Friday, December 20, 2013

Atmabalame ayudham

Articles: Philosophy
ఆత్మబలమే ఆయుధం
Mr. Pratap Cherukuri Pratap
  Page: 1 of 1    
ఒకసారి ప్రముఖ వ్యక్తిత్వ వికాస శాస్త్రవేత్త నార్మన్ విన్సెంట్ పీలే వద్దకు ఒక వ్యక్తి వచ్చి 'నా జీవితమంతా సమస్యల వలయం, ఒక సమస్యను పరిష్కరించుకుంటూ ఉంటే మరొకటి సిద్ధంగా ఉంటోంది. జీవితంలో ఆనందం అంతా ఆవిరైపోతోంది. హాయిగా, ఏ సమస్యా లేకుండా సుఖంగా జీవిద్దామంటే అవకాశం ఉండడంలేదు. ఏ సమస్యలూ దరిచేరని ప్రదేశం ఎక్కడ ఉందో చెబితే అక్కడికి, ఈ ఇల్లు, ఇల్లాలు, సంసారం విడిచి వెళిపోతాను' అని అడిగాడు.

అవశ్యం! అని పీలే ఆ వ్యక్తిని ఒక శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడి సమాధులను చూపించి జీవితంలో ఏ కష్టాలూ, కన్నీళ్ళూ, అశాంతీ, ఆందోళనలూ లేక జీవించేవారు వీరే. ఒకసారి మనం ఇక్కడకు చేరితే ఇక అన్నీ మరిచి సుఖంగా నిద్రపోవచ్చు అని అన్నాడు. అంతటితో ఆ వ్యక్తికి జ్ఞానోదయం అయింది. బ్రతికి ఉన్నంత కాలం కష్టాలతో సహజీవనం తప్పదన్న గొప్ప సత్యం అవగతమమైంది. జననం నుండి మరణం వరకూ ఏ కష్టమూ ఎదుర్కొనక అనుక్షణం ఆనందంగా గడిపిన వ్యక్తి బహుశా ఈ సృష్టిలో ఇంతవరకూ లేడేమో?
భగవంతుడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కొరకు అనేక అవతారాలు ఎత్తి ఎన్నో కష్టాలు అనుభవించాడు. దేవతలు కూడా అనేక యుగాలలో రాక్షసుల చేత అనేక విధాలుగా బాధలు పడి కొన్ని సంధర్భాలలో దేవలోకం వదిలి వెళ్ళవలసి వచ్చింది.

జీవితమంటేనే సమస్యల వలయం. కష్టాలు, నష్టాలు, అశాంతి, ఆందోళనలు మానవులను అనుక్షణం చుట్టుముడుతునే ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో వీటిని తట్టుకోలేక సాంసారిక జీవితానికి దూరంగా పారిపోవదానికో, ఇంకా పిరికిపందలైతే ఆత్మహత్యలకో ఒడిగడుతుంటారు. కష్టాలు, సుఖాలు అనే ద్వంద్వాలు మానవ జీవితంలో తప్పనిసరి. ఒక దాని వెంట మరొకటి రావడం అనివార్యమని గ్రహించి, ఆశావహ దృక్పథంతో, ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగేవారి సంఖ్య బహుశా తక్కువేనని చెప్పక తప్పదు.

సమస్యలు రకాలు :
మానవులు తమ పూర్వకర్మానుసారం చేసిన పాపకర్మల ఫలితంగా అనేక కష్ట నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. భగవంతునికి సర్వశ్య శరణాగతి చేసి, ఆధ్యాత్మికపథంలో పయనిస్తూ సత్కర్మలు ఆచరిస్తే ఈ సమస్యల వలయం నుండి సులభంగా బయట పడవచ్చు. గత జన్మల కర్మల ఫలితంగా వచ్చే కష్టాలను ఎదుర్కోడానికి ఎంత ఎక్కువ పుణ్యం సంపాదిస్తే అంత త్వరగా వీటి నుండి ఉపశమనం లభిస్తుంది. పాప పుణ్యాలనే త్రాసును అనుసరిస్తూ జీవితం నడుస్తుంది.

ఒక మరొక రకం :
స్వయంకృతాపరాధం. మానవుడు తన ప్రవర్తన వలన, తాను సృష్టించిన విషయాల వల్లే దుఃఖానికి లోనవుతున్నాడు. అంతు లేని కోరికలు దు:ఖానికి మూలకారణం. ఒక కోరిక తీరితే మరొక కోరిక సిద్ధం. ఈ కొత్త కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెడితే ఇంతకు ముందు తీరిన కోరిక తాలూకు ఆనందం మాయమైపోయి కొత్త దానిని సాధించాలన్న తపన మొదలవుతుంది. ఈ ప్రవాహంలో సుఖం అనేది మాయమైపోయి అనుక్షణం అశాంతి, ఆందోళనలు అనుభవం అవుతుంటాయి. కోరికల సాధనలో మనిషి తన శక్తికి మించి కృషి చేస్తూ యాంత్రికంగా జీవిస్తున్నాడు. మానవ సంబంధాలు విచ్ఛిన్నం, అంతరంగంలో అశాంతి, సమాజం పట్ల ద్వేషం, నిరాసక్తత పెంచుకుంటున్నాడు. సంఘజీవి నుండి ఒంటరివాడు అవుతున్నాడు. తత్ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు, సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

తన ఆనందం కోసం సృష్టించిన టి వి, సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాలకు బానిసైపోయి తీవ్ర అనారోగ్యం కొని తెచ్చుకుంటూ జీవితంలో అమూల్యమైన ఆనందాన్ని కోల్పోతున్నాడు. తాను ఎంతో శ్రమించి సంపాదించిన డబ్బు, డాక్టర్లకు, నర్సింగ్ హోంలకు తగలేసుకుంటూ తిరిగి ఆ డబ్బు సంపాదించడానికి నానా యాతన పడుతున్నాడు. ఇది ఎంత విచిత్రం?

ఈ సమస్యలకు మూలకారణం తనలోనే ఉందన్న సత్యాన్ని గుర్తెరిగి అందుకు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషిచేయాలి. అన్నింటిలో మితం ముఖ్యం. కష్టాలు, నష్టాలు రావడానికి గల కారణాలను సమూలంగా అన్వేషించి అందుకు పరిష్కారం కోసం కృషిచేయాలి. ముఖ్యంగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తన జీవన విధానాన్ని కూలంకషంగా పరిశీలించి సమస్యలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఇక తప్పించుకోలేని సమస్యలు ఎదురైతే బెదరకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కోవాలి. సమస్య కంటే శక్తివంతంగా ఎదగగలిగితే ఆ సమస్య బలహీనమైపోతుంది. సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నించడం పిరికిపందల లక్షణం. వారికి ఇహంలోనూ పరంలోనూ మనుగడ ఉండదు.

జీవితం పట్ల సానుకూల, ఆశావహ దృక్పథం ఏర్పరచుకుంటే అత్యంత ప్రజ్ఞావంతుడైన మానవుడు ఎన్ని అపజయాలు ఎదురైనా అదరక, బెదరక జీవనయాత్రను ఆత్మ స్థైర్యంతో సాగించటం సాధ్యం.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular