Monday, July 11, 2011

DEHAM, AATMALA BHEDAM CHEPPE SANKHYA YOGAM-దేహం, ఆత్మల భేదం చెప్పే సాంఖ్యయోగం


దేహం, ఆత్మల భేదం చెప్పే సాంఖ్యయోగం

త్రిగుణాలు కల్పిస్తున్న మోహం నుంచి బయటపడి ఈ చట్రమే నేననే భ్రమను తొలగించుకొని తన అసలు స్వరూపమైన ఆత్మను, పరమాత్మగా గుర్తించి తన స్వస్వరూప స్థితిని చేరుకోవాలి. అది యోగం చే సే పని.

భాగవత పురాణంలో తృతీయ స్కంధం (26వ అధ్యాయం)లో కపిల మహర్షి తన తల్లి దేవహుతికి ఈ సాంఖ్యయోగాన్ని బోధించినట్లుగా వస్తుంది. సాంఖ్యం ముఖ్యంగా ప్రకృతి, పురుషులను విశ్లేషించి చెబుతుంది. ప్రకృతి అనేది త్రిగుణాత్మకం. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ ప్రకృతిలో 24 తత్వాలున్నాయి. అవి పంచమహాభూతాలు - ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, భూమి, పంచతన్మాత్రలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, పంచ జ్ఞానేంద్రియాలు - త్వక్‌ (శరీరం), చక్షు(నేత్రాలు), శ్రోత్ర (చెవులు), జిహ్వ (నాలుక), ఘ్రాణ (నాసిక్‌), పంచ కర్మేంద్రియాలు - వాక్కు (నోరు), పాణి (చేతులు), పాదాలు (కాళ్లు), పాయువు, ఉపస్థలు (మలమూత్ర విసర్జనా ద్వారాలు). ఇవి మొత్తం ఇరవై. మిగిలిన నాలుగు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ ఇరవై నాలుగు కలిసి దేహం అనే చట్రం ఏర్పడింది.

వీటినే చతుర్వింశతి తత్వాలు అంటారు. వీటిలో చేరి నివసించేవాడు దేహి (ఆత్మ లేక జీవుడు). ఇతనితో కలిపి 25 తత్వాలు. (ఈ జీవుడు ఈశ్వరుని ప్రతిబింబమే. కనుక ఈశ్వరునితో కలుపుకొని 26 తత్వాలు అనడం కూడా కొన్ని సంప్రదాయాల్లో ఉంది. అంటే పంచవింశతి తత్వాలు అవుతాయి. ఈ 24 తత్వాలు ఆవరించుకొని త్రిగుణాలు సత్వ రజ స్తమో గుణాలు మూడు (ప్రకృతి) ఉన్నాయి. ఇవే జీవుడ్ని ఈ 24 తత్వాలలో బంధించి మోహ పరవశుడ్ని చేస్తాయి. అంటే జీవుడు తనకు వేరుగా ఉన్న ఈ తత్వాలతో కలిసిపోయి అవే నేననుకొని ఈ దేహమే నేననుకొనే భ్రమను కల్పించాయి. నిజానికి అవి వేరు తాను వేరు. ఇది సాంఖ్యం.
మరి యోగం ఏమిటి? యోగం ద్వారా ఈ త్రిగుణాలు కల్పిస్తున్న మోహం నుంచి బయటపడి ఈ చట్రమే నేననే భ్రమను తొలగించుకొని తన అసలు స్వరూపమైన ఆత్మను, పరమాత్మగా గుర్తించి తన స్వస్వరూప స్థితిని చేరుకోవాలి. అది యోగం చే సే పని.
ఏకమే అనేకం
దీనికి సరైన సమాధానం మనకు శ్రీ అరవిందుల పూర్ణయోగంలో లభిస్తుంది. తానొక్కడే అయిన దైవం తాను అనేక రూపాలు ధరించి తనను తాను ప్రకటించుకోవాలని (తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి - ఛాందోగ్యోపనిషత్‌) అని సంకల్పించాడు. ఆ సంకల్పమే శక్తి రూపం దాల్చి దైవసంకల్పాన్ని సాకారం చేయడం కోసం అనేక అంతస్థులుగా దిగి వచ్చింది. అలా ఏర్పడినవే సప్తలోకాలు. అవి సత్‌, చిత్‌, ఆనంద, విజ్ఞాన (దీనినే శ్రీ అరవిందులు అతిమానసం (సూపర్‌మైండ్‌)అన్నారు), మన్‌, ప్రాణ, భౌతికాలుగా ఏర్పడ్డాయి. అంటే దైవసంకల్పానికి ఆధారం ఏర్పడింది.

భౌతిక (పదార్థం)లో ఈ లోకాలన్నీ బీజప్రాయంగా ఉన్నాయి. పదార్థంలోని ప్రణం ప్రకటితమై సరీసృపాలు, సమస్త జీవకోటి ఉనికిలోకి వచ్చాయి. ఆ తరువాత పదార్థ, ప్రాణాల నుంచి మనస్సు వెలువడి మానవుడు ఆవిర్భవించాడు. ఈ మానవుడి నుంచి ఆ పైన ఉన్న విజ్ఞానం వెలువడి అతీత మానవులు - దివ్య మానవులు - ఉనికిలోకి రావాల్సి ఉంది. అంటే మానవుడు ఈ పరిణామ క్రమంలో ఒక మజిలీ మాత్రమే. అలా జరిగినప్పుడు త్రిగుణాలనేవి తమ రూపం మార్చుకుంటాయి.
సత్వగుణం వెలుగుగా, రజోగుణం శక్తిగా, తమోగుణం శాంతిగా రూపాంతరం చెందుతాయి. ఇంక మనఃప్రాణాలు కూడా తమ స్వభావాలను మార్చుకొని దైవంలోని అనంత వైభవాన్ని ప్రకటితం చేస్తాయి. అప్పుడే దైవసంకల్పం నెరవేరుతుంది. అనేకం అనేది ఏకానికి వ్యతిరేకం కాదు. అవి పరస్పర పూరకాలు. సూక్ష్మంగా ఇదీ శ్రీ అరవిందులు సృష్టి పరిణామానికి ఇచ్చిన వివరణ.

-కొంగర భాస్కరరావు

No comments: