Monday, January 26, 2015

పాలమూరు విదుషీమణి


పాలమూరు విదుషీమణి
Updated : 1/26/2015 12:51:13 AM
Views : 15
పాలమూరు కవయిత్రుల్లో వయోధికురాలు గానే కాక కవితా శేముషిలో కూడా ప్రథమ గణ్యురాలు జొన్నవాడ రాఘవమ్మ. కేశవరాయుని పల్లెలో శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో జినకుంట శ్రీనివాసాచార్యులు, రాగమ్మల పుణ్యఫలంగా జన్మించిన ఆమె చిన్నప్పట్నుంచీ భాగవతాది పురాణాలు జీర్ణించుకొని శ్రీకృష్ణునే ఆరాధ్యదైవంగా భావిస్తూ మధురభక్తిపూరితమైన పాటలు రచించింది.

భర్త జొన్నవాడ వేదాంతాచార్యులు ఆమె సాహిత్యాభిరుచికి దోహదం చేశారు. ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన ఆమె గేయాలు శ్రోతలను అలరించాయి. మన జిల్లా ప్రముఖ గాయకుడు ఎం.వెంకటగోపాలం మధురమైన బాణీలతో వాటికి ప్రచారంతో పాటు గ్రంథరూపంలో ప్రకాశానికి కూడా పాటుపడ్డారు. సంగీతకళలో ప్రవేశం గల ఆమె కుమార్తెలు కూడా వాటిని వ్యాప్తికి తెచ్చారు.
48 రాధికా గీతాల తొలిగ్రంథం ఆవిష్కరణ జ్యోతిర్మయి సాహిత్య సమితి సప్తమ వార్షికోత్సవం (12-11-1972) సందర్భంగా జరిగింది. భవానీ భక్తవత్సలం అధ్యక్షతలో జరిగిన ఈ సభలో జె.బాపురెడ్డి కావ్యావిష్కరణ చేశారు.

ఆకాశవాణి సంగీత విధ్వాంసులు పాలగుమ్మి విశ్వనాథం, కేశవపంతుల నరసింహశాస్త్రి, శశాంక, ఇరివెంటి కృష్ణమూర్తి, జ్యోతిర్మయి అధ్యక్ష కార్యదర్శులైన ఎస్వీ రామారావు చౌడూరి గోపాలరావు వక్తలుగా పాల్గొని గీతాలను ప్రస్తుతించారు. వెంకటగోపాలం నిర్వహణలో గాయనీ గాయకులు గీతాలాపన చేశారు. గేయరచనాకళను ముందుకు సాగిస్తూ రాఘవమ్మగారు మూడు దశాబ్దాల తర్వాత 105 గీతాలతో కూడిన విస్తృత ముద్రణను (27-7-2006) వెలువరించటం అభినందనీయం.

రాధాగోపికలతో మమేకమై రాగయుక్తంగా వెలువరించిన రాధికాగీతాలు మధురభక్తియుతములై పోతన్న భాగవత పద్యాలను, గోదాదేవి పాశురాలను తలపుకు తెస్తాయి. సుందర బృందావన అందాలు, గోపాలుని మంజుల మురళీ నాదాలూ వీనిలో ప్రత్యక్షమవుతాయి. నీదు పదములే పావనం, నీదు నామకమే జీవనం అంటూ సంగీతసాహిత్య రసభరితములైన రాధికాగీతాలను కృష్ణునికే అంకితం చేసిన ధన్యురాలు రాఘవమ్మ గారు.

రాధికాగీతాల తర్వాత 86 ఏళ్ల వయసులో ఇటీవల మరో లలిత గేయ సంపుటిని భావతరంగాలు పేరుతో (2014) ప్రచురించటం ముదావహం. ఇందటి నూట పదకొండు గేయాలలో సగభాగం దేశభక్తియుతమైనవి కాగా, మిగతా సగం మధురభక్తి పరమైనవి. ఆకాశవాణిలో ఈ మాసపుపాట, ఈ పాటను నేర్చుకొందాం వంటి ప్రసార కార్యక్రమాల్లోనూ, తెలుగు విశ్వవిద్యాలయం లలిత సంగీతం డిప్లొమా పాఠ్యాంశాల్లోనూ రాఘవమ్మ గీతాలకు అవకాశం కల్పించిన ప్రముఖ సంగీత విధ్వాంసులు మహాభాష్యం చిత్తరంజన్ గారి ప్రోత్సాహం స్మరణీయం. ఆయనతో పాటు ఎం.పద్మినీదేవి, ప్రొఫెసర్ సుదర్శన్‌సింగ్ ఈ సంపుటికి ప్రశంసాత్మక పీఠికలు సమకూర్చారు. దేశభక్తి, దైవస్తుతి, ప్రకృతి సౌందర్యచిత్రణ, సామాజిక దురన్యాయాల నిరసన ఈ సంపుటిలోని వస్తువైవిద్యానికి నిదర్శనాలు.

ఎవరు పెంచిన కల్పతరులివి
ఎవరు తీర్చిన సోయగము వివి
ఎచట చూచిన ఊహకందని
అందమే కనువిందు చేసెను, (కల్పతరువులు)
పదవి ఆశకు నిధులు పంచకు
పాలనలో అవినీతి పెంచకు
పల్లెప్రజలను మోసగించకు
పరుల సొమ్ముకు ఆశపడకు, (తెలుగు వాడు)
ఖ్యాతిగాంచిన భారతనారీ
కట్టుబొట్టూ చెరుపుకుని
నగ్నముగ నడీవీధిలో
చిందులేయగ సిద్ధపడినది (భరతమాత కన్నీరు)
వంటి లలితమధురమైన పదశైలిలో ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి రాఘవమ్మ భావతరంగాలు
Key Tags


రచయిత్రి బోన్నవాడ రాఘవమ్మ కన్నుమూత

Updated : 1/6/2015 10:35:36 PM
Views : 55

jonnawada raghvamma passed away


మహబూబ్‌నగర్: ప్రముఖ రచయిత్రి, గాయని బోన్నవాడ రాఘవమ్మ కన్నుమూశారు. ఇవాళ ఆమె జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. రాఘవమ్మ వయస్సు 86 సంవత్సరాలు. ఆమె అనేక దేశభక్తి, జానపద గేయాలు రచించారు. ఆమె రాసిన పాటలతో 2014లో ‘భవ తరంగాలు’ పేరుతో సంకలనం వెలువరించారు. రాఘవమ్మ 2012లో విశాలాంధ్ర సాహితి పురస్కారం, 2013లో పాలమూరు లుంబిని పురస్కారం అందుకున్నారు. 2014లో తెలంగాణ సాహిత్య పురస్కారం లభించింది. రాఘవమ్మ చేసిన సేవలకు గుర్తింపుగా 2009లో హైదరాబాద్ విజయ మ్యూజిక్ అకాడమి వారు ‘శ్రీకృష్ణ పద సుధానిధి’ బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించారు.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular