ్ఛికంగా సంపద వికేంద్రీకరణా విధానం; Have-Nots కి Haves మానవతా దృష్టితో సహాయమందించే అద్భుత వ్యవస్థ) – ఈ అయిదు అంశాలను సాత్త్విక రాజసిక తామసిక పదతులుగా విభజించారు.
౬. వీటిలో మరీ ముఖ్యమైనవి – అంటే మొదట తెలుసుకోవలసినవి – ఆహారం, తపస్సు ( మానసిక తపస్సు, వాచిక తపస్సు, శారీరిక తపస్సు ), దైవపూజావిధానం.
కాబట్టి ప్రాథమిక విద్యార్థి దశలోనున్న మన పిల్లలకు మనం నేర్పవలసినది – ఈ 17వ అధ్యాయపు ఒక్కో శ్లోకం చదివి వినిపించటం, డాని తాత్పర్యాన్ని క్లుప్తంగా పుస్తకంలోనున్నదానిని చదివి వినిపించటం, మనకున్న లోకానుభవంతో – ఆ విషయం ఈనాటి పరిస్థితులలో ఎట్లా అన్వయించుకోవాలో వివరించటం ! వారిలో ఈ విషయాలపై ఆదరణాభావం కలిగించటం, ఆచరణాత్మక దృష్టిని రగిలించటం – ఇంతే మనం చేయవలసినది. మిగిలింది పైవాడూ వాళ్ళే చూసుకుంటారు !
ప్రతివారూ ఇప్పుడున్న మెట్టుమీద (స్థితి) నుంచి ఒక్కమెట్టు పైకిఎక్కినా, పురోగతి చెందినట్లే గదా ! లక్ష్యానికి దగ్గరౌతున్నట్లే గదా ! దానికి భగవద్గీత చేసే సాయం ఇంతా అంతా కాదు !

No comments: